ETV Bharat / opinion

కొవిడ్‌పై నిర్ణయాత్మక పోరు! - కరోనా కట్టడి చర్యలు

దేశవ్యాప్తంగా మార్చి ఒకటిన 15,500 కేసులు నమోదుకాగా, నేడు ఆ సంఖ్య 12 రెట్లకు పైబడటం భీతిల్ల చేస్తోంది. ఒకే చితిపై ఎనిమిది పార్థివ దేహాల దహనంతో మహారాష్ట్ర, రాయపూర్‌ ఆసుపత్రిలో శవాల కుప్పలతో ఛత్తీస్‌గఢ్‌- కొవిడ్‌ను నిర్లక్ష్యం చేస్తే చెల్లించాల్సి వచ్చే మూల్యాన్ని కళ్లకు కడుతున్నాయి. కంటికి కనపడని కొవిడ్‌పై యుద్ధంలో కనిష్ఠ ప్రాణనష్టంతో బయటపడాలంటే- పౌరులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలూ ఉదాసీనత వీడి బాధ్యతతో పరిశ్రమించాల్సిందే!

Covid-19 battle
కొవిడ్‌పై నిర్ణయాత్మక పోరు
author img

By

Published : Apr 15, 2021, 8:11 AM IST

ఏడువారాలుగా ఎడతెరిపిలేని కొవిడ్‌ ఉరవడి, నాలుగు వారాలుగా విగత జీవుల ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా భయానక దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాపోయింది. ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్నట్లు- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌, కేరళలతోపాటు మరో అయిదు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ బెంబేలెత్తిస్తోంది. సరిగ్గా మార్చి ఒకటిన దేశవ్యాప్తంగా 15,500 కేసులు నమోదుకాగా, నేడు ఆ సంఖ్య 12 రెట్లకు పైబడటం భీతిల్ల చేస్తోంది. ఒకే చితిపై ఎనిమిది పార్థివ దేహాల దహనంతో మహారాష్ట్ర, రాయపూర్‌ ఆసుపత్రిలో శవాల కుప్పలతో ఛత్తీస్‌గఢ్‌- కొవిడ్‌ను నిర్లక్ష్యం చేస్తే చెల్లించాల్సి వచ్చే మూల్యాన్ని కళ్లకు కడుతున్నాయి. నిరుటి కొవిడ్‌ పతాక స్థాయిని తాజా విజృంభణ దాటేసిందంటున్న కేంద్రం- కరోనా మార్గదర్శకాల్ని పట్టించుకోకపోవడం, స్థానిక ఎన్నికలు, పెళ్ళిళ్లు వంటి సమూహ సంబరాలతో నేటి ఉత్పాతం విరుచుకుపడిందని తీర్మానించింది. నిరుటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమలైన 'కొవిడ్‌ ప్రొటోకాల్‌'ను ఇప్పుడు ఎన్నికల సంఘం ఏ గంగలో కలిపింది? భగవంతుడిపై భక్తే కొవిడ్‌ను తరిమికొడుతుందన్న సూత్రీకరణలతో మొదలైన కుంభమేళా- కరోనా విశృంఖలత్వానికి కారణమవుతోంది!

టీకాలు అందరికీ చేరకుండానే, కేవలం అవి వచ్చేశాయన్న దిలాసాతో పౌరులనుంచి ప్రభుత్వాలదాకా ప్రదర్శించిన నిష్పూచీతనం- కొవిడ్‌కు కొత్త కోరలు తొడిగింది. ముందు జాగ్రత్తలపై పౌరుల్లో ఉదాసీనతతోపాటు కొత్త ఉత్పరివర్తనాల జోరూ జతపడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిరుడు ఈ రోజుల్లో మాదిరే ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ల కొరత కమ్ముకొస్తోంది. స్పుత్నిక్‌-వి సహా విదేశీ టీకాల అత్యవసర వినియోగానికి సమ్మతించిన కేంద్రం- రాష్ట్రాల్లో స్వస్థ సేవల రంగం కుంగిపోకుండా ఔషధ తయారీ పరిశ్రమతో సమన్వయం కుదుర్చుకొని కొవిడ్‌పై సమరాన్ని బహుముఖంగా సాగించాల్సిన సమయమిది!

బాధ్యతతో పరిశ్రమించాల్సిందే..

ప్రపంచానికే వ్యాక్సిన్‌ రాజధానిగా పేరెన్నికగన్న ఇండియా- ఇప్పటికి దేశ జనావళిలో రెండు డోసులూ ఇచ్చింది 0.7 శాతానికే కావడం; తొలి టీకా తీసుకొన్నవారి సంఖ్య ఆరు శాతం లోపే ఉండటం ఆందోళనకరమే. ప్రతి రోజూ అరకోటి టీకాలు అందిస్తే తప్ప కొవిడ్‌పై పోరులో ధీమాగా పురోగమించలేమని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లపై జనంలోగల భయ సందేహాల్ని పటాపంచలు చేయకపోవడం, అవసరమైన మేరకు రాష్ట్రాలకు టీకాలు అందుబాటులోకి రాకపోవడం- మహమ్మారిపై యుద్ధాన్ని నీరుగారుస్తున్నాయని చెప్పకతప్పదు. టీకా తీసుకొంటే కొవిడ్‌పై సమరానికి శరీరం సన్నద్ధంగా ఉంటుందని, ప్రాణాపాయంనుంచి బయటపడవచ్చన్న సందేశాన్ని జన సామాన్యానికి విస్తృతంగా చేరవేయాల్సింది ప్రభుత్వాలే. టీకాల ఉత్పత్తిని పెద్దయెత్తున చేపట్టేందుకు వీలుగా నిధులందించాలని దేశీయ సంస్థలు ఇప్పటికే కేంద్రాన్ని అర్థించాయి. వ్యాక్సిన్‌ పరిశోధన- అభివృద్ధి, తయారీలో నిమగ్నమైన దేశీయ కంపెనీలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు 'మిషన్‌ కొవిడ్‌ సురక్ష' పథకాన్ని, టీకాల కోసం బడ్జెట్లో రూ.35వేల కోట్లనూ ప్రకటించిన కేంద్రం- దేశ జనావళి అందరికీ టీకా అందించడమే లక్ష్యంగా వడివడిగా కదలాలి. ఫైజర్‌, మోడర్నాల టీకాల ధరవరలు ఇక్కడి ప్రజలకు చుక్కలు చూపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌పై అమెరికాలో తలెత్తిన ఆరోగ్య వివాదాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఆక్సిజన్‌ నిల్వలకోసం ఉక్కు కర్మాగారాలు, చమురు రిఫైనరీల్ని ఆశ్రయిస్తున్న కేంద్రం, రెమ్‌డెసివర్‌లాంటి మందులు అర్ధాంతరంగా అంతర్ధానమైపోకుండా కాచుకోవాలి. కంటికి కనపడని కొవిడ్‌పై యుద్ధంలో కనిష్ఠ ప్రాణనష్టంతో బయటపడాలంటే- పౌరులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలూ ఉదాసీనత వీడి బాధ్యతతో పరిశ్రమించాల్సిందే!

ఇదీ చూడండి: కొవిడ్ పంజా-'మహా'లో కొత్తగా 59వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.