ETV Bharat / opinion

సంస్కరణల పథంలో విద్యుత్‌ రథం - power sector news

పెద్ద ఎత్తున విద్యుత్​ను దేశంలోని అత్యధిక ప్రాంతాలకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగినప్పటికీ- విద్యుత్తు రంగంలో ఇంకా చేయాల్సిన సంస్కరణలు మరీ ముఖ్యంగా పంపిణీ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2020-ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. విద్యుత్తు రంగంలో ఇప్పటి వరకు చేపట్టిన, చేపట్టబోయే సంస్కరణలను తెలుసుకుందాం.

Electricity
సంస్కరణల పథంలో విద్యుత్‌ రథం
author img

By

Published : May 1, 2020, 8:41 AM IST

స్వాతంత్య్రానంతరం దేశంలో విద్యుత్‌ రంగం ఎన్నో మార్పులకు లోనైంది. సమృద్ధిగా, నాణ్యమైన విద్యుత్తు అందుబాటులో ఉంటేనే దేశాభివృద్ధి సుసాధ్యమవుతుంది. జాతి మౌలిక రంగాన్ని అంచనా వేయడంలో విద్యుత్తు లభ్యతే కీలకం. అందరికీ నాణ్యమైన విద్యుత్తు చేరువ చేయడం ఒక్క రోజులో సాధ్యమయ్యే పనికాదు. అందుకు నిర్దిష్ట ప్రణాళికతోపాటు అమలులో చిత్తశుద్ధీ ఎంతో ముఖ్యం. పెద్దయెత్తున విద్యుత్తును దేశంలోని అత్యధిక ప్రాంతాలకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగినప్పటికీ- విద్యుత్తు రంగంలో ఇంకా చేయాల్సిన సంస్కరణలు మరీ ముఖ్యంగా పంపిణీ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు ఎన్నో ఉన్నాయి.

నూతన పరిష్కారాలు

రాష్ట్రాల విద్యుత్తు బోర్డుల నిర్మాణంతోనే దేశంలో సంస్కరణలు మొదలయ్యాయి. స్వతంత్రంగా నిలదొక్కుకొనేందుకు వీటిలో వాణిజ్య దృక్పథాన్ని చొప్పించాల్సి వచ్చింది. క్రమానుగతంగా ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటునూ ఇందుకు జతపరిచారు. తొలుత ఉత్పత్తి రంగానికి, ఆ తరవాత సరఫరా, అనంతరం పంపిణీ రంగాలకు దీన్ని విస్తరించారు. ప్రస్తుతం ఉత్పత్తి రంగంలో దాదాపు సగభాగం ప్రైవేటు అజమాయిషీలోనే ఉంది. సంస్కరణల్లో భాగంగా విద్యుత్తు నియంత్రణ సంస్థల ఏర్పాటు, ఛార్జీలను ప్రభుత్వం కాకుండా ఈ సంస్థలే నిర్ణయించడం; మొత్తం విద్యుత్తు రంగాన్ని ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలుగా విభజించి, వేటికవే స్వతంత్రంగా పనిచేసే విధంగా వర్గీకరించడం; విద్యుత్తు చౌర్యాన్ని అరికట్టడం; అధునాతన సాంకేతికతను జోడించి వ్యవస్థలను మెరుగుపరచటం; ఆర్థిక స్వావలంబన దిశగా ఈ సంస్థలను సిద్ధం చేయటం వంటి అనేక చర్యలను ప్రభుత్వాలు చేపట్టాయి. ఇందుకు అవసరమైన చట్టాలను క్రమంగా రూపొందించుకుంటూ వచ్చారు. 1948 చట్టం, 1998 నియంత్రణ కమిషన్‌ చట్టం, 2003 సమగ్ర విద్యుత్తు చట్టం ఇందులో ముఖ్యమైనవి. అలాగే 2005లో రూపొందించిన జాతీయ విద్యుత్తు విధానం, 2006లో రూపొందించిన టారిఫ్‌ విధానం, 2015లో ప్రవేశపెట్టిన ఉదయ్‌ పథకం, 2019లో తీసుకొచ్చిన ‘లెటర్‌ అఫ్‌ క్రెడిట్‌’ విధానం ఇందులో కీలకమైనవి. ఇంత చేసినా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో తలెత్తుతున్న సమస్యలు, విద్యుత్తు పునరుత్పాదక విధానం లేకపోవటం, పంపిణీ సంస్థలు ఉత్పాదక సంస్థలకు చెల్లింపులు సకాలంలో చేయకపోవడం, విద్యుత్తు చార్జీల నిర్ణయంలో సమన్యాయం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో సబ్సిడీ మొత్తాన్ని పంపిణీ సంస్థలకు చెల్లించకపోవడం, ‘క్రాస్‌ సబ్సిడీ’లు కొనసాగడం లాంటి అనేక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్ని తిరగదోడటం కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది. దానితో ఒక దశలో అంతర్జాతీయ సంస్థలు తమ పెట్టుబడులను పునఃసమీక్షించుకుంటామనీ కేంద్రాన్ని బెదిరించాయి. కొత్త పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం 2003నాటి విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. ఈ నెల 17న ఈ ముసాయిదా సవరణలను విద్యుత్తు శాఖ ‘వెబ్‌సైట్‌’లో ఉంచారు. దీనిపై జూన్‌ అయిదో తేదీవరకు సలహాలు, సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లూ తెలిపారు. అనంతరం తుది ముసాయిదాను రూపొందించి వచ్చే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్తు ఒప్పందాల అమలు అథారిటీ ఏర్పాటు అన్నది ఇందులో కీలకమైన సంస్కరణ. ఇకనుంచి విద్యుత్తు ఒప్పందాలపై వచ్చే వివాదాలను ఈ అథారిటీయే పరిష్కరిస్తుంది. దానికోసం సివిల్‌ కోర్టుకి సమాన హోదాలో అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తారు. అథారిటీ తీర్పు నచ్చనివారు ఈ ట్రైబ్యునల్‌కు వెళ్ళొచ్చు. దీనివల్ల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయి. ఇప్పుడున్న అనేక ఎంపిక కమిటీల స్థానే ఒకే ఎంపిక కమిటీ ఉండనుంది. అదే అన్ని అథారిటీలకు సంబంధించిన నియామకాలు చేపడుతుంది. ఆ రకంగా నియామకాల హేతుబద్ధీకరణ జరుగుతుంది. అలాగే ఇంతవరకు ఉన్న జాతీయ విద్యుత్తు విధానానికి అదనంగా జాతీయ పునరుత్పాదక విద్యుత్తు విధానాన్ని ప్రవేశపెట్టేందుకూ ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది.

విస్తృత చర్చ అవసరం

విద్యుత్తు ఛార్జీల విషయంలో ఈ ముసాయిదా ప్రస్తుత విధానం స్థానే పెనుమార్పులు ప్రతిపాదిస్తోంది. ఛార్జీల్లో సబ్సిడీలను తీసివేసి వాస్తవ ఖర్చుకు అనుగుణంగా ఒకే ‘టారిఫ్‌’ని ప్రవేశపెడుతోంది. ఇప్పుడున్న విధానంలో గృహ వినియోగదారులకు ఒక టారిఫ్‌, పరిశ్రమలకు వేరే టారిఫ్‌, వాణిజ్య అవసరాలకు ఇంకో టారిఫ్‌ అమలులో ఉంది. అలాగే వ్యవసాయానికి ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో రకరకాల రాయితీలు ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా, మరికొన్ని రాష్ట్రాల్లో నామమాత్రంగా వసూలు చేస్తున్నారు. ఇకనుంచి అన్ని విభాగాలకూ ఒకే ‘టారిఫ్‌’ విధానం అమలవనుంది. అవసరమైతే ‘స్లాబులను’ ఇప్పటిలాగే ఉంచుకోవచ్చు. ముసాయిదా సంస్కరణల్లో ఇది ప్రధాన మార్పు. ఈ పద్ధతి ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల్లో అమలవుతోంది. ఎగుమతి ప్రధాన దేశాల్లో విద్యుత్తు ఛార్జీలు పరిశ్రమలకు తగు మోతాదులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టే వాటి ఉత్పత్తులు ప్రపంచ విపణిలో ధరల రీత్యా పోటీకి తట్టుకోగలుగుతున్నాయి. అదే భారత్‌లో పరిశ్రమలకు అధిక ‘టారిఫ్‌’తో పాటు దానిపై సర్‌ఛార్జ్‌ సైతం విధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సొమ్మును వాయిదా వేయడం; మిగతా రావాల్సిన ఆదాయపు బాకీలను లెక్కించక పోవడంపై కఠినతరమైన నిబంధనలు ఈ బిల్లులో పొందుపరిచారు. పంపిణీ సంస్థలకు ఉప లైసెన్సీలను, ఫ్రాంచైజీలను నియమించుకొనే వీలుకల్పించారు. దీనితో మరింత ప్రైవేటీకరణకు ఆస్కారం ఏర్పడుతుంది. జల విద్యుత్తును సైతం పునరుత్పాదక విద్యుత్తుగా వర్గీకరించారు. పంపిణీ సంస్థలు ఉత్పత్తిదారులకు చెల్లింపులు చేస్తేనే విద్యుత్తు సరఫరా సాగేట్లు నిబంధనలు మార్పు చేశారు.విద్యుత్తు ఒప్పందాలపై పూర్తి నియంత్రణ, ఏకీకృత ‘టారిఫ్‌’ విధానం, సబ్సిడీల హేతుబద్ధీకరణ, సబ్సిడీ సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయటం, పంపిణీ సంస్థల చెల్లింపులపై పూర్తి నియంత్రణ, పంపిణీ సంస్థల ఆర్థిక స్వావలంబన, రాష్ట్ర ప్రభుత్వాల చెల్లింపులపై జవాబుదారీతనం, నూతన జాతీయ విద్యుత్తు పునరుత్పాదక విధానం, వివాదాల పరిష్కారంలో వేగం, ఉత్పత్తి సంస్థలకు చెల్లింపు భద్రత వంటి సంస్కరణలను ఈ బిల్లు ద్వారా లక్షించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాల హక్కులకు విఘాతం కలుగుతుందని, రాష్ట్ర నియంత్రణ సంస్థలు నామమాత్రమవుతాయని; గృహ వినియోగదారులకు, వ్యవసాయానికి విద్యుత్తు ఛార్జీలు భారమవుతాయని భావించే వారూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేలోగా దీనిపై సవిస్తర చర్చ జరిగితే మేలు!

ఛార్జీల మోత?

భారత్‌లో తయారైన వస్తువులు ప్రపంచ విపణిలో పోటీకి నిలవలేకపోతున్నాయి. ఇందుకు అధిక ధర కూడా ఓ ముఖ్య కారణం. అందుకే అన్ని రంగాలకూ ఒకే ‘టారిఫ్‌’ విధానం తీసుకురావాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అదే సమయంలో గృహ వినియోగదారులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తే ఆ డబ్బు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. అంటే ఇప్పుడు వంటగ్యాస్‌ పద్ధతిలోనన్న మాట! దీనితో సబ్సిడీ విధానంలోనూ హేతుబద్ధీకరణ జరుగుతుంది. ‘క్రాస్‌ సబ్సిడీ’ రద్దవుతుంది. ఇది అమలైతే గృహ వినియోగదారులకు ఇప్పటికన్నా ఎక్కువ ఛార్జీపడుతుందన్న మాట వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

- కె.రామకోటేశ్వరరావు (రచయిత- ఆర్థిక, సామాజిక విశ్లేషకులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.