ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీరాలలోని వై.ఏ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల అధ్యాపక బృందం అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మానవత్వపు గోడ అని ఒక నూతన ఆలోచనకు నాంది పలికింది. విద్యార్థునులకు అవసరం లేని దుస్తులు, వస్తువులు తీసుకొచ్చి అక్కడ ఉంచుతారు. వారం రోజుల తరువాత వచ్చి వాటిని అనాథలకు, నిరుపేదలకు పంచుతారు.
ప్రతిరోజు ఒక్కో విద్యార్థిని 2 రూపాయలు ఒకడబ్బాలో వేసి నెలకోసారి అనాథ శరణాలయాలకు ఇస్తుంటారు. ఈ చర్యతో విద్యార్థుల్లో దయ, కరుణ, సమాజం పట్ల అంకితభావం ఏర్పడతాయని కళాశాల ప్రధానాచార్యురాలు చెపుతున్నారు
మొక్కలు పెంచటం, వాటిని పంచటం, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రజలకు చెప్పటం కళాశాలలోని జాతీయసేవా విభాగం విద్యార్ధినుల దినచర్య. విద్యతో పాటు సమాజానికి ఉపయోగపడే పనులు చేయటం తమకు సంతోషంగా ఉందంటున్నారీ విద్యార్థులు. ఎదుటిమనిషి కన్నీళ్లు తుడవటానికి రక్తసంబంధమే అవసరంలేదని... పిడికెడు మానవత్వం ఉంటే చాలని నిరూపిస్తున్నారు.