పెళ్లితో పెనవేసుకున్న మీ అనుబంధం కలకాలం ఆనందంగా కొనసాగాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.
భేషజాలు వద్దు.. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న కోపతాపాలు, అలకలు, గొడవలు సహజమే. అంత మాత్రానా ముఖం మాడ్చుకుని, ముభావంగా, కోపంగా ఉండకండి. తప్పులు, పొరబాట్లు అనేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అవి ఎవరి వల్ల జరిగినా క్షమాపణలు చెప్పడంలో మీరు ముందుండాలి. ఇలా చేస్తే గొడవ ఆదిలోనే ఆగిపోతుంది. మీరు చెప్పే ఈ మాట వల్ల ఎదుటివారి కోపం మబ్బులా తేలిపోతుంది. మంచులా కరిగిపోతుంది. ఇలాంటి సమయంలో భేషజాలకు పోవద్దు. మనస్ఫూర్తిగా భాగస్వామిని క్షమించమని అడగండి. ఎదుటివారు ఫిదా అయిపోతారు.
చెప్పేది వినండి... భార్యభర్తల్లో ఎవరో ఒకరు తాము చెప్పేదే రెండోవాళ్లు వినాలనుకుంటారు. విషయాన్ని ఒకవైపు మాత్రమే ఆలోచిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏ విషయమైనా ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. జీవిత భాగస్వామికీ మాట్లాడే అవకాశాన్నీ ఇవ్వాలి.
కోపం వద్దు... మాటా మాటా.. అనుకున్నప్పుడు ఎదుటివారిపై ఒకింత కోపం ఉండటం సహజమే. అయితే దాన్నలా పెంచి పోషించొద్దు. కాసేటికే మర్చిపోవాలి. అప్పుడే మీరు కలకాలం ఆనందంగా ఉండగలుగుతారు.
దూరంలో దగ్గరగా.. కొన్ని ఉద్యోగాల్లో చాలాసార్లు ప్రయాణాలు, వేరే ఊళ్లకు వెళ్లడాలు తప్పనిసరి. అయితే మనుషులు దూరంగా ఉన్నా... మనసులు మాత్రం మీ వద్దే పదిలంగా ఉన్నాయనుకోండి. భాగస్వామి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకోండి. ‘ఎలా ఉన్నావ్’ అంటూ మీరు పంపే చిన్న సందేశం వారిలో అంతులేని ఆనందాన్ని అందిస్తుంది.
కలిసి తినండి... దంపతులిద్దరూ ఎంత బిజీగా ఉన్నా రోజులో ఏదో సమయంలో ఇద్దరూ కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఆ సమయంలో సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకరి విషయాలను మరొకరు పంచుకుంటూ ఆనందంగా ఉండాలి.
- ఇదీ చదవండి : భార్యాభర్తలు ఇలా చేస్తే బలమైన బంధం మీదే!