రాశి జీతాన్ని భర్తకే ఇచ్చేస్తుంది. అవసరమైనప్పుడు అడిగి తీసుకుంటుంది. అత్యవసర సందర్భాల్లో తన బ్యాగులో రూపాయి కూడా లేకపోవడం ఆమెను వేదనకు గురిచేస్తోంది. ఆ మాటే భర్తతో అంటే నీకేం ఖర్చులుంటాయి అంటాడు. ఇటువంటివే బంధాన్ని బీటలు(Financial Independence in Relationship) వారుస్తాయని అంటున్నారు మానసిక నిపుణులు.
ఇంటి అవసరాల గురించి ఇల్లాలికి తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. ఆర్థిక నిపుణురాలిగా ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెట్టే ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని(Financial Independence in Relationship) అందిస్తే ఆ ఇల్లు నందనవనమవుతుంది. ఉద్యోగిని అయితే ఆమెనే ఇంటికి కావాల్సిన వాటిని చూడాలని చెబుతూనే, ఆమె అవసరాలనూ గుర్తించాలి. తన సంపాదనపై పూర్తి హక్కు ఉంటే ఆమె కుటుంబం గురించి కూడా ఆలోచించగలదు. ఆ భరోసా ఆమెపై ఉంచితే సంసారాన్ని మరింత ముందుకు జాగ్రత్తగా నడిపిస్తుంది.
ప్రోత్సహిస్తేనే...
భార్య సంపాదన తన సొంతమనే భావన భర్తలో ఉండకూడదు. భార్యాభర్తల మధ్య సానుకూల సంభాషణ జరగాలి. ఇరువురూ తమ అభిప్రాయాలు, అభిరుచులూ తెలుసుకోగలగాలి. ఆమెకు ఎన్నో కలలుండొచ్చు. మరిన్ని కోర్సులు చేయాలనే లక్ష్యం ఉంటుంది. అటువంటి వాటిని గుర్తించి ప్రోత్సహించాలి. సంపాదనకు కాకుండా ఆమె వ్యక్తిత్వానికి విలువనిస్తే చాలు. కుటుంబం సంతోషంతో నిండిపోయేలా ఆమె చేయగలదు. గృహిణికెందుకు ఆర్థిక స్వేచ్ఛ అనుకోకుండా, వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాలి. అప్పుడే ఆమె నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికప్రణాళిక వేయడంలో ‘ఆమె’ను మించిన వారు ఎవరూ ఉండరు.