* కొందరు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. తెలిసిన విషయాల్ని అమ్మానాన్నలతో పంచుకోవాలని ఆరాటపడతారు. కానీ వారేమో... ‘నాకు పనుంది పోయి ఆడుకో. ఆఫీసుకి టైమ్ అవుతుంది ఆగు’ అంటూ వాళ్ల మాటల్ని మధ్యలోనే ఆపేస్తుంటారు. దీనివల్ల పిల్లలతో మీకు ఉన్న అనుబంధానికి అవరోధాలు ఏర్పడవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వాళ్లేం చెబుతున్నారో వినండి. లేదంటే... మీకు ఏం చెప్పాలన్నా ఆసక్తి చూపించరు. అలాకాకుండా వారి సమస్యలకు పరిష్కారం చూపించండి. అప్పుడే మీపై చనువుని పెంచుకుంటారు.
* చిన్నారులతో మాట్లాడేటప్పుడు ముఖాన్ని చిట్లిస్తూనో లేదా గుర్రుగా చూస్తునో మాట్లాడొద్దు. ఇలా చేస్తే వారికి మీ మీద ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. నవ్వుతూ, బుజ్జగిస్తూ తప్పొప్పులను తెలియజేయాలి. ప్రేమగా మార్చుకోవాలి.
* పిల్లలంటేనే సందేహాల పుట్టలు. ప్రతి విషయం వారికి తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్లు ఏ సందేహం అడిగినా విసుక్కోకండి. వివరణ ఇవ్వండి. చిన్నారులు తెలియని విషయాలు అమ్మానాన్నలు చెబుతుంటే ఆసక్తిగా వింటారు. అలా అన్ని విషయాల మీద అవగాహన పెంచుకుంటారు. గాడ్జెట్లతో కాకుండా మీతోనే ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడతారు.
ఇదీ చూడండి: అప్పులు చేసి పెడితే.. తిప్పలు పెడతారా?