డిగ్రీ మొదటి సంవత్సరంలో పరిచయం దగ్గర చేసింది. స్నేహంగా మెలిగిన వారిద్దరూ ప్రేమికులుగా మారారు. ఉద్యోగాల్లో చేరాక సహజీవనం సాగించారు. అక్కడ అభిప్రాయ భేదాలు రావటంతో ఎవరి ప్రయాణం వారే చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. సామాజిక మాధ్యమాలు, కలసి దిగిన ఫొటోలు వంటివి పరస్పర అంగీకారంతో తొలగించారు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వెళ్లేముందు ఖరీదైన హోటల్‌లో థీమ్ పార్టీతో సహచర ఉద్యోగుల మధ్య గడిపారు. ఇది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు బంజారాహిల్స్‌లో చోటుచేసుకున్న సంఘటన. ఇది అతిగా ఉందని కొందరు కొట్టిపారేస్తే మున్ముందు చికాకులు ఉండకుండా తెలివిగా వ్యవహరించారన్నారు ఇంకొందరు.
భయాలు ఉంచుకోకుండా
వింతగా.. అతిగానూ అనిపించినా నగరంలో ఇటీవల ప్రేమికులు, యువ దంపతులు స్నేహపూర్వకంగా విడిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. సమాజం, కుటుంబంలో తాము చులకన గాకుండా, వేరయ్యాక ఒకరి నుంచి మరొకరికి ఏదైనా ప్రమాదం ఎదురవుతుందనే అనుమానం, భయాలు లేకుండా ఉండేందుకు ఇవి చక్కగా ఉపయోగపడతాయంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు.
అలుసు కావొద్దు..
కలవని మనసులు, కుదరని అభిప్రాయభేదాలు.. వీటి మధ్య సాఫీగా కలసి ఉండలేరు. నిత్యం పోట్లాటలతో కెరీర్, ఆరోగ్యం పాడు చేసుకోవాల్సి వస్తోంది. దీన్ని పసిగట్టి ముందు చూపుతో ఇద్దరూ కలసి నిర్ణయానికి వస్తున్నారు. ఇలాంటి వారిలో కొన్ని జంటలు ఇద్దరూ కలిసుండే ఆఖరి రోజును ఆత్మీయులతో కలసి ఆనందంగా జరుపుకొంటున్నారు. విందులు, వినోదాల మధ్య బంధాలకు ఆనందగా వీడ్కోలు పలుకుతున్నారు.
ఈవెంట్లు.. పోస్టర్లు
రూ.లక్షన్నర ఖర్చులో తమకో పార్టీ ఏర్పాటు చేయాలని.. అక్కడ ఇప్పటి వరకూ వచ్చిన ప్రేమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఉంచాలంటూ ఓ యువకుడు తమకు ఈవెంట్ బాధ్యత అప్పగించారని కూకట్‌పల్లికి చెందిన ఈవెంట్ మేనేజర్ ఒకరు తెలిపారు. ఓ హోటల్‌లోని ఫంక్షన్ హాల్లో దీనికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తీరా చూస్తే అది లవర్స్ బ్రేకప్ పార్టీ అని తెలిసిందని తనకు ఎదురైన సంఘటన వివరించారు. పదేళ్ల తన కెరీర్‌లో మొదటిసారి ఇలాంటి వేడుక చూడటం అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు.
పిల్లల సంరక్షణలో స్పష్టత ఉండాలి..
ఉన్నత చదువులు, పరిణితితో ఆలోచించే దంపతులు విడిపోయే ముందు కూడా పరస్పర అంగీకారంతోనే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. పిల్లలున్న దంపతులు వారి బాగోగులు, సంరక్షణ విషయంలో స్పష్టంగా ఉంటున్నారు. స్నేహపూర్వకంగా వేరవుదామనే ఉద్దేశంతో ఆత్మీయులతో కలసి కిట్టీ పార్టీలు జరుపుకోవటం నగరాల్లో ప్రస్తుతం సాధారణంగా మారిందని వర్దమాన సినీనటి ఒకరు తెలిపారు. కేసులు, న్యాయస్థానాల, పెద్దల వద్ద పంచాయితీలు లేకుండా ఇదొక రాజీమార్గమని వివరించారు. తన స్నేహితురాలు కూడా సినిమాల్లో అవకాశం రావటంతో బ్రేకప్ పార్టీ కోసం బాగానే ఖర్చు చేసిందంటూ తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు.
పాజిటివ్ బ్రేకప్
సాధారణంగా ప్రేమికులు విడిపోతే మానసికంగా కుంగిపోయేవారు. సున్నిత మనస్కులు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అంత ధైర్యం చేయలేకపోతే చేతిలో మద్యం సీసాతో దేవదాసు, మజ్నూలుగా మారేవారు. ప్రస్తుతం దూరమవ్వాల్సి వస్తే తేలికగా తీసుకునేవారూ పెరుగుతున్నారు. రెండు, మూడేళ్లు కలిసున్న తరువాత ఆరోగ్యకర వాతావరణంలో విడిపోవటం చాలా మంచిదని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్లా విశ్లేషించారు.
ఇదీ చూడండి: పిల్లల ముందు గొడవలొద్దు!