ఆఫీసులో పనిగంటలు పెరగడం, విరామం లేకుండా పనిచేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. దాంతో విపరీతమైన బడలికగా, మగతగా ఉండటం, తల, కండరాల నొప్పి, పట్టేసినట్లు ఉండటం (ఫాటిగ్యు) లాంటి సమస్యలు ఉత్పన్నం కావొచ్ఛు ఇందుకోసం ఎక్కువ ఆహారం తీసుకుంటే చాలు అనుకోవద్ధు ఇక్కడ పరిమాణం కంటే...తీసుకునే పోషకాలు ముఖ్యం.
శక్తినీ, బలాన్నీ ఇచ్చే సమతులాహారం మీ రోజువారీ ఆహార ప్రణాళికలో ఉండాలి. ఉదాహరణకు ఒక నువ్వుల లడ్డూ, పల్లీ చిక్కీ, అదనంగా ఓ పండూ, కప్పు పాలూ, పెరుగూ, గుప్పెడు ఉడికించిన సెనగలు లాంటి వాటిని రోజూ తీసుకునే అల్పాహారం, భోజనంతో పాటు అదనంగా తీసుకోవాలి. వీటి నుంచి మీకు కావాల్సిన అదనపు విటమిన్లూ, మినరళ్లూ, పోషకాలూ లభిస్తాయి. అలాగే మీరు రోజూ ఏమేం తింటున్నారో ఓసారి గమనించుకోండి.
పచ్చళ్లు, వేపుళ్లు, స్వీట్లు వద్దు
పళ్లరసాలూ, వేడి వేడి జావలు తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. వీటివల్ల అదనపు కెలొరీలు పెరిగే అవకాశమూ లేదు. పైన చెప్పినట్లు ఆహారంతోపాటు అదనపు పోషకాలు తీసుకుంటున్నా కూడా అలసటా అనిపిస్తే ఈ ద్రవాలను తాగడం తప్పనిసరి. తరచూ అల్పాహారం దాటేయడం, మిగిలిపోతుంది కదా అని మూడు పూటల అన్నమే తినడం వంటివి చేస్తుంటారు చాలామంది. ఇది సరికాదు. విటమిన్-బి, డి ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. లేదా నిపుణుల సలహాతో సప్లిమెంట్స్ వాడొచ్ఛు పచ్చళ్లూ, స్వీట్లూ, వేపుళ్లను తగ్గించాలి. వాటి స్థానంలో తృణధాన్యాలు, పొట్టుతో ఉన్న పప్పులూ, తాజా పండ్లూ, పాలు, పాల పదార్థాలను క్రమం తప్పకుండా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇలా మూడు నాలుగు వారాలపాటు ఆహారంలో మార్పులు చేసుకుని, సప్లిమెంట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే మీ సమస్య దూరమవుతుంది.
- డా. జానకీ శ్రీనాథ్, పోషకాహార నిపుణులు