మసాజ్ అంటే.. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల దాకా నూనె రాసుకొని కాసేపు చేత్తో రుద్దుకుంటుంటారు చాలామంది. అయితే దీనికీ ఓ పద్ధతుందని చెబుతున్నారు రుజుత. ఇలా ఒక క్రమ పద్ధతిలో మసాజ్ చేసుకోవడం వల్ల దాని ప్రయోజనాలను పూర్తిగా పొందచ్చంటూ ఆ విధానాన్ని ఇన్‌స్టా పోస్ట్ రూపంలో వివరించారామె.
ఇంట్లోనే ఈజీగా..
జుట్టు నిర్జీవంగా మారడం, పీసీఓఎస్, థైరాయిడ్.. వంటి సమస్యలతో బాధపడే వారితో పాటు ఇతరుల్లోనూ జుట్టు విపరీతంగా రాలిపోవడం, చుండ్రు, అలొపేసియా (కుదుళ్లలో అక్కడక్కడా జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం).. తదితర జుట్టు సమస్యలన్నీ కుదుళ్ల నుంచే మొదలవుతాయి. అందుకే ముందుగా దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో వారానికోసారి కుదుళ్లను మసాజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగని అందుకోసం పార్లర్లు/స్పాలకే వెళ్లక్కర్లేదు. ఇంట్లోనే సులభంగా ఎవరికి వారు మసాజ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఈ ప్రత్యేకమైన నూనెను తయారుచేసుకోవాల్సి ఉంటుంది.
నూనె తయారీ ఇలా..

కావాల్సినవి
* కొబ్బరినూనె - కప్పు
* కరివేపాకు రెబ్బలు - గుప్పెడు
* మెంతులు - టీస్పూన్
* అలీవ్ గింజలు - టీస్పూన్
* మందార పువ్వు - ఒకటి
తయారీ
ముందుగా ఒక ఇనుప పాత్రలో కొబ్బరి నూనె తీసుకొని వేడి చేయాలి. ఇప్పుడు స్టౌ కట్టేసి అందులో కరివేపాకు, మెంతులు, అలీవ్ గింజలు, మందార పువ్వు వేసి మూత పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాల్లోని పోషకాలన్నీ కొబ్బరి నూనెలోకి బాగా ఇంకుతాయి. ఉదయాన్నే నూనెను వడకట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకోవచ్చు. దీన్ని మరుసటి రోజు తలస్నానం చేస్తామనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి తలకు పట్టించి మసాజ్ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
మసాజ్ ఎలా చేయాలంటే..
చాలామంది మసాజ్ అనగానే.. జుట్టుకు, కుదుళ్లకు నూనె బాగా పట్టించి కాసేపు రుద్దుతుంటారు. కానీ అలా పైపైన మసాజ్ చేయడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేయడం వల్ల దాన్నుంచి పొందాల్సిన ప్రయోజనాలన్నీ కుదుళ్లకు అందుతాయి. ఈ క్రమంలో..
* ముందుగా తల మధ్య భాగంలోని కుదుళ్ల వద్ద కొద్దిగా నూనె పోసి అరచేత్తో ముందుకి, వెనక్కి అనాలి.
* ఆ తర్వాత అదే అరచేతితో పది సార్లు నెమ్మదిగా స్ట్రోక్స్ ఇవ్వాలి.
* ఇప్పుడు చేతి మునివేళ్లకు నూనె రాసుకొని.. రెండు బొటనవేళ్లను చెవుల వెనకాల ఉంచాలి. మిగతా వేళ్లతో కుదుళ్ల కింది భాగం నుంచి పైవైపుగా గుండ్రంగా మర్దన చేసుకుంటూ రావాలి.
* ఆ తర్వాత మెడ వెనక భాగంలో మధ్య వేళ్లతో కింది నుంచి పైకి నాలుగైదు సార్లు మసాజ్ చేయాలి.
* ఇప్పుడు ఇంతకుముందులాగే మునివేళ్లకు నూనెను అప్లై చేసుకొని.. రెండు బొటన వేళ్లను చెవుల ముందు భాగంలో ఉంచాలి. మిగతా వేళ్లతో జుట్టు ముందు నుంచి కుదుళ్ల మధ్య దాకా గుండ్రంగా తిప్పుతూ మర్దన చేయాలి.

* ఆపై చూపుడు వేలితో చెవుల ముందు నుంచి వెనక వరకూ మసాజ్ చేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి.
* ఆ తర్వాత రెండు చేతులకు నూనె రాసుకొని.. ఇరువైపులా మెడ వెనక నుంచి ముందు వరకు సున్నితంగా మసాజ్ చేయాలి.
* ఇక ఆఖరుగా.. చేతులకు నూనె అప్లై చేసుకొని.. మెడ కింది భాగంలో, ఛాతీకి పైభాగంలో రుద్దుకుంటూ భుజాల దాకా నెమ్మదిగా మర్దన చేసుకోవాలి.
ఇలా వారానికోసారి ఈ మసాజ్ ప్రక్రియను పాటించడం వల్ల జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి.
జుట్టు సమస్యలకు చెక్..

* కొంతమందికి కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, జుట్టు పొడిబారిపోవడం, అలొపేసియా (కుదుళ్ల వద్ద జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం), చుండ్రు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టాలంటే అందుకు మసాజ్ చక్కటి పరిష్కారం.
* నిర్జీవమైన జుట్టును తిరిగి ప్రకాశవంతంగా, పట్టులా మెరిపించేలా చేస్తుందీ ప్రక్రియ.
* జుట్టు చివర్లు చిట్లిపోవడం, కేశాలు ఎక్కువగా రాలిపోవడం.. వంటి సమస్యలనూ మసాజ్‌తో దూరం చేసుకోవచ్చు.
* జుట్టు సమస్యలకు ఒత్తిడి, ఆందోళనలు కూడా కారణం కావచ్చు. మరి, ఈ మానసిక సమస్యలను దూరం చేసుకోవాలంటే మసాజ్‌ను మించింది లేదు.
* మసాజ్ చేసే క్రమంలో కుదుళ్ల చర్మానికి రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. తద్వారా కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపడి జుట్టు బాగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.
* చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోయి బాధపడుతున్న వారూ ఈ మసాజ్ ప్రక్రియతో ఉపశమనం పొందచ్చు.
* అంతేకాదు.. గ్యాస్ట్రిక్, ఉబ్బసం.. వంటి ఉదర సంబంధిత సమస్యలకూ ఈ మసాజ్ చెక్ పెడుతుంది.
* ఇక ఈ మసాజ్ కోసం మనం ఉపయోగించిన అలీవ్ గింజల్లో ఫోలికామ్లం, ఐరన్‌తో పాటు కుదుళ్ల ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
*మెంతుల్లో ఉండే ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ మొదలైనవి ఇటు కుదుళ్లు, అటు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.
* కొబ్బరి నూనె కుదుళ్లకు తేమనందించి, జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
* మందార పువ్వు కుదుళ్ల పీహెచ్ స్థాయుల్ని బ్యాలన్స్ చేయడంతో పాటు కుదుళ్లు జిడ్డుగా మారకుండా, తెల్లజుట్టు రాకుండా కాపాడుతుంది.
* కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు.. ఫ్రీ రాడికల్స్ నుంచి కుదుళ్లను కాపాడి.. జుట్టుకు పటుత్వాన్ని అందిస్తాయి.
చూశారుగా.. ఇంట్లోనే ఎంత సులభంగా మసాజ్ చేసుకోవచ్చో! మరి, మనమూ ఈసారి కుదుళ్లకు మర్దన చేసుకునే క్రమంలో ఈ చిట్కాలు పాటించేద్దాం.. తద్వారా కేశసౌందర్యాన్ని కాపాడుకుందాం..!
ఇదీ చదవండి: వారి సౌందర్యం.. ప్రకృతి ప్రసాదించిన వరం!