తన మొదటి నెలసరి సమయంలో గుహర్ చాలా ఇబ్బంది పడింది. శానిటరీ ప్యాడ్‌ల కారణంగా ఒళ్లంతా దద్దుర్లు వచ్చేవి. దీంతో వాళ్లమ్మ మళ్లీ వాడుకోడానికి వీలయ్యే క్లాత్ ప్యాడ్‌లను ఇచ్చింది. గుహర్‌కు మొదట్నుంచీ పర్యావరణంపై ప్రేమ ఎక్కువ. అమ్మ ఇచ్చిన పాడ్స్ పర్యావరణానికీ హితమైనవి కావడంతో సంతోషపడింది. స్నేహితురాళ్లతోనూ వీటి గురించి చర్చించింది. వాళ్లూ వాళ్ల ఇబ్బందుల్ని చెప్పారు. అప్పుడే వీటి గురించి వీలైనంతమందికి అవగాహన కల్పించాలనుకుంది.
17 ఏళ్ల గుహర్‌ది బెంగళూరు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్‌లపై కొంత పరిశోధన చేసింది. వాటిల్లో స్టైరిన్, క్లోరోఫాం, క్లోరోమీథేన్ వంటి ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారని తెలుసుకుంది. ఇవి ఉపయోగిస్తున్న వారికే కాకుండా పర్యావరణానికీ ఎంతో హాని కలిగిస్తున్నాయని అర్థమైందామెకు. వీటి వినియోగం విషయంలో చైతన్యం తేవాలనుకుంది. అందుకే ‘గ్రీన్ పిరియడ్స్ (GREEN PERIODS)’ క్యాంపెయిన్ ప్రారంభించింది. స్నేహితులతో కలిసి స్కూళ్లు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో వందల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. తన ప్రచారానికి సామాజిక మాధ్యమాలనూ వేదికగా చేసుకుంది. కొవిడ్ సమయంలో విరాళాలను సేకరించి, ఆరోగ్య సిబ్బందికి సస్టెయినబుల్ నెలసరి ఉత్పత్తులను అందించింది.
వాషింగ్టన్ యూనివర్సిటీ పిరియడ్ పావర్టీకి వ్యతిరేకంగా ‘వాష్‌యూ (Wash You)’ పేరిట క్యాంపెయిన్ చేస్తోంది. దీనిలో గుహర్ కూడా సభ్యురాలు. తన కృషికి ఫలితంగా కిండల్ నుంచి సోషల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ రికగ్నిషన్ అవార్డు (Social Entrepreneurship Recognition Award) కింద రూ.20,000 గెలుచుకుంది. ఈ ఏడాది 1ఎం1బీ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ‘ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్ (Future Leaders Program)’లో ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. సస్టెయినబిలిటీ (Sustainability)పై పనిచేస్తున్న యువతను, వారి విధానాలను ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమం ఇది. దీని ద్వారా డిసెంబర్‌లో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో సస్టెయినబిలిటీపై గుహర్ ప్రసంగించనుంది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు వీలుగా బయోకెమికల్ రిసెర్చ్ లేదా ఎర్త్ సైన్సెస్ విభాగాల్లో ఉన్నత విద్యను చదవాలనుకుంటోంది గుహర్.
ఇదీ చూడండి: రుతుస్రావంపై ఈ విషయాలు మీకు తెలుసా?