ఎప్పుడైనా పిల్లలు మొండికేస్తుంటే బలవంతంగా వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూడకండి. వారి సమస్యను అర్థం చేసుకోండి. అంతేకాదు...పిల్లల ప్రవర్తన మనపైనే ఆధారపడుతుందని గుర్తుంచుకోండి. పెద్దవాళ్లుగా మీకే ఓ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందనుకోండి. మీరెలా ప్రవర్తిస్తారు? కోపంగా.. అరిచేస్తారా? మొండిగా వాదిస్తారా? అలా అయితే ముందు మీరు మారాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా మనం ఉంటే.. మనల్ని చూసి పిల్లలూ నేర్చుకుంటారు.
ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతిదీ తాము స్వయంగా చూసి తెలుసుకోవాలనుకుంటారు. తమ ఆటలు, బొమ్మలు, ఫ్రెండ్స్ విషయంలో స్వేచ్ఛ, స్వతంత్ర నిర్ణయాలు కోరుకుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. దాంతో పిల్లల్లోని కోపం, అసంతృప్తిని మాటవినట్లేదనుకుని పొరబాటు పడుతుంటారు. ఇలాంటప్పుడు వారికి మీ అవసరం ఎంతో ఉంది. కొత్త విషయాలు దగ్గరుండి నేర్పించే ఓపిక మీకు అవసరం. వారికి నిర్ణయాధికారం ఇస్తూనే అవసరమైన చోట సరిదిద్దే పట్టుని తెచ్చుకోండి.
తన మనసులో ఉన్న బాధ, కోపాన్ని ఏదోరకంగా మాటల్లో చెప్పగలిగే పిల్లల్లో మొండితనం, కోపం తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లలను ఎక్కువగా మాట్లాడించండి. మీరు వారికి శ్రేయోభిలాషులు అని అర్థమయ్యేలా వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకుని లాలించడం వంటివి చేయండి.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్