ఆరోగ్యం కోసం చాలామంది ఆహారంపై దృష్టిపెడుతుంటారు. కానీ అది మాత్రమే సరిపోదంటున్నారు నిపుణులు. మరేం చేయాలంటారా?
- టీవీ చూసేటప్పుడు చిరుతిండి తినడం చాలామందికి అలవాటు. దాని ధ్యాసలోపడి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పనిచేస్తూ, డ్రైవింగ్‌లో, ఆఖరికి నడిచేటప్పుడూ తినొద్దట. తెలియకుండానే ఎక్కువ తినేసే అవకాశముంటుందట.
- తినే ప్రతిదాన్నీ కెలొరీల లెక్కలేసుకోవద్దు. ఇది ఆహారంపై అయిష్టతకి కారణమవుతుంది. అలా కాకుండా మీ శరీరానికి ఏం కావాలో, ఎంత కావాలో తెలుసుకుని, తీసుకోండి. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మేలు.
- ఒత్తిడి, బాధలో ఉన్నపుడూ తిండివైపు మొగ్గుతుంటారు కొందరు. ఏవి తింటున్నారో, ఎంత తింటున్నారో మర్చిపోతుంటారు. ఇలాంటప్పుడు తిండి కాకుండా మనసును కుదుటపరిచే వేరే ప్రత్యామ్నాయాలను చూడాలి.
- డైట్‌లో ద్రవాలకూ ప్రాధాన్యమివ్వాలి. కానీ వాటిపైనే ఆధారపడొద్దు. తొందరగా జీర్ణమై ఆకలేస్తుంటుంది. అవి ఆకలిని కాసేపు ఆపినా.. శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు.
- దేనికైనా త్వరిత ఫలితం కావాలంటారు చాలామంది. అందుకే వెంటనే డైట్ మార్చేస్తుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదు. ఒక విధానానికి శరీరం అలవాటు పడి ఫలితాన్నివ్వడానికి కొంత సమయం పడుతుంది. వేచి చూడాల్సిందే.