కొందరు పిల్లలకు గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. నిపుణులు దీన్ని మానసిక సమస్యలకు సూచనగానూ పరిగణిస్తారు. ఈ తీరుకి చెక్ చెప్పకపోతే మురికి, క్రిములు శరీరంలోకి చేరతాయి. గోళ్లు, క్యూటికల్స్‌తో పాటు పళ్లూ పాడవుతాయి. మరేం చేయాలంటారా?
దృష్టి మరల్చండి: ముందుగా ఏ సందర్భాల్లో గోళ్లు కొరుకుతుంటారో గమనించాలి. ఉదాహరణకు- టీవీ చూస్తున్నపుడు ఇలా చేస్తుంటే చిన్నారి చేతిలో బొమ్మ పెట్టడమో, లేదా తనని కదిలించడమో చేయండి. ఒక్కోసారి తెలియకుండానే కొరికేస్తుంటారు. అలాంటప్పుడు చేతిని తట్టడమో, తల అడ్డంగా ఊపడమో, కదిలించడమో చేస్తుండాలి. దాంతో వారి మనసు మళ్లుతుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే... గోళ్లు కొరకడం మరిచిపోతారు.
కోప్పడొద్దు: గోళ్లు కొరుకుతున్నారని కోప్పడితేనో, గద్దిస్తేనో అలవాటు మానరు. దీన్ని ఒక్కసారిగానూ మాన్పించడం కష్టమే. బదులుగా అలా చేస్తే ఎదురయ్యే నష్టాల్ని చెప్పి చూడండి. ఓపికగా పదే పదే చెబుతుండాలి.
ఇలా కూడా: మరీ చిన్నపిల్లలకు చెప్పడం కాస్త ఇబ్బందే. కాబట్టి, వారి విషయంలో గోళ్లను పూర్తిగా కత్తిరించేయడం, వారికి తెలియకుండా వేప, కాకర రసం వంటివి వేళ్లకు రాయొచ్చు. గమనిస్తే మాత్రం అప్రమత్తమైపోతారు.