ఇంట్లో ఉంటూ ఎక్కువ గంటలపాటు పనిచేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా ఉద్యోగినులు ఇటు ఇంటిపని, అటు ఆఫీసు పనిచేస్తూ విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. చాలామంది కొన్ని నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీనివల్ల ఆఫీసు పనికి సరిహద్దులు చెరిగిపోయి ఎక్కువ గంటలపాటు పనిచేయాల్సి వస్తుంది. కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడిని నియంత్రించవచ్ఛు.
- ఆఫీసు విధులు నిర్వర్తిస్తూ ఆ సమయంలోనే ఇంటి పనులూ చేస్తే పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. అనవసర ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. ఆఫీసు వేళకు పని మొదలు పెట్టండి. పని గంటలు పూర్తికాగానే ల్యాప్‌టాప్ ఆఫ్ చేయండి. అయితే ఇంటి నుంచి పనిచేస్తూ ఆఫీసు పనిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయొద్ధు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే.. వ్యక్తిగత, ఉద్యోగ సమయాల మధ్య విభజన రేఖను కచ్చితంగా పాటించాలి. దేనికి కేటాయించిన సమయంలో ఆ పని మాత్రమే చేయాలి. పనివేళల్లో బయటకు వెళ్లే దుస్తులు వేసుకోండి. పని గంటలు పూర్తికాగానే వాటిని మార్చేసుకోండి.
- విరామ సమయంలో కాస్త చల్లగాలి పీలుస్తూ విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఇష్టమైన స్నాక్స్ తినండి. ఇంకా విసుగ్గా అనిపిస్తే వీడియో కాల్ చేసి స్నేహితులు లేదా సహోద్యోగులతో కాసేపు మాట్లాడండి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారానూ ఒత్తిడిని నియంత్రించవచ్ఛు రోజూ ఉదయాన్నే కాసేపు వాకింగ్ చేయండి. తక్కువసేపే నడిచినా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. వ్యాయామాలు లేదా ధ్యానం చేయండి. కావాలంటే యాప్స్ సాయం తీసుకోండి.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'