ETV Bharat / lifestyle

కొవిడ్‌ నయమైనా జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే ముప్పె! - మూత్రపిండాలపై కరోనా ప్రభావం

కరోనా వైరస్‌ శరీరంలో కీలక అవయవాలకు పాకుతోంది. వాటి పనితీరును దెబ్బతీస్తోంది. అప్పటిదాకా గుర్తించని ఆరోగ్య సమస్యలెన్నో కరోనా సోకిన తర్వాత బయట పడుతున్నాయి. తొలి దశ ఉద్ధృతిలో కన్పించని లక్షణాలు ఈ రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. మొదట్లో ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం చూపిన వైరస్‌.. క్రమంగా కిడ్నీల వంటి కీలక అవయవాల్లోనూ సమస్యలు సృష్టిస్తున్నట్లు ఇటీవలి కేసులను బట్టి అవగతమవుతోంది. కొవిడ్‌ చికిత్సలో వాడే మందుల మోతాదు కూడా కొన్నిసార్లు ఈ దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా స్టిరాయిడ్లు, యాంటీవైరల్‌, నొప్పి నివారణ మందులు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తున్నాయి. దీని పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయి? ఆదిలోనే గుర్తించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం..

safety-precautions-is-important-after-recover-from-covid
కొవిడ్‌ నయమైనా జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే అంతే!
author img

By

Published : May 19, 2021, 7:25 AM IST

కరోనా విజృంభించిన తొలినాళ్లలో అది ఊపిరితిత్తుల్నే దెబ్బతీస్తుందనుకునేవారు. కానీ మనిషి శరీరంలోని కీలకమైన అవయవాలన్నిటిపై ఈ మహమ్మారి ప్రభావం చూపుతోంది. కొందరిలో కరోనా సోకాక కొత్తగా కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. అంతకు ముందు మూత్రపిండాల్లో చిన్న చిన్న సమస్యలుంటే అవి తీవ్రమవుతున్నాయి. కరోనా వైరస్‌ నేరుగా కిడ్నీలపై దాడి చేయడంతోపాటు కొవిడ్‌ చికిత్సలో భాగంగా వాడుతున్న స్టిరాయిడ్‌లు, యాంటీవైరల్‌, నొప్పి నివారణ మందులూ కొందరిలో కిడ్నీల పనితీరును దెబ్బతీస్తున్నాయి. అంతకు ముందు ఎలాంటి కిడ్నీ సమస్యలూ లేకపోయినా... కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉండి ఐసీయూలోనూ, వెంటిలేటర్‌పైనా, హైఫ్లో ఆక్సిజన్‌తోనూ చికిత్స పొందినవారిలో 20-30 శాతం మందికి కొత్తగా కిడ్నీ సమస్యలు (అక్యూట్‌ కిడ్నీ ఇంజురీస్‌) తలెత్తుతున్నాయి. కొందరికి డయాలసిస్‌ కూడా అవసరమవుతోంది. ప్రస్తుతం కరోనా రెండో దశ దావానలంలా చుట్టేస్తున్న నేపథ్యంలో... కొవిడ్‌ వ్యాధి మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కరోనాకు చికిత్స పొందుతున్నవారు, వ్యాధి నయమైనవారు మూత్రపిండాల సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై వైద్య నిపుణుల విశ్లేషణ ఇదీ..

కిడ్నీలపై కరోనా ప్రభావం

మూత్రపిండాలు దెబ్బతింటే తలెత్తే సమస్యలివీ

మనిషి శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వంటి అవయవ వ్యవస్థలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. కిడ్నీ దెబ్బతింటే మిగతా అవయవాల పనితీరులోనూ తేడా వస్తుంది. మూత్రపిండాల పనితీరు వాటిలో లక్షల సంఖ్యలో ఉండే ‘నెఫ్రాన్‌’లపై ఆధారపడి ఉంటుంది. నెఫ్రాన్లలో గ్లోమరులై, ట్యూబ్యులర్స్‌ అనే భాగాలు ఉంటాయి. రక్తం గ్లోమరులైలోకి వెళ్లి శుద్ధి అవుతుంది. అక్కడ వడపోసిన ద్రవం ట్యూబ్యులర్స్‌లోకి వస్తుంది. మనిషి శరీరానికి కావాల్సిన సోడియం, పొటాషియం, బైకార్బొనేట్‌ వంటి పదార్థాల్ని ఆ ద్రవం నుంచి ట్యూబ్యులర్స్‌ శోషించుకుంటాయి. మిగతా వ్యర్థ ద్రవం ప్రధాన మూత్రనాళం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కరోనా మూత్రపిండాలపై దాడి చేసి, గ్లోమరులైను దెబ్బతీస్తే... ఎర్రరక్తకణాలు, ప్రొటీన్‌ మూత్రంలోంచి వెళ్లిపోతాయి. ట్యూబ్యులర్స్‌ దెబ్బతింటే శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం వంటివి శోషించుకునే గుణం తగ్గిపోతుంది. దాన్ని ట్యూబ్యులర్‌ డిజార్డర్‌ అంటారు. ఎక్కువ కాలం ఎర్ర రక్తకణాలు బయటకు పోతే, శరీరంలో రక్తం తగ్గుతుంది. ప్రొటీన్‌ పోవడం వల్ల కాళ్లవాపులు వంటి నెఫ్రోపతి సమస్యలు తలెత్తుతాయి.

ముప్పు ఇలా...

* కరోనా వైరస్‌ వల్ల 3 నుంచి 5 శాతం మందిలోనే మూత్రపిండాల సమస్యలు ఏర్పడుతున్నాయని మొదట్లో అనుకున్నారు. వివిధ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో మూత్రపిండాలపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. కరోనా రెండో దశలో ఆ ప్రభావం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొందరు కొవిడ్‌ రోగుల్లో మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరిలో కొవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత కూడా కొంతకాలం ఈ సమస్యలు కొనసాగుతున్నాయి.
* కొందరిలో మూత్రపిండాల్లోని రిసెప్టార్లకు కరోనా వైరస్‌ అతుక్కుంటోంది. మూత్రపిండాల బాహ్య ఉపరితలంలో ఉండే యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2 (ఏసీఈ2) రిసెప్టార్‌గా వ్యవహరిస్తూ, కరోనా వైరస్‌ కిడ్నీల్లోకి వెళ్లడానికి ప్రవేశద్వారంలా పని చేస్తోంది. ఇలా వైరస్‌ నేరుగా దాడి చేయడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటోంది. ఈ తరహా కిడ్నీ వ్యాధుల్ని కొవిడ్‌ అసోసియేటెడ్‌ నెఫ్రోపతీ (కొవాన్‌)గా పిలుస్తున్నారు.
* కరోనా రోగుల రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు గణనీయంగా పడిపోవడం వల్లా కిడ్నీల పనితీరు దెబ్బతింటోంది.
* సైటోకైన్‌ స్టార్మ్‌తో తలెత్తే వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) వల్లా కిడ్నీల్లోని కండరాలు దెబ్బతింటున్నాయి.
* కరోనా రోగులకు వాడే స్టిరాయిడ్‌లు, యాంటీవైరల్‌ మందులు కొందరిలో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
* కొన్ని రకాల మందుల వల్ల కిడ్నీల్లో ఇతర ఇన్‌ఫెక్షన్లు ఏర్పడుతున్నాయి. అప్పుడు బీపీ తగ్గిపోతోంది. అది సెప్సిస్‌కి, సెప్సిస్‌ షాక్‌కి కారణమవుతోంది.
* కరోనా రోగుల్లో డీహైడ్రేషన్‌ వల్లా సమస్యలు తలెత్తుతున్నాయి. దాన్ని ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మూత్రపిండాల్లో క్రియాటినైన్‌ స్థాయిలు పెరిగిపోతున్నాయి.
* కరోనాతో వచ్చే మరో ప్రధాన సమస్య రక్తనాళాల్లో గడ్డలు (థ్రాంబోస్‌) ఏర్పడటం. కొన్నిసార్లు కిడ్నీకి రక్తం సరఫరా చేసే నాళాలతో పాటు, మూత్రపిండాల్లోని సూక్ష్మనాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతున్నాయి.
* కొవిడ్‌ ప్రభావం వల్ల కిడ్నీలు దెబ్బతిన్న (అక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌) వారికి డయాలసిస్‌గానీ, కంటిన్యూయస్‌ కిడ్నీ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (సీకేఆర్‌టీ)గానీ చేయాల్సి ఉంటుంది. కొందరికి కిడ్నీలతో పాటు, గుండె పనితీరు కూడా దెబ్బతింటోంది. వారికి ఎక్మోపై చికిత్స అందించాల్సి వస్తోంది.

కరోనా నుంచి కోలుకున్నా కిడ్నీ సమస్యలు కొనసాగొచ్చు.

మూత్రపిండాల వైద్య నిపుణులు

కరోనా వల్ల కిడ్నీల్లోని వడపోత పొరలు దెబ్బతిన్నవారిలో, తర్వాత కొద్దికాలానికి మళ్లీ సాధారణ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. కరోనా నుంచి కోలుకున్నాక కూడా.. మూత్రపిండాల్లో సమస్యలు కొనసాగుతున్నవారిలో, మూత్రంలో ప్రొటీన్‌, ఎర్రరక్తకణాలు పోవడం వంటి సమస్యలు కొనసాగే ప్రమాదం ఉంది. కొవిడ్‌ నయమైనా.. మూత్రపిండాల సమస్య పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ, మందులు కొనసాగించాలి. కరోనా వైరస్‌ సోకినవారికి డీహైడ్రేషన్‌ వల్ల ఒళ్లు నొప్పులు వస్తాయి. కాబట్టి ఇష్టానుసారం నొప్పిని తగ్గించే మందులు వాడకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎలక్ట్రాల్‌ వంటివి తీసుకోవచ్చు. హైబీపీకి వాడే కొన్ని మందులు, కిడ్నీల్లోని ఏసీఈ-2 ఎంజైమ్‌పై ప్రభావం చూపుతాయి. వాటిలో కొన్ని రకాల మందులు వాడటం వల్ల కిడ్నీలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ మందులు వేసుకుంటున్నవారు అవి వాడొచ్చో లేదో వైద్యుల్ని అడగాలి.

- డాక్టర్‌ కె.కల్యాణ్‌ చక్రవర్తి, మూత్రపిండాల వైద్య నిపుణులు, ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌.

కిడ్నీ సమస్యలున్నవారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి

ప్రముఖ కిడ్నీ వ్యాధుల నిపుణులు

తీవ్రమైన కొవిడ్‌ వ్యాధితో ఐసీయూలో వెంటిలేటర్‌పైనా, హైఫ్లో ఆక్సిజన్‌పైనా చికిత్స తీసుకుని, కొత్తగా కిడ్నీ సమస్య ఏర్పడి, డయాలసిస్‌ అవసరమైనవారు.. కొవిడ్‌ నయమయ్యాకా అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తులో అది కిడ్నీ వైఫల్యానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇలా కొవిడ్‌ వచ్చి తగ్గినవారిలో దీర్ఘకాలంలో కిడ్నీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కిడ్నీ సమస్యలున్నవారిలో రోగనిరోధకశక్తి తక్కువ ఉంటుంది కాబట్టి కొవిడ్‌ సోకే అవకాశాలు ఎక్కువ. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌తో డయాలసిస్‌పై ఉన్నవారికి, మూత్రపిండాల మార్పిడి చేసుకున్నవారికి కరోనా సోకితే ప్రాణహాని ఉంటోంది. కరోనా మొదటి దశలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, డయాలసిస్‌పై ఉన్నవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిలో మరణాలు 20-25 శాతం ఉన్నట్లు అంతర్జాతీయ అధ్యయనాల్లో తేలింది. కరోనా రెండో దశ చాలా ఉద్ధృతంగా ఉన్నందున.. కిడ్నీ వ్యాధులున్నవారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిల్ని, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. కొన్ని రకాల కిడ్నీ వ్యాధులకు చికిత్సలో భాగంగా దీర్ఘకాలం స్టిరాయిడ్‌లు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులూ వాడుతుంటాం. అలాంటివారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి... వాటిలో ఏ మందులు కొనసాగించాలో, వేటి మోతాదు తగ్గించాలో తెలుసుకోవాలి.

- ప్రొఫెసర్‌ టి.రవిరాజు, ప్రముఖ కిడ్నీ వ్యాధుల నిపుణులు, ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిద్య విభాగం పూర్వ సంచాలకులు

ఇదీ చూడండి: 'కేసులు తగ్గినా.. మిగతా 98 శాతం మందికీ ముప్పే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.