- ‘‘బంధుగణాన్నంతా పిలిచి వేడుక చేసుకుంది ఓ కుటుంబం. విందు.. వినోదం మర్చిపోకముందే కరోనా కలకలం మొదలైంది’’
- ‘‘లాక్‌డౌన్ సడలింపుతో.. సొంత ఊరికీ.. ఉన్న ఊరికీ తిరిగాడో వ్యక్తి. ఒంట్లో నలతగా ఉందన్నాడు. కరోనా పరీక్షల ఫలితం తేలాక.. ఆయన నివాసం ఉన్న వీధి వీధంతా క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది’’
కరోనా ప్రభావంతో వేసవి సెలవుల సందడంతా తుడిచిపెట్టుకుపోయింది. లాక్‌డౌన్ కారణంగా అయినవారింటికి అరపూట వెళ్లలేని దుస్థితి దాపురించింది. ఇప్పుడు అవకాశం ఉన్నా.. రాకోయి అనుకున్న అతిథి అంటేనే మేలంటున్నారు నిపుణులు. చుట్టపుచూపుగా వెళ్లడం సరికాదని చెబుతున్నారు. కీడెంచి మేలెంచడం మంచిదంటున్నారు. లాక్‌డౌన్‌ను సడలించినంత మాత్రాన కరోనా ముప్పు తొలగిపోయిందని కాదు! ఎవరింట్లో వాళ్లు లాక్‌డౌన్ అమలు చేయాల్సిందే! ఆ బాధ్యత ఇంటి ఇల్లాలు చేపట్టాల్సిందే.
ఇప్పుడు ఆవిడే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఆమె పట్టువిడుపులకు పోతే.. ఇంట్లోవాళ్లకు చేటే! ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావంతో లాక్‌డౌన్ నియమాలు సులభం చేశారు. దానర్థం.. స్వేచ్ఛగా తిరగమని కాదు. మరింత జాగ్రత్తగా ఉండమని! ఆ బాధ్యత ఇక మీదేనని చెప్పకనే చెబుతున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ఇంకొన్నాళ్లు ఇంట్లో వాళ్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అనవసరంగా వద్దు
- ఇన్నాళ్లూ ఎవరికి వారు ఒంటరిగా ఉండటంతో.. బంధువులను కలవాలనే భావన సహజంగా కలుగుతుంది. అయితే ప్రేమకొద్దీ వెళ్లినా.. కీడు కలిగే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి.
- లాక్‌డౌన్ ప్రభావంతో చాలా కుటుంబాల ఆర్థిక మూలాలూ దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అతిథి మర్యాదలు చేయలేక మనవారే బాధపడే అవకాశం ఉందని గ్రహించాలి.
- పసిపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు ఈ మధ్యకాలంలో అస్సలు వెళ్లకండి. మీకు తెలియకుండానే మీ వెంట వైరస్ భూతం వారింటి తలుపుతట్టొచ్ఛు.
- తప్పదు అనుకున్న చోటుకు తగిన జాగ్రత్తలు పాటించి వెళ్లండి. అంతేగానీ, వేలు విడిచిన మామగారిని పరామర్శించడానికి, దూరపు బంధువును కుశలం అడగడానికి ప్రయాణం కట్టకండి.
- వేసవిలో పిల్లలు అమ్మమ్మ, నానమ్మ ఊళ్లకు వెళ్లాలని ఉబలాటపడుతుంటారు. వాళ్లు కూడా సెలవుల్లో పిల్లలు రావాలని కోరుకుంటారు. ఇలాంటి ప్రయాణాలన్నీ కనీసం రెండు మూడు నెలలు వాయిదా వేసుకుంటే మంచిది.
- లాక్‌డౌన్ గట్టిగా అమల్లో ఉన్నప్పుడు పట్టుమని పదిమంది లేకున్నా.. పెళ్లిళ్లు బేషుగ్గా జరిగాయి. ఇంకొన్నాళ్లూ అదే సూత్రం అందరికీ శ్రీరామ రక్ష. బంధుమిత్ర సపరివార సమేతంగా వెళ్లి భోజనతాంబూలాలు స్వీకరించి ఆహ్వానించినవారిని ఆనందింపజేసే రోజులు అప్పుడే ఇంకా రాలేదని గుర్తుపెట్టుకోండి.
- ఎవరి ఇంటికైనా వెళ్లాల్సి వస్తే.. ఇంటి బయటే కాళ్లూచేతులు శుభ్రంగా కడుక్కొని లోనికి వెళ్లాలి. పిల్లలను ముద్దుచేయడం వద్ధు ఎవరితోనూ అతి సన్నిహితంగా మెలగకుండా జాగ్రత్త వహించండి.
టెక్ టాకింగ్ తోడుగా..
మనిషికి మరో మనిషి తోడు కావాలని చెప్పింది కరోనా. ఇంట్లోనే ఉన్నా.. లాక్‌డౌన్‌తో బందీలుగా మారిపోయామన్న భావన ఎక్కువ మందిలో తలెత్తింది. అయినవారికి దూరం అయ్యామన్న భావనను కొన్నాళ్లు పక్కనపెట్టండి. ఎక్కడివారక్కడ సంతోషంగా, జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు ఖండాంతరాల్లో ఉన్న కూతుళ్లను, కొడుకులను పలకరించడానికి వీడియోకాల్స్ మాట్లాడేవాళ్లు. కరోనాతో.. ఒకే నగరంలో ఉన్నవాళ్లూ వీడియోకాల్స్ మాట్లాడుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకొని పరిస్థితులను అధిగమించాలి. ఒకేసారి పది మంది వరకూ కాన్ఫరెన్స్ వీడియోకాల్స్ మాట్లాడుకునే అవకాశమూ ఉంది. ఏదేమైనా.. కరోనాకు ప్రామాణికమైన మందులు వచ్చే వరకు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.