తలనొప్పి రావడానికి తగినన్ని మంచినీళ్లు తాగకపోవడం కూడా కారణం కావచ్చు. శరీరంలోని నీటిస్థాయిలు తగ్గడం వల్లనే మైగ్రెయిన్ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డీహైడ్రేషన్ కారణంగా ఏకాగ్రత దెబ్బతిని ఏ పనీ చేయాలనిపించదు. చిరాకు కలిగిస్తుంది. కాబట్టి తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే సరిపడా మంచినీటిని తాగడమో, నీటి స్థాయులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమో చేస్తుండాలి.
- ఇతరులతో పోల్చుకుంటే మెగ్నీషియం లోపం ఉన్న వారిలో తరచూ మెగ్రెయిన్ లాంటి తలనొప్పి సమస్యలు అధికంగా వస్తున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వైద్యుల సలహాతో రోజుకు 600 ఎంజీ మెగ్నీషియం సిట్రేట్ తీసుకోవడం వల్ల తలనొప్పి తీవ్రతతో పాటు, తరచుగా ఇలాంటి సమస్యల బారిన పడడాన్ని తగ్గించొచ్చు. ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్ ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే మెగ్నీషియం సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో డయేరియా లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
- నిద్రలేమి ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రుళ్లు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే తలనొప్పి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదేవిధంగా నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోయినా ఈ సమస్య వెంటాడుతుంది. కాబట్టి సరిపడా నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.
- ఛీజ్, బర్గర్లు, బీర్లు, వైన్, స్మోక్డ్ ఫిష్, మాంసం... వంటి పదార్థాల్లో హిస్టమైన్ అధికంగా ఉంటుంది. ఇవి అధికంగా తీసుకోవడం వల్ల చాలా మందిలో మైగ్రెయిన్ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు తరచూ తలనొప్పి బారిన పడుతుంటే ఈ పదార్థాలను దూరం పెట్టడం మేలు. అయితే కొన్ని చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తలనొప్పిని తగ్గించడంలో బాగా సహకరిస్తాయి.
- మార్కెట్లో దొరికే కొన్ని రకాల నూనెలతో తలనొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. ప్రత్యేకించి పెప్పర్‌మింట్ ఆయిల్, లావెండర్ నూనెల్లో తలనొప్పిని నివారించే గుణాలు అధికంగా ఉంటాయి. విపరీతమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా తలనొప్పి వచ్చినప్పుడు కొద్దిగా పెప్పర్‌మింట్ ఆయిల్‌ను తీసుకుని నుదుటిపై, కణతలకు సున్నితంగా మర్దన చేసుకోవాలి. దీంతో ఆందోళనతో పాటు తలనొప్పి కూడా మాయమవుతుంది. ఇక మైగ్రెయిన్ తీవ్రతను తగ్గించడంలో లావెండర్ నూనె చాలా ఉపయోగపడుతుంది.
- రైబోఫ్లేవిన్, ఫోలేట్, బి-12, బి-6 (పైరిడాక్సిన్) వంటి బి-విటమిన్ సప్లిమెంట్స్‌లో తలనొప్పి తీవ్రతను తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. పైగా ఇతర వాటితో పోల్చుకుంటే తలనొప్పి నివారణకు ఇవి ఎంతో సురక్షితమైనవి. పైగా అందుబాటు ధరలోనే లభిస్తాయి.
- ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నవారికి తలనొప్పి తరచూ వేధిస్తుంటుంది. కాబట్టి ఈ అలవాట్లకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి.
- మైగ్రెయిన్‌లాంటి సమస్యల నుంచి సత్వర ఉపశమనం కోసం చాలామంది పాటించే చిట్కా ఐస్ ప్యాక్స్. ఐస్‌ప్యాక్‌ని నుదురుపై ఉంచి కాసేపు అద్దుతూ ఉంటే తలనొప్పి నుంచి కాస్త రిలీఫ్ పొందవచ్చు. ఒకవేళ ఐస్‌ప్యాక్ అందుబాటులో లేకపోయినా ఫ్రోజెన్ జెల్ రాసుకోవడమో లేదంటే చల్లటి నీళ్లలో ముంచిన గుడ్డతో తలపై అద్దడం వంటివి చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.
- కాఫీ, టీలలో ఉండే కెఫీన్‌కి తలనొప్పిని తగ్గించే శక్తి ఉంది. కాబట్టి తలనొప్పి ఉన్న సమయంలో కాఫీ లేదా టీ తాగమని చాలామంది చెబుతుంటారు. అయితే త్వరగా తగ్గాలని వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ఇతర అనారోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగకూడదు.
- తలనొప్పి నివారణకు అల్లం టీ కూడా ఓ మంచి చిట్కా. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తలనొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. వికారం, వాంతులు కాకుండా ఉపశమనం కలిగిస్తాయి. పుదీనా టీ తాగినా తలనొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.
- చెర్రీ పండ్లలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి తలనొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. దీంతో పాటు ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మైగ్రెయిన్ నొప్పులకు వ్యతిరేకంగా పోరాడతాయి.
- క్వినోవాలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణకోశం పనితీరును మెరుగుపరచడంతో పాటు మెగ్రెయిన్ లాంటి తలనొప్పుల బారిన పడకుండా కాపాడతాయి.
- యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవడం వల్ల పదే పదే వచ్చే తలనొప్పులకు చెక్ పెట్టవచ్చు. ఇక మైగ్రెయిన్ మిమ్మల్ని సుదీర్ఘకాలం పాటు వేధిస్తున్నట్లయితే యోగా థెరపీతో పరిష్కారం పొందవచ్చు. పైగా దీని వల్ల మానసిక ప్రశాంతత పెరిగి జీవన ప్రమాణం కూడా మెరుగుపడుతుంది.
- సాధారణ జీవితంలో ఉండే పని ఒత్తిడి, ఆందోళనలు కూడా తలనొప్పికి కారణమవుతాయి. మరి, దీన్నుంచి విముక్తి పొందాలంటే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పదే పదే మైగ్రెయిన్ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.
- తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్నప్పుడు పచ్చటి ప్రకృతి మధ్య కాసేపు అటూ ఇటూ నడిస్తే ఉపశమనం కలుగుతుంది.
- అధిక శబ్దాలు, లైటింగ్ వల్ల కూడా ఒక్కోసారి తలనొప్పి వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అందుకే వీటికి దూరంగా తక్కువ వెలుతురు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. తద్వారా తలనొప్పి నుంచి త్వరగా విముక్తి కలిగే అవకాశం ఉంటుంది.
- గాఢత ఎక్కువగా ఉండే పెర్‌ఫ్యూమ్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్ వల్ల చాలామందికి చికాకు, వికారం, వాంతులు కలుగుతాయి. దీన్నే ఓస్మో ఫోబియా అంటారు. ఒక్కోసారి ఇవి తీవ్రమైన తలనొప్పికి దారి తీస్తాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మేలు.
పదే పదే వేధించే తలనొప్పి తీవ్రతను తగ్గించడానికి, తరచూ దీని బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారుగా... మరి మీరూ తలనొప్పి బాధితులైతే వెంటనే ఈ చిట్కాలను ఆచరించడం ఆరంభించండి. తలనొప్పి నుంచి ఉపశమనం పొందండి.