ఆకుపచ్చని రంగులో గరుకుతొక్కతో ఉండే కాకర చూడ్డానికి అందంగా ఉండదు సరికదా మహా చేదు. అలాగని చిరు చేదెక్కిన బీరకాయ, దోసకాయల్ని పారేసినట్లు దీన్ని వండకుండా ఉండలేం. ఆ చేదు పోయేందుకు కాస్త బెల్లమో పంచదారో జోడించి మరీ వండుతుంటాం. సరిగ్గా వండితే కాకరకన్నా రుచికరమైన కూరగాయ మరొకటి ఉండదంటారు దాన్ని ఇష్టపడేవారు. కాకరతో వేపుడు, పులుసు వంటి కూరలే కాదు, ఈ కాయల్ని ఎండబెట్టి కారప్పొడీ చేస్తారు. నిల్వ పచ్చడి పడతారు. చిప్స్‌లా వేయిస్తారు. వడియాలు పడతారు. ఉల్లి, కొబ్బరి, పప్పులపొడులు కలిపిన మిశ్రమాన్ని కాయల్లో స్టఫ్ చేసి వండితే ఆ రుచే వేరప్పా అంటారు కాకరకాయ ప్రియులు. నెల రోజులకు పైగా నిల్వ ఉండే కూర చేయడమూ కాకరతోనే సాధ్యం. ఇలా ప్రాంతాన్ని బట్టి కాకర కాయల్ని వండే రుచులెన్నో. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ కాయలతో సాఫ్ట్ డ్రింకుల్నీ తయారుచేస్తారు. కాకరాకుల టీని చైనీయులు ఇష్టంగా తాగుతారట. ఈ ఆకుల్లోనూ ఖనిజాలూ విటమిన్లూ పుష్కలంగా ఉంటాయి. కరీబియన్ దీవుల్లో అయితే ఎండు ఆకుల్ని ప్యాకింగుల్లో అమ్ముతారట. కాకరాకుల టీ తాగితే పొట్ట రుగ్మతలన్నీ తగ్గుతాయన్న కారణంతో ఆకుకీ అక్కడ డిమాండ్ ఎక్కువే మరి.
ఎన్ని రకాలు?
ద్రవ్యగుణ విజ్ఞాన గ్రంథం ప్రకారం- ఆకారాన్ని బట్టి పొడవు కాకర, పొట్టి కాకర అని రెండే రకాలు. పొడవు రకం వేసవిలోనూ, పొట్టి రకం వానల్లోనూ ఎక్కువగా కాస్తాయి. కానీ సంకరీకరణ ద్వారా కాకరలో అనేక రకాలు పుట్టుకొచ్చాయి.
మనదగ్గర గరుకుగా ఉండే కాకర రకాలే ఎక్కువ. కానీ ఇతర ఆసియా దేశాల్లో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోనూ భిన్న సైజుల్లోనూ ఉండే నున్నని కాకర వెరైటీల్నీ పండిస్తారు. థాయ్‌ల్యాండ్‌లో తెల్లని కాకరకాయల్ని స్టాల్స్‌లో పండ్ల మాదిరిగా పేర్చి జ్యూస్ చేసి అమ్ముతుంటారు.
ఎలా మంచిది?
కాకర కేవలం కూరగాయ మాత్రమే కాదు, పరమౌషధం. అందుకే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సంప్రదాయ వైద్యంలో దీన్ని విరివిగా వాడుతుంటారు. పొట్టకు సంబంధించిన అనేక సమస్యలకు ఇందులోని చేదు గుణం మందులా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం- ఇది ఉష్ణాన్ని పెంచి కఫ, పిత్త దోషాల్ని తగ్గిస్తుందట. వంద గ్రా. కాకరలో 19 క్యాలరీలూ; 3.5 గ్రా.కార్బొహైడ్రేట్లూ; 2.4 గ్రా. పీచూ; 150 మి.గ్రా. కొవ్వులూ; 87 శాతం నీరూ; ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9 విటమిన్లూ; పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్... వంటి ఖనిజాలూ; కెటెచిన్, గాలిక్‌ఆమ్లం, ఎపికెటెచిన్, క్లోరోజెనిక్ ఆమ్లం... వంటి యాంటీఆక్సిడెంట్లూ ఫ్లేవనాల్సూ పుష్కలంగా ఉంటాయి. లేత కాయల్లో సి-విటమిన్ శాతం ఎక్కువ. కాబట్టి ఓ కప్పు తాజా ముక్కలనుంచి రోజువారీ అవసరమయ్యే సి-విటమిన్‌లో 93 శాతం లభిస్తుంది. అంతేకాదు, గ్లైకోసైడ్స్, శాపోనిన్స్, ఆల్కలాయిడ్స్, 5-హైడ్రాక్సీట్రిప్టామైన్, చారంటిన్, డయోజెనిన్, ల్యానోస్టెరాల్, బీటాసైటోస్టెరాల్... వంటి రసాయన పదార్థాలు ఉండటం వల్లే ఇది చేదుగా ఉంటుంది. ఇవన్నీ శరీరంలోని చెడును తొలగించే ఔషధాలుగా పనిచేస్తాయని అల్లోపతి సైతం చెబుతోంది.
- చక్కెర వ్యాధికి కాకరకాయ మహత్తరమైన ఔషధం. దెబ్బతిన్న బీటాసెల్స్‌ని బాగుచేయడంతోపాటు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. కాకర కాయలూ, గింజల్లో ఉండే ఎమ్‌ఆర్‌కె-29 అనే ప్రొటీన్ సైతం రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గి
స్తుందట. అందుకే రెండు టేబుల్‌స్పూన్ల చొప్పన తాజా కాకరకాయ రసాన్ని తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది రక్తశుద్ధికీ తోడ్పడుతుంది. - కాకరలోని మోమోర్డిసిన్ యాంటీవైరల్ గుణాన్ని కలిగి ఉంటుంది. వర్షాల్లో వచ్చే జలుబూ, దగ్గూ, జ్వరాల్ని ఇది అడ్డుకుంటుందనీ హెచ్‌ఐవీ, ఇతర ఇన్ఫెక్షన్లనీ నివారించ గలదనీ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
- కాకర క్యాన్సర్‌కీ మందే. దీన్నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్ లింఫాయిడ్ ల్యుకేమియా, మెలనోమా, రొమ్ము, పేగు, చర్మ, ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన ట్యూమర్లని నివారించినట్లు గుర్తించారు. పొట్ట అల్సర్లకు కారణమైన బ్యాక్టీరియానీ నిర్మూలించిందట.
- చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడం, రక్తనాళాల్లో పూడికల్ని నిరోధించడం ద్వారా హృద్రోగాల్ని రానివ్వదని పరిశోధనలు చెబుతున్నాయి. కాకర రసాన్ని వరసగా 30 రోజులపాటు ఎలుకలకు మందుగా ఇచ్చినప్పుడు కొలెస్ట్రాల్ శాతం తగ్గిందట. కాకరలోని పీచువల్ల జీర్ణశక్తీ బాగుంటుంది.
- నులిపురుగులు, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులకి కాకర మందులా పనిచేస్తుంది. అందుకే ఈ సమస్యలున్నవాళ్లు టేబుల్‌స్పూను రసాన్ని రోజూ తీసుకుంటే మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. కాకరకాయ తినేవాళ్లకి నిద్ర సమస్యలు తగ్గుతాయట. ఇది నెలసరి నొప్పుల్నీ తగ్గిస్తుంది.
- కీళ్లనొప్పులకీ కాకరకాయ ఔషధగుళికే. ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. దాంతో జుట్టు, చర్మం కూడా మెరుపుని సంతరించుకుంటాయి.
- కాకరలో ఎక్కువగా ఉండే ఎ-విటమిన్ కంటిచూపుని పెంచి, క్యాటరాక్ట్ రాకుండా అడ్డుకుంటుందట. ఇందులోని రసాయనాలు మలేరియానీ నివారించినట్లు కొన్ని పరిశోధనల్లో స్పష్టమైంది.
- ఊబకాయం, మూత్ర వ్యాధులతో బాధపడేవాళ్లు తరచూ కాకరకాయ తింటే ఫలితం ఉంటుంది.
- ఆస్తమాతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యల్ని ఇది తగ్గిస్తుంది.
- రింగ్‌వార్మ్, సొరియాసిన్, దురదలు వంటి వ్యాధులతో బాధపడేవాళ్లకి కాకరకాయ రసం ఎంతో మేలు. ఎగ్జిమా వంటి చర్మసమస్యలతో బాధపడేవాళ్లు కాకర ఆకుల్ని నూరి ఆ ముద్దను ఆయా భాగాల్లో పెడితే అవి తగ్గుముఖం పడతాయి. ముఖంమీద మొటిమలూ మచ్చలూ కూడా తగ్గుతాయి.
కాకరకాయ జ్యూస్ తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. కానీ మధుమేహానికి మందులు వాడుతూ దీన్ని తాగడం వల్ల చక్కెర నిల్వలు బాగా పడిపోయి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. గుండెవేగంలో మార్పులు వచ్చి మతిమరపు, పక్షవాతం రావచ్చు. గర్భిణీలకి గర్భస్రావం కావచ్చు. కాబట్టి జ్యూస్ రూపంలో తీసుకునేవాళ్లు వైద్యుల సలహా తీసుకోవాలి. అయినా మోతాదు మించితే ఏదైనా ప్రమాదమే అన్నది గ్రహించి, ఈ కాలంలో వచ్చే కాకరకాయల్ని మీకిష్టమైన రుచుల్లో వండండి... ఇష్టంగా ఆస్వాదించండి!
అగాకర... ఆ రుచే వేరు!
కాకర అనగానే చేదు రుచే గుర్తొస్తుంది. కానీ అస్సలు చేదు లేకుండా మరెంతో రుచిగా ఉండేదే అగాకర లేదా బోడ కాకర. మెత్తని ముళ్లతో కోలాకారంలో ఉండే ఇదీ కాకర జాతికి చెందినదే. కాకరలోని ఔషధ గుణాలన్నీ ఇందులోనూ ఉంటాయి. ఒకప్పుడు అగాకర అడవుల్లోనే పెరిగేది. దాంతో వర్షాకాలంలో మాత్రమే దొరికేది. కానీ ఇప్పుడు కాకరలానే దీన్నీ సాగుచేస్తున్నారు. చేదు కాకరని తినలేని చక్కెర రోగులు ఈ కాకరని కూరగా తిన్నా రసం తాగినా మంచిదే. తలనొప్పి, చెవినొప్పితో బాధపడేవాళ్లకీ బీపీ రోగులకీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే దగ్గూ జలుబూ అలర్జీలకూ ఇది దివ్యౌషదంలా పనిచేస్తుందట. కాకర జాతికే చెందిన కాసరకాయ (చిట్టి కాకర) అనే మరో రకం కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పండుతోంది. ఈ రకంతోనూ రకరకాల కూరలు చేస్తుంటారు. ఇది కూడా మధుమేహాన్ని తగ్గిస్తుందట.
ఇదీ చదవండి: రైతులకు శుభవార్త.. సోమవారమే ఖాతాల్లోకి డబ్బులు