డైట్‌ను మార్చుకోండిలా!
సీజన్‌ను బట్టి మన ఆహారంలోనూ, జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోక తప్పదు. ప్రత్యేకించి వేసవిలో శరీరానికి చలువనిచ్చే తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. దీంతో పాటు మన జీవనశైలిలోనూ కొద్ది పాటి మార్పులు చేసుకుంటే వేసవి సమస్యలను సులభంగా అధిగమించవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.
ఈ ఫుడ్స్‌తో ఇమ్యూనిటీ పెంచుకోండి!
వేసవిలో ఫ్లూ లాంటి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల సీజనల్ వ్యాధులు తరచుగా వేధిస్తుంటాయి. ఆహారంలో విటమిన్-సిని చేర్చుకోవడం వల్ల వీటి నుంచి రక్షణ పొందవచ్చు. ప్రత్యేకించి నిమ్మ, బెర్రీస్, ద్రాక్ష, జామ లాంటి సిట్రస్ పండ్లతో పాటు బాదం పప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బచ్చలి లాంటి కూరలకు డైట్‌లో చోటివ్వాలి. వీటితో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
కెరోటినాయిడ్స్
యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనమైన కెరోటినాయిడ్స్ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ పండ్లు, కూరగాయల్లో అధికంగా లభ్యమవుతుంది. ఇందులో ఉండే లైకోపిన్, లూటిన్ అనే వర్ణ ద్రవ్యాలు సూర్యరశ్మి ప్రభావం నుంచి శరీరానికి, చర్మానికి రక్షణ కలిగిస్తాయి. బొప్పాయి, పుచ్చకాయ, ద్రాక్ష, క్యారట్లు, బ్రకలి లాంటి పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే కెరోటినాయిడ్స్ పుష్కలంగా శరీరానికి అందుతాయి. ఇక నిత్యం ఎండల్లో పనిచేసేవారు ఒక గ్లాసు టొమాటో జ్యూస్ తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది.
విటమిన్-డి
సాధారణంగా చాలామందికి శీతాకాలంలో ఆస్తమా సమస్య వస్తుంటుంది. అయితే వాతావరణంలోని అధిక వేడి, తేమ కారణంగా కూడా చాలామంది ఆస్తమాతో బాధపడుతుంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో ఊపిరిత్తుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్-డి సమృద్ధిగా ఉన్న డైట్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందుకోసం సూర్యరశ్మి తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అటూ ఇటూ తిరగడం మంచిది. అదేవిధంగా చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలు, పాల పదార్థాలు బాగా తినాలి. దీనివల్ల ఆస్తమాతో పాటు క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు
సాధారణంగా వేసవిలో చర్మ సంరక్షణకు సంబంధించిన సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న బ్లూ బెర్రీస్, నిమ్మజాతి పండ్లు, బాదం పప్పు, బచ్చలి, బీట్రూట్, గుమ్మడి, తర్బుజా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ.. వంటి పదార్థాల్ని ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ఉండే వివిధ రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు భానుడి ప్రభావం నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తాయి. చర్మంపై దద్దుర్లు, స్కిన్ ట్యానింగ్ సమస్యలు రాకుండా కాపాడతాయి.
నీటి స్థాయులు తగ్గకుండా!
ఇక వేసవిలో శరీరంలో నీటి స్థాయులు కోల్పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతుండాలి. అందుకోసం పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, స్మూతీలు, ఫ్రూట్, వెజిటబుల్ జ్యూస్‌లను అధికంగా డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా డీహైడ్రేషన్‌తో పాటు వేసవిలో ఎదురయ్యే పలు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
క్లుప్తంగా చెప్పాలంటే తాజా పండ్లు, కూరగాయల్లోనే మన ఆరోగ్య రహస్యం దాగుందన్న మాట. మరి మీరూ పైన చెప్పిన పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోండి. వేసవి సమస్యలను అధిగమించడంతో పాటు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచుకోండి.
ఇదీ చదవండి: ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!