ETV Bharat / lifestyle

SLEEPING PROBLEMS: నిద్రాదేవికి ఆహ్వానం పలకండిలా..!

author img

By

Published : Aug 8, 2021, 10:53 AM IST

అసలే అంతంత మాత్రంగా ఉన్న మన నిద్ర మీద కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. దాంతో అర్ధరాత్రి దాటినా రెప్పే మూతబడని వాళ్లూ కష్టపడి నిద్ర తెచ్చుకున్నా పట్టుమని రెండు గంటలకు మించి పడుకోలేని వాళ్లూ ఎక్కువైపోయారు. వైరస్‌ భయానికి సమాజంలో నెలకొన్న అనిశ్చితీ ఆర్థిక అభద్రతలూ తోడై చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఇప్పటికే ఇన్‌సోమ్నియా(నిద్రలేమి)తో పడుతున్న బాధలకి ఇప్పుడు ‘కరోనాసోమ్నియా’ అదనంగా చేరిందంటున్నారు నిపుణులు. అరకొర నిద్రతో అనారోగ్యం పాలై ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో అసలు ఎంతసేపు నిద్ర పోవాలీ, దానివల్ల వచ్చే లాభాలేంటీ, నిద్ర తక్కువైతే నష్టమేంటీ... చూద్దామా?

corona-pandemic-may-be-affecting-your-sleep-here-the-special-story-about-coronasomnia
నిద్రాదేవికి ఆహ్వానం పలకండిలా..!

ప్రపంచంలోనే నిద్ర తక్కువైన దేశాల్లో మనది రెండోదనీ మొదటి స్థానం జపాన్‌దనీ కరోనా రావడానికన్నా ముందే ఫిట్‌బిట్‌ వారి సర్వేలో తేలింది. నిశ్చింతగా నిద్ర పోగల అదృష్టం ఏ కొద్దిమందికో తప్ప దొరకడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు నిపుణులు. అసలు నిద్రకీ ఆరోగ్యానికీ ఉన్న సంబంధం గురించి పరిశోధించడం మొదలుపెట్టిందే అయిదారు దశాబ్దాల క్రితం నుంచి. దాంతో ఒక్కో అధ్యయనమూ వెల్లడిస్తూ వచ్చిన వాస్తవాలు పరిశోధకులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అవన్నీ చూశాక, మనిషి జీవితంలో నిద్రకీ శరీరానికీ మెదడుకీ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నాక... ఇక, నిద్ర విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని గట్టిగానే హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మనిషి ఆరోగ్యంగా బతకాలంటే కావలసిన నాలుగింటిలో నిద్ర ఒకటనీ, పోషకాహారమూ వ్యాయామమూ ఒత్తిడి లేని మానసిక స్థితీ... మిగిలిన మూడూ అనీ వాళ్లు చెబుతున్నారు. కాబట్టి, నిద్ర గురించి మనకున్న అపోహలన్నీ పక్కన పెట్టి వారు చెబుతున్న విషయాలేమిటో తెలుసుకోవాల్సిన సమయమిదే!

ఎంత నిద్ర!

పిల్లలకు ఎక్కువ నిద్ర కావాలి కానీ పెద్దవారికి అంత అక్కర్లేదు... అన్నది పూర్తిగా అపోహే. ఎందుకంటే...

  • నిద్ర పోతున్నప్పుడే- చర్మంతో సహా శరీరంలోని అన్ని భాగాలూ మరమ్మతులు చేసుకుంటాయి. వ్యర్థాలను తొలగించుకుని, శక్తిని కూడదీసుకుని, అవసరమైన హార్మోన్లను తయారుచేసుకుంటాయి.
  • మెదడు పగటి వేళ తాను గ్రహించిన సమాచారంలో అవసరమైనదాన్ని భద్రపరిచి అవసరంలేనిదాన్ని వదిలేస్తుంది.
  • మెదడులోని గ్లింఫాటిక్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేసి వ్యర్థ రసాయనాలన్నిటినీ మెదడు, వెన్ను చుట్టూ ఉండే ద్రవం ద్వారా బయటకు పంపించేస్తుంది. నాడీకణాల మధ్య పేరుకుపోయి మతిమరుపు వ్యాధులకు కారణమయ్యే అమైలాయిడ్‌ ప్రొటీను కూడా ఆ వ్యర్థాల్లో ఒకటి.
  • పిల్లల్లో, యుక్తవయస్కుల్లో నిద్రించేటప్పుడే గ్రోత్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. సరిగా నిద్ర లేకపోతే ఎదుగుదల కూడా సరిగా ఉండదు.
  • చాలినంత నిద్ర ఉన్నప్పుడే విషయగ్రహణ శక్తీ ఏకాగ్రతా పెరుగుతాయి.
  • మన శరీరంలో ముఖ్యమైన రెండు హార్మోన్లు- గ్రెలిన్‌(ఆకలిని కలిగిస్తుంది), లెప్టిన్‌(ఆకలిని అణచివేస్తుంది)లను నియంత్రించేది నిద్రే.
  • అంటే శరీరాన్నీ మెదడునీ ఆరోగ్యంగా ఉంచి, అవయవాల పనితీరునీ, బరువునీ, మనసు బాగోగుల్నీ క్రమబద్ధం చేసే పనులన్నీ నిద్రలోనే జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే పెద్దలందరికీ కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఏడు గంటలకు ఏమాత్రం తగ్గినా అది నిద్రలేమి కిందే లెక్క.

ఇదీ... స్లీప్‌ సైకిల్‌!

నిద్రని కొలిచే విధానాన్ని స్లీప్‌ సైకిల్‌ అంటారు. మనిషి సగటు స్లీప్‌ సైకిల్‌ 90 నిమిషాలు. అంటే నిద్రపోయినప్పటినుంచి ప్రతి గంటన్నరా ఒక సైకిల్‌ అన్నమాట. అయితే ఆ గంటన్నరా ఒకేలా గాఢనిద్ర పట్టదు. ఒకోసారి నిద్రపోతున్నా కనుగుడ్లు కదులుతున్నట్లు కన్పిస్తుంది. పిలిస్తే గబుక్కున లేస్తారు. దాన్ని రాపిడ్‌ ఐ మూమెంట్‌ (రెమ్‌)అంటారు. ప్రతి స్లీప్‌ సైకిల్‌లోనూ రెమ్‌, నాన్‌ రెమ్‌ అనే రెండు దశలుంటాయి. నిద్రపట్టగానే ముందు నాన్‌ రెమ్‌ దశ మొదలవుతుంది. క్రమంగా గాఢ నిద్ర పట్టే ఆ సమయంలో మెదడు పనిచేసే విధానాన్ని స్లోవేవ్‌ అంటారు. ఆ తర్వాత రెమ్‌ దశలో చాలాసేపు నిద్రపడుతుంది. తిరిగి కాసేపటికి మళ్లీ నాన్‌ రెమ్‌ నిద్ర మొదలవుతుంది. ఇలా ఐదారు స్లీప్‌ సైకిల్స్‌ పూర్తయితే చాలినంత నిద్ర పోయినట్లు. స్లీప్‌ సైకిల్‌ మధ్యలో నిద్రలేస్తే ఆ రోజంతా విసుగ్గా ఉంటుంది. రాత్రి మొదట్లో స్లోవేవ్‌ సమయం ఎక్కువ ఉంటుంది. రాత్రి గడిచే కొద్దీ రెమ్‌ నిద్ర పెరుగుతుంది.

నిద్రలోని ఈ ఒక్కో దశా మన శరీరంలో ఒక్కోరకమైన మార్పులకు కారణమవుతుంది. నాన్‌ రెమ్‌ నిద్రలో గుండెవేగం తగ్గుతుంది. మెదడు స్లోవేవ్‌ మోడల్‌లో ఉండి అనవసర జ్ఞాపకాలను తొలగిస్తుంది. మనం తాజాగా నేర్చుకుంటున్న నైపుణ్యాల సమాచారాన్ని భద్రపరుస్తుంది.

అదే రెమ్‌ నిద్రలో కండరాలమీద పట్టు పూర్తిగా తగ్గి అవి చచ్చుబడినట్లుగా అయిపోతాయి. మరోవైపు మెదడు మాత్రం చురుగ్గా, ఒత్తిడి లేకుండా పనిచేస్తుంటుంది. భావోద్వేగాలకు సంబంధమైన సమాచారాన్నీ అవసరమైన జ్ఞాపకాలనీ పదిలపరుస్తుంది. కలలు ఎక్కువగా వచ్చేది ఇప్పుడే. గుండె వేగం, బీపీ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈ నిద్ర తగ్గితే సృజనమీద, ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది.

ఇదీ... సహజంగా నిద్ర పట్టే విధానం. వేళాపాళా లేకుండా పడుకునేవారిలో ఈ దశలన్నీ ఇలా ఒక క్రమంలో ఉండకపోవచ్చు. దాని ప్రభావమే వారి ఆరోగ్యం మీదా పడొచ్చు.

నిద్ర తగ్గితే ఎదుగుదల మీద ప్రభావం

కారణాలెన్నో!

నిద్రలేమి సమస్యకి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. త్వరగా పడుకుని త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిదన్నది చిన్న పిల్లలకు చెప్పే పాఠమే కాదు, వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన సైన్సు పరిశోధన కూడా. గ్లోబల్‌ వెల్‌నెస్‌ ట్రెండ్స్‌ నివేదిక ప్రకారం నిద్రకి ప్రధాన అవసరమూ అదే.

మన భౌతిక, మానసిక, ప్రవర్తనాపరమైన అలవాట్లన్నీ వెలుగు చీకట్ల ఆధారంగా 24 గంటల సమయచక్రానికి అనుగుణంగా ఉంటాయి. దాన్ని ‘సర్కాడియన్‌ రిథమ్‌’ అంటారు. ఈ రిథమ్‌ని నియంత్రించే కణయంత్రాంగంపై అధ్యయనం చేశారు ముగ్గురు పరిశోధకులు- జెఫ్రీ సి.హాల్‌, మిఖేల్‌ రోస్‌బాష్‌, మిఖేల్‌ డబ్ల్యు.యంగ్‌. పండ్లమీద వాలే చిన్ని ఈగలమీద పరిశోధన చేసి పీఈఆర్‌ అనే ఒక ప్రొటీన్‌ని నిత్యం నియంత్రిస్తూ వాటిల్లో సర్కాడియన్‌ రిథమ్‌కి కారణమవుతున్న జన్యువుని వాళ్లు కనిపెట్టారు. ఆ ప్రొటీన్‌ రాత్రిపూట మాత్రమే కణాల్లో చేరి పగలు కరిగిపోతోందట. మన శరీరంలోనూ అలాగే సూర్యుని నుంచి వచ్చే సహజమైన నీలి రంగు కాంతి మెలటోనిన్‌పై ప్రభావం చూపుతుంది. సాయంత్రం వేళకి సూర్యకాంతి తగ్గేకొద్దీ మెలటోనిన్‌ హార్మోన్‌ స్థాయులు పెరిగి శరీరాన్ని నిద్రకు సిద్ధంచేస్తాయి. ఉదయం మళ్లీ సూర్యోదయం వేళకి ఆ స్థాయులు తగ్గిపోతాయి. ఇలాంటి సహజ గడియారాలెన్నో మన డీఎన్‌ఏలో ఉన్నాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు... శరీరం లోపలి అవయవాలన్నీ ఈ సర్కాడియన్‌ రిథమ్‌లో భాగమే.

అసలు మనిషి మనుగడలోనే సూర్యుడి పాత్ర కీలకం. ప్రతి పనికీ సూర్యుడి వెలుతురుతో లింకు ఉంటుంది. అలాంటిది పట్టణీకరణా ఉద్యోగాలూ మనిషిని నాలుగు గోడల మధ్యకి పరిమితం చేసి సహజకాంతికి దూరం చేస్తున్నాయి. కృత్రిమ వెలుగుల మధ్య పగలూ రాత్రీ తేడా లేకుండా పనిచేయడం మొత్తంగా ఈ సర్కాడియన్‌ రిథమ్‌ని తలకిందులు చేసేస్తోంది.

ఇక మిగిలిన కారణాలు... మనం స్వయంగా చేసుకుంటున్న అలవాట్లే.

  • రాత్రి ఆలస్యంగా పడుకుని, ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేవారిలో స్లీప్‌ సైకిల్‌ దెబ్బతిని నిద్ర పట్టదు.
  • మంచం మీద కూర్చుని టీవీ చూడడం, లాప్‌టాప్‌తో పనిచేయడం, ఫోను వాడడం... వల్ల వాటినుంచి వెలువడే నీలి కాంతి మెలటోనిన్‌ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరోపక్క ఇవన్నీ మెదడుని కూడా అయోమయంలోకి నెడుతున్నాయి. ఇప్పటివరకూ మంచాన్నీ నిద్రనీ అనుసంధానం చేసుకున్న మెదడు మంచం మీద పడుకోగానే నిద్రకు తగిన సూచనలు పంపేది. ఎప్పుడైతే మనం మంచం మీద కూర్చుని పనిచేయడం మొదలుపెడు తున్నామో అప్పుడు మెదడు కూడా నిద్రని మర్చిపోయి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడడం మొదలెడుతోంది.
  • కొందరు రాత్రిపూట చురుగ్గా ఉండి ఎంత పనైనా చేస్తారు. పగలు నిద్రపోవడానికి ఇష్టపడతారు. జన్యుపరమైన, ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావచ్చు. అలాంటప్పుడు వైద్యులకు చూపించుకుని సమస్య ఏమిటో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

పదిహేడు గంటలకే..!

నిద్రే కదా, ఒకరోజు పోకపోతే ఏమవుతుందీ... అనుకునేవాళ్లు అర్జెంటుగా ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. రోజుల తరబడి నిద్రపోకుండా ఉండటమంటే చేజేతులా మృత్యుదేవతను ఆహ్వానించడమేనట. చైనాకి చెందిన ఒక యువకుడు వరసగా 11రోజులపాటు నిద్రపోకుండా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసి పడుకుని నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. రాత్రింబగళ్లు కంప్యూటర్‌ మీద పనిచేస్తూ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే ఘటనలు జపానులో తరచూ జరుగుతుంటాయి. నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలమనేది మనిషిని బట్టి మారుతుంది. ఏ అవయవం ముందుగా విఫలమై మరణానికి దారితీస్తుందన్న దానిమీద అది ఆధారపడివుంటుంది. నిద్రపోకుండా రోజుల తరబడి అలాగే ఉంటే శరీరంలోని అన్ని భాగాలూ ఒత్తిడికి లోనవుతాయి. బీపీ పెరుగుతుంది. శరీరం లోపల ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దాంతో మరణం సంభవిస్తుంది. ప్రాణాలతో చెలగాటం కాబట్టి పరిశోధకులు నిద్రలేమి ప్రభావం గురించి మనుషుల మీద ప్రయోగాలు చేయరు. ఎలుకల మీద చేసిన పరిశోధనల ఆధారంగానే ఎన్నో విషయాలు తెలుసుకుని, జరిగిన సంఘటనలకు అన్వయించడం ద్వారా వాటిని నిర్ధారించుకున్నారు. ఆ విధంగా చూస్తే...

  • 17 గంటలు ఏకబిగిన నిద్రపోకుండా ఉంటే ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. కంటికీ చేతికీ మధ్య సమన్వయం చెడుతుంది. అలసట, చిరాకూ కలిసి శరీరాన్ని ఒకలాంటి ఉద్రిక్తతకి గురిచేస్తాయి. చెవులు కూడా వినిపించవు.
  • వారమంతా తక్కువగా నిద్రపోయి, సెలవురోజున ఎక్కువ నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకుందామనుకోవడం తప్పు ఆలోచన. నిద్రకు సంబంధించి ఏ రోజు లెక్క ఆరోజుదే. ఒక్కరోజైనా రెండు రోజులైనా తగ్గిన నిద్ర తాలూకు నష్టం జరిగిపోతుంది.
  • చర్మం మరమ్మతులు చేసుకోలేకపోవడంతో ముడతలు పెరిగి వృద్ధాప్య ఛాయలు కన్పిస్తాయి.
  • నిద్ర తగ్గితే ఏకాగ్రతా జ్ఞాపకశక్తీ రోగనిరోధకశక్తీ తగ్గిపోవడమే కాదు, మొత్తంగా ఆయుష్షే తగ్గిపోతుంది. ఎందుకంటే, క్యాన్సర్‌లాంటి వ్యాధులు వస్తే పోరాడే శక్తి 70శాతం క్షీణిస్తుంది.
  • ఆకలి పెరుగుతుంది, ఏది పడితే అది తిని బరువూ పెరుగుతారు.
  • అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులూ, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఆల్జీమర్స్‌ సమస్య పెరుగుతుంది.
  • కోపం ఒత్తిడీ ఆందోళనా పెరిగి అనుబంధాల మీదా విధినిర్వహణమీదా ప్రభావం చూపుతాయి.
  • ఒత్తిడి హార్మోన్‌ అయిన కార్టిసోల్‌ స్థాయులు పెరిగి, దానివల్ల ‘స్ట్రెస్‌ బెల్లీ’గా వ్యవహరించే పొత్తికడుపు దగ్గర పొట్ట పెరుగుతుంది. అది మధుమేహమూ గుండె జబ్బుల రిస్క్‌ని పెంచుతుంది. హార్మోన్ల మధ్య సమతౌల్యమూ దెబ్బతింటుంది.
మంచంపైన పడుకొని ఫోన్, లాప్​టాప్, టీవీలు చూడొద్దు..

ఇవి... వద్దు!
చాలినంత నిద్ర పోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • నిద్ర వచ్చేవరకూ పట్టపగల్లా వెలిగే లైట్లను తగ్గించుకోవాలి. పదింటికి నిద్ర పోవాలనుకుంటే ఎనిమిదిన్నరలోపలే భోజనం చేసి నెమ్మదిగా శరీరాన్నీ మనసునీ నిద్రకు సిద్ధం చేసుకోవాలి. కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా గడపాలి.
  • సాయంత్రం తర్వాత కాఫీలూ టీలూ మద్యమూ తాగకూడదు.
  • పడకగదిలోకి టీవీ, ఫోన్‌ లాంటివి తీసుకెళ్లకూడదు.
  • మధ్యాహ్నం అరగంట కన్నా ఎక్కువ పడుకోకూడదు.
  • మంచం ఎక్కాక రేపటి పనుల గురించి అసలు ఆలోచించకూడదు.
  • పడుకునేముందు కఠినమైన వ్యాయామాలు చేయకూడదు.
  • నిద్ర మాత్రలు అలవాటు చేసుకోకూడదు.

ఇవి... మేలు!
నిద్రాదేవతని ఆహ్వానించే అలవాట్లివి.

  • త్వరగా లేచి, త్వరగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తే శరీరం సర్కాడియన్‌ రిథమ్‌కి అలవాటుపడుతుంది.
  • రోజూ అరగంట వ్యాయామం అలవాటు చేసుకోవాలి.
  • ఎండలో కాసేపు తప్పనిసరిగా గడపాలి. ఇంట్లో తలుపులూ కిటికీలూ తెరిచి సహజమైన వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.
  • మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకు ధ్యానం తోడ్పడుతుంది.
  • షిఫ్టుల్లో పనిచేసేవారు నిపుణుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • మధ్యాహ్నం ఓ పదినిమిషాల పవర్‌న్యాప్‌ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం మీద మంచి ప్రభావం చూపుతుంది.
  • మంద్రంగా ఉండే సంగీతం, మంచి పుస్తకం హాయిగా నిద్రపోయేందుకు సాయపడతాయి.
  • భోజనం త్వరగా చేసి, కావాలంటే పడుకునే ముందు అరటి పండూ పాలూ తీసుకోవచ్చు. వీటిల్లో ఉండే ట్రిప్టోఫాన్‌ వల్ల కొందరికి నిద్ర బాగా పడుతుంది.

అంకెలు చెబుతున్నాయి..!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నిద్రకు సంబంధించిన పరికరాలపై జరుగుతున్న లక్షలకోట్ల రూపాయల వ్యాపారం సమస్య తీవ్రతకి నిదర్శనం. కేవలం స్మార్ట్‌ లైట్ల(సహజ వెలుతురు లాంటి వెలుగునిచ్చే కృత్రిమ లైట్లు) మార్కెట్‌ విలువే 30వేల కోట్లదాకా ఉంటుందని నిపుణుల అంచనా. సమస్య తీవ్రతను వెల్లడిస్తున్న మరికొన్ని గణాంకాలు...

  • బెంగళూరుకు చెందిన ‘వేక్‌ఫిట్‌’ అనే కంపెనీ ‘గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌కార్డ్‌’ పేరుతో ఏటా నిద్రపై తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. గతేడాది ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 67శాతం కరోనా వల్ల తమ నిద్ర దెబ్బతిందని చెప్పారు. ప్రతి ఐదుగురిలోనూ ఒకరు నిద్ర పట్టని సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. నూటికి 90 మంది నిద్ర మధ్యలో లేచి కూర్చుంటున్నామన్నారు. 30 శాతం పొద్దున నిద్రలేచాక తీవ్ర అలసటగా ఉంటోందన్నారు.
  • కరోనా సమయంలో నిద్రకు సంబంధించిన ఉత్పత్తుల డిమాండ్‌ 70శాతం పెరిగింది.
  • మధుమేహుల్లో సగం మంది శ్వాసలో అవరోధాల వల్ల నిద్ర దెబ్బతినే ‘స్లీప్‌ ఆప్నియా’తో బాధపడుతున్నారు.
  • నూటికి 92 మంది ఫోను చేత్తో పట్టుకుని పడుకుంటుండగా, 54 మంది అర్థరాత్రి వరకూ ఫోనులో సినిమాలు చూస్తూనో, వీడియో గేములతోనో గడుపుతున్నారట.
  • ఇలాంటి పరిస్థితుల్లో రాత్రంతా హాయిగా నిద్రపోయి, తెల్లారాక ఎవరూ లేపకుండానే, అలారంతో పనిలేకుండానే నిద్ర లేస్తున్నారంటే... మిమ్మల్ని మించిన అదృష్టవంతులెవరూ లేనట్లే..!

సాయానికి ‘ఆప్స్‌’!

ఇలా చేస్తే నిద్రాదేవి ఆశీస్సులు మీకు నిండుగా ఉన్నట్లే..!

నిద్రలేమి సమస్య పెరుగుతున్న కొద్దీ దానికి పరిష్కారాలు కనిపెట్టే కృషీ పెరుగుతోంది. నిద్ర పట్టేందుకు తోడ్పడే రకరకాల పరికరాలూ ఆప్‌లూ అలా తయారైనవే.

స్మార్ట్‌ లైట్స్‌: స్మార్ట్‌ విద్యుత్‌ లైట్ల సాయంతో సహజ వెలుతురు సృష్టించి చికిత్స చేస్తారు. ఇంటెన్సిటీ ట్యూనింగ్‌, కలర్‌ ట్యూనింగ్‌, స్టిములస్‌ ట్యూనింగ్‌... మూడు విధాలుగా మనిషి సహజ కాంతికి అలవాటుపడేలా చేస్తాయివి.

ఆప్స్‌: నిద్రకి అవరోధం కలిగించే గురకని తగ్గించుకునేందుకు సాయంచేసే ‘స్నోర్‌లాబ్‌’, మంద్రంగా సంగీతాన్ని వినిపించే ‘కామ్‌’, నిద్రపోయినంత సేపూ జోలపాడినట్లు హాయిగొలిపే ఆడియోలు ప్లే చేసే ‘పు-జిజ్‌’, మొబైల్‌ తెరమీద నీలికాంతిని తగ్గించి చదువుకుంటూ పడుకోవడానికి తోడ్పడే ‘ట్విలైట్‌’, స్లీప్‌ సైకిల్‌ని డిస్టర్బ్‌ చేయకుండా నిద్ర సమయాన్ని ఎలా మేనేజ్‌ చేసుకోవాలో సూచించే ‘స్లీప్‌ కాలిక్యులేటర్‌’... లాంటి ఆప్‌లెన్నో అందుబాటులో ఉన్నాయి. టైమ్‌షిఫ్టర్‌, సర్కా సోలార్‌... లాంటి ఆప్స్‌ తరచూ సుదీర్ఘప్రయాణాలు చేసేవారికి ఉపయోగపడతాయి.

స్లీప్‌ రోబోస్‌: మెత్తని దిండులా ఉండే వీటిని కౌగిలించుకుని పడుకుంటే శ్వాసను క్రమబద్ధం చేసి ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తాయి.

స్లీప్‌ ఐస్‌క్రీమ్‌: అర్థరాత్రి ఆకలి వేసి నిద్ర చెడిపోయేవారికోసం ‘స్లీప్‌ ఐస్‌క్రీమ్‌’ అందుబాటులో ఉంది. పాలూ చక్కెరతో కాకుండా మంచి నిద్ర పట్టేందుకు తోడ్పడే పదార్థాలతో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌ ఇది.

స్మార్ట్‌ పరుపులు: ఇవి పడుకున్నవారి శరీర ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా ఉష్ణోగ్రతలను మార్చుకుని నిద్ర చెడకుండా చూస్తాయి.

ఇదీ చూడండి: KCR REVIEW: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలపై బలమైన వాణి వినిపించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.