మనిషి సామాజిక ప్రవర్తన అనేది మెదడులోని ప్రిఫ్రాంటల్ కార్టెక్స్‌లోని కణాలమీద ఆధారపడి ఉంటుందని మౌంట్ సినాయ్ హాస్పిటల్‌కు చెందిన పరిశీలకులు గుర్తించారు. ఇందుకోసం పిల్లఎలుకల్ని తీసుకుని రెండువారాలపాటు మిగిలినవాటితో కలవనీయకుండా ఉంచారట. ఆ తరవాత వాటిని గమనించగా- మెదడులోని ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలోని న్యూరాన్ల నుంచి మిగిలినవాటికి సంకేతాలు సరిగ్గా అందడం లేదని తెలిసింది.
ఆపై కొంతకాలానికి అవి స్తబ్దుగా మారడం గమనించారు. అయితే వాటిని అలాగే వదిలేయకుండా ఆప్టోజెనిటిక్స్, కీమోజెనిటిక్స్ పద్ధతుల్ని ఉపయోగించి ఆ భాగంలోని కణాలను ప్రేరేపించడంతో అవి మళ్లీ చురుకుగా మారినట్లు గుర్తించారు. కాబట్టి ఐసొలేషన్ వల్ల పిల్లల్లో సామాజిక ప్రవర్తనకు సంబంధించిన లోపాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశీలన ఆధారంగా రకరకాల మానసిక వ్యాధుల కారణంగా సామాజిక ప్రవర్తన సరిగ్గా లేనివాళ్లలో కూడా ఆ కణాల్ని లైట్‌థెరపీ వంటి చికిత్సల ద్వారా ప్రేరేపించడం ద్వారా ఆ లక్షణాన్ని తగ్గించవచ్చు అంటున్నారు.