నగల్లో దేవుళ్ల రూపాలు కొత్త కాదు. రత్నాలు పొదిగిన దేవతా ప్రతిమలతో రూపొందించే టెంపుల్ జ్యువెలరీ తెలిసిందే. అయితే అవన్నీ టూ డైమన్షన్‌లోనే ఉండేవి. కానీ ఈమధ్య ఇంటీరియర్ నుంచి జ్యువెలరీ వరకూ త్రీడీ ట్రెండే నడుస్తోంది. అందుకే టెంపుల్ జ్యువెలరీనీ త్రీడైమన్షన్‌లో తయారుచేస్తున్నారు. అచ్చంగా గర్భగుడిలో పీఠంమీద కూర్చున్నట్లే దేవుళ్ల లాకెట్లను చెక్కేస్తున్నారు. పీఠం పక్కనే స్తంభాల్నీ గోపురాల్నీ కూడా లాకెట్లలో చొప్పించేస్తున్నారు.
నిజానికి ఆలయ నిర్మాణానికి పేరొందిన చోళుల కాలంలోనే- అంటే, క్రీ.శ.9వశతాబ్దంలోనే టెంపుల్ జ్యువెలరీ మొదలైంది. అప్పట్లో ఆలయకుడ్యాల మీద ఉండే హంసలూ నెమళ్లూ లక్ష్మీదేవి రూపాలతోనే బంగారు ఆభరణాల్ని చేసి, వాటికి వజ్రాలూ కెంపులూ పచ్చలూ వంటి రత్నాల్ని పొదిగేవారు. ఈ డిజైన్లలో చేసిన వడ్డాణాలూ హారాలూ ముక్కెరలూ వంటి నగల్ని ఆలయంలోని దేవీదేవతలకే అలంకరించేవారు. అందుకే దీనికి టెంపుల్ జ్యువెలరీ అని పేరు.
తరవాత్తరవాత ఆ డిజైన్లను సంప్రదాయ నృత్యం చేసేవాళ్లు ధరించేవారు. అవి చూసి సంపన్నులూ ఆ నగలపట్ల ఆకర్షితులయ్యారట. అప్పట్లో ఆలయాలకు పేరొందిన తమిళనాడులోనే వీటి వాడకం ఎక్కువగా ఉండేది. క్రమంగా ఇవి అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ టెంపుల్ నగల్నే త్రీడీ రూపంలో మందిరంతోసహా డిజైన్ చేయడం తాజా ట్రెండ్‌గా మారింది.