ఎవర్‌గ్రీన్ ‘బనారసీ’!
ఫ్యాషన్లలో కొన్ని కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తే.. కొన్ని మాత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. బనారసీ కూడా ఇలాంటి ఎవర్‌గ్రీన్ ఫ్యాషనే! ఇది ఎప్పట్నుంచో ట్రెండ్ అవుతున్నా ఎప్పటికప్పుడు మగువల మనసు దోచేలా సరికొత్త ప్యాటర్న్స్, బోర్డర్ డిజైన్లతో మన ముందుకొచ్చేస్తుంది. న్యూ బ్రైడ్ దియా మీర్జా కూడా అలాంటి ఎరుపు రంగు బనారసీ చీరలో తళుక్కుమంది. దీనికి జతగా రూపొందించిన గోల్డెన్ బోర్డర్, అదే తరహాలో చీర మొత్తం పెద్ద పెద్ద చెక్స్ ప్యాటర్న్స్‌లో డిజైన్ చేశారు. ఇలా తన చీరకు మ్యాచింగ్‌గా అదే రంగు ప్లెయిన్ బనారసీ బ్లౌజ్‌ను ఎంచుకున్న ఈ చక్కనమ్మ.. స్లీవ్స్‌పై ఓ చిన్న ఫ్లోరల్ డిజైన్ పీస్‌తో ప్యాచ్ వర్క్ చేయించుకుంది. ఇక మల్లెపూలతో అలంకరించిన బన్ హెయిర్‌స్టైల్, ముత్యాలు-పచ్చలు పొదిగిన ఆభరణాలు ఆమె బ్రైడల్ లుక్‌ని పూర్తిచేశాయి. ఇలా తనదైన స్టైల్‌లో సింప్లీ సూపర్బ్‌గా మెరిసిపోయిందీ బాలీవుడ్ బేబ్. ఎరుపు రంగుతో రూపొందించిన బనారసీ చీర అనే కాదు.. సీక్విన్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో భారీగా డిజైన్ చేసిన చీరలూ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పూర్తి ట్రెడిషనల్‌గా వద్దు.. కాస్త మోడ్రన్‌గా కనిపించాలనుకునే వారు ఈ తరహా ట్రెండీ శారీస్‌లో పెళ్లికూతురిలా మెరిసిపోవచ్చు. అలాగే వీటి పైన కూడా మ్యాచింగ్ బ్లౌజ్‌లే కాకుండా.. కాంట్రాస్ట్ కలర్ లేదంటే బోర్డర్‌కు తగినట్లుగా గోల్డ్ కలర్ బ్లౌజులతో అదరగొట్టేయచ్చు.
లెహెంగాతో కట్టిపడేయండి!
పెళ్లిలో చీరలే కాదు.. లెహెంగాలూ ఎంచుకొని మెరిసిపోతున్నారు ఈ తరం కొత్త పెళ్లికూతుళ్లు. అటు ట్రెడిషనల్‌గా, ఇటు ట్రెండీగా కనిపించే ఈ తరహా అవుట్‌ఫిట్స్లోనూ ఎరుపు రంగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇలా పెళ్లికూతుళ్ల మనసు తెలుసుకుంటోన్న డిజైనర్లు కూడా విభిన్న బ్రైడల్ లెహెంగాలను తీర్చిదిద్దుతున్నారు.
బ్యూటిఫుల్ సింగర్ నేహా కక్కర్ కూడా తన పెళ్లికి అలాంటి అందమైన అవుట్‌ఫిట్‌నే ఎంచుకుంది. ఎంబ్రాయిడరీ, మెటాలిక్ వర్క్, ఫ్లోరల్ మోటివ్స్‌తో వన్నెలద్దిన ఈ ఎరుపు రంగు లెహెంగాకు మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది నేహ. ఇక సింపుల్ బోర్డర్‌తో కూడిన షీర్ దుపట్టా ఆమె లుక్‌ని మరింతగా పెంచేసిందని చెప్పుకోవచ్చు. హెవీ ఆభరణాలు, లవ్లీ మేకప్‌తో తన బ్రైడల్ లుక్ డోసు పెంచేసిన నేహ.. తన అవుట్‌ఫిట్‌తో ఈ తరం అమ్మాయిలకు పర్‌ఫెక్ట్ వెడ్డింగ్ అటైర్‌ను పరిచయం చేసిందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇలాంటి రెడ్ కలర్ లెహెంగాల్లోనే లేస్ వర్క్ చేసినవీ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన హవాను చాటుతున్నాయి. వాటిలో మీకు నప్పింది, నచ్చింది ఎంచుకొని ధరించేయడమే తరువాయి!
రిసెప్షన్‌లో ట్రెండీగా..!
పెళ్లిలో సంప్రదాయబద్ధంగా కనిపించడానికి ఎంతగా మొగ్గు చూపుతున్నారో.. రిసెప్షన్ వంటి పెళ్లి వేడుకల్లో ఫ్యాషనబుల్‌గా మెరవడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ డింపుల్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా తన వెడ్డింగ్ రిసెప్షన్‌కు అలాంటి ట్రెండీ అవుట్‌ఫిట్‌లోనే తళుక్కుమంది. పెళ్లిలో లెహెంగా, చీరలో ట్రెడిషనల్‌గా మెరిసిపోయిన దీప్స్.. విందులో పూర్తి మోడ్రన్‌గా దర్శనమిచ్చింది. ఈ క్రమంలో జుహెయిర్ మురద్ రూపొందించిన ఎరుపు రంగు గౌన్ ధరించిన ఆమె.. తక్కువ మేకప్‌తో మెరుపులు మెరిపించింది. ఇక తన డ్రస్‌కు జతగా పొడవాటి వెయిల్, వదులైన హెయిర్‌స్టైల్, తలపై నుంచి ధరించిన షీర్ దుపట్టా.. వంటివన్నీ ఆమె లుక్‌ని మరింతగా ఇనుమడించాయని చెప్పచ్చు. ఇలా రిసెప్షన్ వంటి నైట్ పార్టీస్‌లో ఎరుపు రంగులో రూపొందించిన పొడవాటి గౌన్లు, భారీగా డిజైన్ చేసిన అనార్కలీ సూట్స్.. వంటివి ఎంచుకోవచ్చు. తద్వారా అటు సందర్భానికి తగినట్లు ఫ్యాషనబుల్‌గా, ఇటు ట్రెండీగా అందరి దృష్టిని ఆకర్షించచ్చు.
ఎరుపు ఎబ్బెట్టుగా ఉంటుందనుకుంటే..!
తమ పెళ్లికి ఎరుపు రంగు ఎంచుకోవాలని ఉన్నా కొంతమందికి అది సూట్ కాకపోవచ్చు.. ఒకవేళ సూటైనా డ్రస్ మొత్తం కాకుండా.. తాము ధరించే అవుట్‌ఫిట్‌లో ఏదో ఒకటి ఎరుపు రంగు ఉండేలా చూసుకుంటే చాలనుకుంటారు. ఫ్యాషనర్, మన భల్లాల దేవుడి భార్య మిహీకా బజాజ్ కూడా అచ్చం ఇలానే ఆలోచించినట్లుంది. అందుకే ఎరుపు రంగు షేడెడ్ వెయిల్‌ను తలపై నుంచి ధరించి మెరిసిపోయింది. తన పెళ్లికి భారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన గోల్డెన్ లెహెంగా-బ్లౌజ్‌ను ఎంచుకున్న ఈ చక్కనమ్మ.. దానిపై మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ రెడ్ షేడెడ్ షీర్ దుపట్టాను తలపై నుంచి వేసుకుంది. ముఖ్యంగా ఈ దుపట్టా బోర్డర్స్ వద్ద వచ్చిన ఎంబ్రాయిడరీ-సీక్విన్ డిజైన్, భారీ ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఇలా తన ఫ్యాషన్లతో నేటి తరం బ్రైడ్స్‌కి సరికొత్త ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోందీ మిసెస్ రానా. మరి, మీరూ మీ బ్రైడల్ అటైర్‌లో ఎరుపు రంగును జోడించాలనుకుంటే క్రీమ్, గోల్డెన్, గ్రీన్.. వంటి చీరలు/లెహెంగాలపై కాంట్రాస్ట్ కలర్‌లో ఉండే రెడ్ షేడెడ్ దుపట్టాను ఎంచుకొని మీదైన ఫ్యాషన్ మార్క్‌ని ప్రదర్శించచ్చు.. కావాలంటే ఓసారి ట్రై చేయండి.
ఆభరణాలు సింపుల్‌గా..!
పెళ్లంటే దుస్తులే కాదు.. ఆభరణాల పైనా ప్రత్యేక దృష్టి పెడతారు అమ్మాయిలు. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న జ్యుయలరీ అంతా ధరించేద్దామన్న ప్లాన్‌లో ఉంటారు. నిజానికి మీరు ధరించే హెవీ అవుట్‌ఫిట్‌పై ఎక్కువ ఆభరణాలు వేసుకుంటే లుక్ చెడిపోవడమే కాదు.. చూడ్డానికి ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి హెవీ బ్రైడల్ అవుట్‌ఫిట్‌పై ఏదో ఒక నగ ధరిస్తే కూల్‌గా కనిపిస్తాం. అందాల అలియా కూడా ఇదే విషయం చెబుతోంది. ఓ సందర్భంలో ఎరుపు రంగు బ్రైడల్ లెహెంగాలో ముస్తాబైన ఈ చక్కనమ్మ.. దానికి జతగా పచ్చలు-స్టోన్స్‌తో రూపొందించిన నెక్లెస్, మాంగ్‌టీకా ధరించి మెరిసిపోయింది. ఇక బన్ హెయిర్‌స్టైల్‌తో పాటు మేకప్ కూడా సింపుల్‌గానే ఉండాలంటూ తన లుక్‌తో చెప్పకనే చెప్పిందీ క్యూట్ బ్యూటీ. కాబట్టి మనం ఎంచుకునే ఎరుపు రంగు అవుట్‌ఫిట్‌పై మ్యాచింగ్ ఆభరణాలు ఎంచుకున్నా/కాంట్రాస్ట్‌వి ఎంచుకున్నా సింపుల్ అండ్ స్వీట్‌గా ఉండేలా చూసుకుంటే క్యూట్ బ్రైడ్‌లా అందరి మెప్పూ పొందచ్చు.
వీళ్లే కాదు.. తమ తమ పెళ్లిళ్లలో ఎరుపు రంగు హెవీ బ్రైడల్ అటైర్స్‌తో తమ లేడీ ఫ్యాన్స్‌కి బ్రైడల్ ఫ్యాషన్ పాఠాలు నేర్పిన ముద్దుగుమ్మలెందరో!
- ఇదీ చూడండి : అతివల హాట్ ఫేవరేట్.. టైనీ బ్యాగ్స్!