అసలే వాతావరణ కాలుష్యం, మనం వాడే సౌందర్య సాధనాల్లోని రసాయనాలు మన అందాన్ని దెబ్బతీస్తున్నాయంటే.. దీనికి తోడు ఇప్పుడు కరోనా కూడా మనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు నిరంతరాయంగా మాస్క్ ధరించాల్సి వస్తోంది. తద్వారా ముక్కు, నోరు, బుగ్గలు, గడ్డం.. తదితర ముఖ భాగాల్లో చర్మానికి సరిగ్గా గాలి తగలక పొడిబారిపోవడం, మొటిమలు-మచ్చలు ఏర్పడడం.. వంటి సౌందర్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగని మాస్క్ పెట్టుకోకుండా ఉండే పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి ఓవైపు మాస్క్ ధరిస్తూనే.. మరోవైపు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సౌందర్య సమస్యలకు చెక్ పెట్టచ్చు. మరి, అవేంటో తెలుసుకుందామా?!
అందుకే ఈ సమస్యలు!
మాస్క్ ముక్కు, నోటికి సరిగ్గా ఫిట్ అయ్యేలా ఉండాలన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొంతమంది అతి జాగ్రత్త వల్ల మాస్క్‌ని మరీ బిగుతుగా కట్టుకుంటుంటారు. తద్వారా దాని అంచుల వల్ల చర్మానికి రాపిడి జరిగి ఎరుపెక్కడం, వాపు.. వంటి సమస్యలొస్తాయి. అలాగే మాస్క్ కట్టుకున్న భాగంలో చర్మానికి గాలి తగలక.. తెల్లగా పాలిపోయినట్లుగా తయారవుతుంది. ఇక చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, చర్మం రంధ్రాల్లోని దుమ్ము-ధూళి.. ఇవన్నీ ఆయా భాగాల్లో ఎక్కువ సమయం పాటు అలాగే ఉండడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సౌందర్య సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
- చర్మం నుంచి విడుదలయ్యే నూనెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే జిడ్డుగా మారి మొటిమలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి మాస్క్ పెట్టుకునే ముందు, తొలగించిన తర్వాత సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే మధ్యమధ్యలో ఒకట్రెండు సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
- కొంతమంది అతి జాగ్రత్తతో ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరిస్తుంటారు. మాస్క్ ధరించిన ముఖ భాగంలో చర్మ సమస్యలు రావడానికి ఇదీ ఓ కారణమే. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు (ప్రత్యేకించి ఇంట్లో ఎవరికీ కరోనా లక్షణాలు లేనప్పుడు).
- మనం బయటికి వెళ్లినప్పుడు వర్షంలో లేదంటే చెమటకు మాస్క్ తడిసిపోతుంటుంది. ఇలా తడిగా ఉన్న మాస్క్‌నే ఎక్కువ సమయం పాటు ఉపయోగించడం వల్ల వాతావరణంలోని బ్యాక్టీరియా, క్రిములు మాస్క్ ద్వారా చర్మం పైకి చేరి పలు చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతాయి. అలాగే తడి మాస్క్ వల్ల ఆ భాగంలో ఎరుపెక్కడం, పగుళ్లు రావడం.. వంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు అదనంగా మరో రెండు మాస్కులు బ్యాగ్‌లో వెంట తీసుకెళ్లడం మంచిది. అవి తిరిగి ఉపయోగించుకునేవైతే తీసిన మాస్క్‌ని విడిగా కవర్‌లో పెట్టుకొని ఇంటికొచ్చాక ఉతుక్కోవచ్చు.
- మాస్క్‌ని వేడి నీళ్లలో ఉతకడం వల్ల వాటికి అంటుకున్న దుమ్ము-ధూళి, ఇతర క్రిములు, వైరస్‌లు నశిస్తాయి. లేదంటే వాటి వల్ల కూడా చర్మానికి ప్రమాదమే. అలాగే ఉతికిన మాస్క్ పొడిగా ఆరేంత వరకు ఆరుబయటే ఎండలో ఆరేయాలి.
- మాస్క్ పెట్టుకునే ముందు, తీసేసిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అయితే ఆయింట్‌మెంట్ తరహా మాయిశ్చరైజర్స్ ముఖాన్ని జిడ్డుగా మార్చుతాయి. కాబట్టి వాటిని ఉపయోగించకపోవడం మంచిది.
- ఒకవేళ మాస్క్ కారణంగా ముఖ చర్మం డ్యామేజ్ అయితే గనుక ఆయా భాగాల్లో ఎక్స్‌ఫోలియేటర్లు, స్క్రబ్బర్స్ ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. ఎందుకంటే వీటి వల్ల చర్మం రాపిడికి గురై సమస్య తగ్గడం అటుంచి, మరింత పెరుగుతుంది.
- రాత్రి పడుకునే ముందు ముఖమంతా పెట్రోలియం జెల్లీ రాసుకొని పడుకుంటే చర్మం పొడిబారే సమస్య నుంచి విముక్తి పొందచ్చు. అలాగే ముఖంపై గాయమైన ప్రదేశాల్లో దీన్ని రాయడం వల్ల అది త్వరగా మానిపోయే అవకాశం కూడా ఉంది.
- చర్మం పొడిబారకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి.
- మేకప్ ఉత్పత్తుల్లోని రసాయనాలు చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే. ఇక దీనికి తోడు మాస్క్ కూడా గంటల తరబడి ధరించడం వల్ల చర్మానికి గాలి తగలక, మేకప్ కారణంగా చర్మ రంధ్రాల నుంచి చెమట బయటికి రాక మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతేనే.. అది కూడా చాలా తక్కువగా మేకప్ వేసుకోవడం మంచిది.
- ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగో మాస్క్‌లు గంటల తరబడి ధరించక తప్పట్లేదు. కాబట్టి మరీ బిగుతుగా కాకుండా ముక్కు, నోరు కవరయ్యేలా ఫిట్‌గా ఉండే మాస్క్ ధరిస్తూ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చర్మ సంబంధ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు. ఒకవేళ మీ సమస్య మరీ తీవ్రంగా ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించడం మంచిది.
ఇదీ చూడండి: దేశంలోనే తొలిసారి సరికొత్త సాంకేతిక మాస్కు!