లాక్‌డౌన్‌లో భాగంగా మొన్నటి వరకు అందరూ ఇళ్లకే పరిమితమైనా.. ఇప్పుడు పలు సడలింపులివ్వడం వల్ల నెమ్మదిగా సాధారణ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడుతున్నారంతా. ఈ క్రమంలో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో మాస్కులు ధరించడం కూడా ఒకటి.
ఆఫీసులు, ఇతరత్రా పనుల రీత్యా బయటికి వెళ్లే అమ్మాయిలు సాధారణ మాస్కుల కంటే స్టైలిష్‌గా ఉండే మాస్కులు ధరించడానికే మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని డిజైనర్లు వివిధ రకాల డిజైనర్ మాస్కుల్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇవి కూడా ఆ కోవకు చెందినవే.
హాఫ్-ఫేస్ మాస్క్..
కుర్తీలు, టీషర్ట్స్.. వంటివి ధరించినప్పుడు వాటికి జతగా ఓ స్టైలిష్ స్కార్ఫ్ ధరించడం చాలామంది అమ్మాయిలకు అలవాటే. దీనివల్ల దుపట్టా వేసుకోలేదన్న అసౌకర్యం కూడా ఉండదు. అయితే ఈ కరోనా సమయంలో బయటికి వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా మారడంతో ముఖానికి మాస్క్, మెడలో స్కార్ఫ్.. ఈ రెండూ ధరించాలంటే చాలామందికి చిరాగ్గా అనిపిస్తుంటుంది. అలాంటి వారు హాఫ్-ఫేస్ మాస్క్‌లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఆదరణ పొందుతోన్న ఈ మాస్కులు ఫొటోలో చూపించినట్లుగా అటు ముక్కు-నోటిని కప్పి ఉంచుతూనే.. ఇటు ఛాతీ వరకు కవరయ్యేలా ఉంటాయి. భుజాలపై నుంచి కవరవుతూ.. ముందు భాగంలో ‘వి’ ఆకృతిలో వచ్చేట్లుగా రెడీమేడ్‌గా లభిస్తాయివి. ఈ మాస్క్‌కు ఇరువైపులా చివర్లలో అతికించుకునేందుకు వీలుగా అమరిక ఉంటుంది. దీన్ని సాధారణ మాస్క్‌లా ధరిస్తూ వెనకాల మనకు కావాల్సినట్లుగా బిగుతుగా అతికించేసుకుంటే సరిపోతుంది. మరికొన్ని మాస్కులకు ఎలాస్టిక్ అమరిక కూడా ఉంటుంది. ఇలాంటి మాస్కుల్లోనూ ఫ్లోరల్, ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ.. ఇలా విభిన్న డిజైన్లలో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిలో కావాలంటే మన దుస్తులకు మ్యాచింగ్‌గా ఉండేవి ఎంచుకుంటే మరింత స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు. మాస్క్ డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ. 399 నుంచి రూ. 774 వరకు ఉంది.
ఫుల్-ఫేస్ మాస్క్..
సాధారణంగా మాస్క్ అంటే ముక్కు-నోరు కవరయ్యేలా ఉండడం మనకు తెలిసిందే. అయితే ఇలాకాకుండా ముఖమంతా కప్పి ఉంచేలా ఉండే మాస్క్ దొరికితే బాగుండనుకుంటున్నారా? అలాంటిదే ఈ ‘ఫుల్-ఫేస్ మాస్క్’. ఫొటోలో చూపించినట్లుగా కళ్లు, చెవులు తప్ప ముఖమంతా కవరయ్యేలా ఉంటుందీ మాస్క్. చేతులు శుభ్రం చేసుకోకుండా.. మతిమరుపుతో పదే పదే చేతుల్ని ముఖానికి తాకిస్తూ ఉండే వారికి ఈ మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాస్టిక్స్ సహాయంతో ఈ మాస్క్‌ను చెవుల వెనక్కి తగిలించుకుంటే ముఖానికి చక్కగా ఎడ్జస్ట్ అవుతుందీ మాస్క్. ఇలా ఈ మాస్క్ అటు ఫ్యాషనబుల్‌గా ఉండడంతో పాటు, ఇటు వైరస్ నుంచి రక్షణ కూడా కల్పిస్తుంది. అలాగే అతినీలలోహిత కిరణాల నుంచి ముఖ చర్మాన్ని కూడా రక్షిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి మాస్కులు మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ. 238 నుంచి రూ. 399 వరకు ఉంది.
క్యాప్ కూడా కావాలనుకుంటే..
ఎండ, వాన నుంచి మనకు రక్షణనిచ్చేది గొడుగు. అయితే ఈ వర్షాకాలం ప్రారంభంలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండగా ఉంటుందో చెప్పలేం. దీంతో చాలామంది గొడుగు తీసుకెళ్లడం నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంతమంది స్టైలిష్‌గా ఉంటుందని క్యాప్ లేదా హ్యాట్ ధరిస్తారు. మీరూ అంతేనా? అయితే ఈ కరోనా కాలంలో డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా ఉండే హ్యాట్-మాస్క్‌ను ట్రై చేసేయండి. ఫొటోలో చూపించినట్లుగా తలపై ధరించే హ్యాట్, దానికి జతగా వెనక భాగంలో భుజాల వరకు వేలాడేలా క్లాత్ కుట్టి ఉంటుంది. ఇక ముందు భాగంలో ముస్లిం మహిళలు ధరించే మాస్క్‌లా మరో క్లాత్ ఉంటుంది. దీనికుండే ఎలాస్టిక్స్ సహాయంతో చెవుల వెనక్కి తగిలించుకోవచ్చు. అలాగే ఒకవేళ ఎక్కడైనా మీకు మాస్క్ అవసరం లేదనిపిస్తే క్యాప్ అలాగే ఉంచుకొని.. మాస్క్‌ను తొలగించచ్చు.. మళ్లీ అవసరం ఉన్నప్పుడు ధరించచ్చు. ప్రస్తుతం ఇలాంటి హ్యాట్-మాస్కులు ప్లెయిన్, ఫ్లోరల్.. ఇలా విభిన్న డిజైన్లలో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకుంటున్నాయి. వాటి డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ.399 నుంచి రూ.684 వరకు ఉంది.
స్కార్ఫ్ కమ్ మాస్క్..
బయటికి వెళ్లేటప్పుడు చాలామంది అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకోవడం సహజమే. దీని వల్ల వాతావరణ కాలుష్యం, ఎండ నుంచి రక్షణ పొందడమే కాకుండా.. స్టైలిష్‌గా మెరిసిపోవచ్చనేది దీని వెనకున్న మరో ఉద్దేశం. ఇలాంటి స్కార్ఫ్ వల్ల ముఖం, జుట్టు కవరవడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి స్కార్ఫ్‌లు కట్టుకునే పనిలేకుండా నేరుగా ధరించేలా ఉండే ప్రి-డ్రేప్‌డ్ స్కార్ఫ్‌లు ప్రస్తుతం మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటిదే ఈ ‘స్కార్ఫ్ కమ్ మాస్క్’. ఫొటోలో చూపించినట్లుగా ఒక పెద్ద క్లాత్ దీర్ఘచతురస్రాకారంలో కుట్టి ఉంటుంది. దానికి మధ్యలో (అంటే మాస్క్ ధరించినప్పుడు కళ్ల వద్ద వచ్చేలా) కాస్త పెద్ద రంధ్రం ఉంటుంది. దానికి ఇరువైపులా మాస్క్ అమర్చుకోవడానికి బెల్టుల్లా కుట్టి, బటన్స్ లేదా స్టికీ ప్యాచెస్‌ను అమర్చుతారు. ఇలా తయారైన స్కార్ఫ్‌ను నేరుగా తలపై నుంచి ధరించి మనకు కావాల్సినంత బిగుతుగా ఎడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫొటోలో చూపించినట్లుగా ఈ స్కార్ఫ్ మాస్క్‌లా కూడా పనిచేస్తుంది. విభిన్న ప్రింట్స్, డిజైన్స్‌లో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతోన్న ఈ స్కార్ఫ్ కమ్ మాస్కుల నాణ్యతను బట్టి ధర రూ.199 నుంచి రూ.400 వరకు ఉంది.
డెనిమ్ మాస్క్
జీన్స్-టీషర్ట్ వంటి స్టైలిష్ దుస్తులు ధరించినప్పుడు ఏదో సాదాసీదాగా ఉండే మాస్క్ పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే అలాంటి వారి కోసం డెనిమ్‌తో తయారుచేసిన వివిధ రకాల మాస్కులు ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరాయి. ఫొటోలో చూపించినట్లుగా ప్లెయిన్, ప్రింటెడ్ తరహా డెనిమ్ క్లాత్‌తో తయారైన ఈ మాస్కులు మనల్ని ఫ్యాషనబుల్‌గా మార్చడంతో పాటు వైరస్ నుంచీ రక్షణ కల్పిస్తాయి. కేవలం ఇవే కాదు.. మనం ధరించే దుస్తులకు మ్యాచింగ్‌గా ఉండే మాస్కులు, ఫ్లోరల్ ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ.. వంటి మాస్కులు కూడా బోలెడన్ని లభిస్తున్నాయి. ఈ కరోనా కాలంలో ప్రత్యేక సందర్భాల్లో సైతం మాస్కులు ధరించడం తప్పనిసరి.. కాబట్టి ఆయా ఫంక్షన్లలో వారు ధరించే పట్టుచీరలు, పరికిణీలకు మ్యాచింగ్‌గా ఉండే మాస్కుల్ని సైతం మగువలు ప్రత్యేకంగా కుట్టించుకొని ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఇలా మాస్కులకూ తమ ఫ్యాషనబుల్ యాక్సెసరీస్‌లో చోటు కల్పిస్తున్నారు. ఇలాంటి డెనిమ్, ఇతర మ్యాచింగ్ మాస్కుల డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ.299 నుంచి రూ.699 వరకు ఉంది.
మల్టీపర్పస్ మాస్క్..
ప్రస్తుతం చాలామంది మహిళలు ఏది కొన్నా.. అది విభిన్న రకాలుగా ఉపయోగపడేదై ఉండేలా చూసుకొని మరీ ఎంచుకుంటున్నారు. మాస్క్ విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రూపొందించిందే ఈ ‘హెడ్‌బ్యాండ్ స్కార్ఫ్ ఫేస్ మాస్క్’ కూడా! ఫొటోలో చూపించినట్లుగా మెడ చుట్టూ కవరయ్యే బ్యాండ్‌లా ఉంటుందిది. దీన్ని నోరు-ముక్కు కవరయ్యేలా మాస్క్‌లా ధరించచ్చు.. అలాగే హెడ్‌బ్యాండ్‌లా, స్టైలింగ్ స్టోల్‌లా, హెయిర్‌బ్యాండ్‌లా, హాఫ్-ఫేస్ మాస్క్‌లా.. ఇలా విభిన్న రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ తరహా మాస్కుల్లోనూ విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన ప్రింట్స్‌తో రూపొందించినవి ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని మీకు కావాల్సినట్లుగా నేరుగా కట్టుకోవచ్చు.. లేదంటే కొన్నింటికి స్టికీ ప్యాచెస్ కూడా అమరి ఉంటాయి. వాటితో కూడా మాస్క్‌ను ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మల్టీపర్పస్ మాస్క్ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ.136 నుంచి రూ.350 వరకు ఉంది.
గమనిక: ఈ మాస్కులన్నీ తిరిగి ఉపయోగించుకునేవే (రీయూజబుల్).. వీటిని ఒకసారి వాడిన తర్వాత సబ్బు నీటిలో అరగంట పాటు నానబెట్టి.. ఆపై ఉతికి.. ఎండలో ఆరేయాలి. పూర్తిగా ఆరాకే మళ్లీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తడిగా ఉన్నప్పుడు, చెమట పట్టినప్పుడు వీటిని అలాగే వాడడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు త్వరగా ఆకర్షితమవుతాయన్న విషయం గుర్తుపెట్టుకోండి.
సో.. మగువల అందాన్ని ఇనుమడింపజేస్తూనే, ఫ్యాషనబుల్ లుక్‌ని అందిస్తూ.. వైరస్ బారిన పడకుండా కాపాడే కొన్ని స్టైలిష్ మాస్కులేంటో తెలుసుకున్నారుగా! అయితే ఆలస్యమెందుకు? వీటిలో మీకు నచ్చిన, నప్పిన మాస్క్‌ను మీ వార్డ్‌రోబ్‌లో చేర్చేసుకోండి మరి!