సమీరా ‘కొడైకెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్’లో పదో తరగతి చదువుతోంది. కొవిడ్ కారణంగా ఇంట్లో నుంచే ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. స్కూల్ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా తన కమ్యూనిటీకి ఏదైనా మంచి చేసే ప్రాజెక్ట్ చేయాలనుకుందామె. పైగా తను చూసిన భార్యాభర్తల ఉదంతం మనసులో మెదులుతూనే ఉంది. ‘అప్పుడే బాగా ఆలోచించాను. మా గ్రామంలోని నిరక్ష్యరాస్య మహిళలకు ఆర్థిక చేయూత అందించాలనుకున్నా. వారు చదువుకోలేదు కానీ కుట్టుపని, చిత్రలేఖనం, టైలరింగ్ చక్కగా చేస్తారు. వారికి వచ్చిన నైపుణ్యాలకే మెరుగు పెట్టి వారిని ఆర్థికంగా బలంగా చేయాలనుకున్నా. నేను చూసిన మహిళతోపాటు, మరికొందరితోనూ మాట్లాడా. ఆ ఆడవాళ్లంతా దగ్గర్లోని అపార్ట్‌మెంట్‌లో పాచి పనులు చేసుకునేవారు. నిరక్షరాస్యులు. ఆర్థిక స్వాతంత్య్రం కూడా లేదు. వారికి చేయూతనివ్వాలనుకున్నా. అలా ‘పిన్‌థ్రెడ్’ను ప్రారంభించా. మన దేశంలో మహిళలందరికీ వంటపని, చిన్న చిన్న కుట్ల వంటివి వస్తాయి. వాటితోనే వారికి ఉపాధి కల్పించాలనుకున్నా. టైలరింగ్‌లో వారికి మరిన్ని మెలకువలు నేర్పేందుకు నిపుణులైన టైలర్స్‌తో తర్ఫీదు ఇప్పించా. ఇప్పుడు ఈ మహిళలు ల్యాప్‌టాప్ కవర్లు, పెన్సిల్ కేసులు, స్టడీ టేబుల్స్ కోసం ఆర్గనైజర్స్, టేబుల్ మ్యాట్స్, మనీ ఎన్‌వలప్స్, క్రిస్మస్ సాక్స్, పెంపుడు జంతువులకు దుస్తులు, కాస్మెటిక్ పౌచ్‌లు, మాస్కులు, పోత్లీలు... ఇలా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న పాత పత్రికలు రీసైకిల్ చేసి వాటిపై రకరకాల రంగుల్లో మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రస్పుటించేలా చిత్రాలూ గీస్తున్నారు’ అని సంబరంగా చెబుతోంది పదహారేళ్ల ధీర.
‘పిన్‌థ్రెడ్’ లక్ష్యం మహిళలకు ఆర్థిక స్వావలంబనతోపాటు పర్యావరణాన్ని కాపాడటం కూడా. వృథా నుంచి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయడం. ‘ఈ అంకురం పనులన్నీ నేనే చూసుకున్నా. మొదట్లో అమ్మా నాన్నల నుంచి అయిదు వేలు తీసుకున్నా. కానీ ఆ డబ్బు సరిపోలేదు. నేనిప్పుడు పిన్‌థ్రెడ్‌ను మూసేస్తే మహిళలకు ఉపాధి ఎలా? ముడిసరకును వారు కొనుగోలు చేయలేరు. మరెలా? అప్పుడే... వృథాగా పారేసే బట్ట ముక్కల్ని వాడుకుంటే అన్న ఆలోచన వచ్చింది. గోరఖ్‌పుర్ పరిసర ప్రాంతాల్లోని టైలరింగ్ షాపులు, బొటిక్‌ల నుంచి బట్ట ముక్కలను సేకరించడం మొదలుపెట్టా. వాటిని శుభ్రంగా ఉతికి తిరిగి వాడుతున్నాం’ అని వివరించింది సమీరా. ‘ప్రస్తుతం వారానికి ఒక మహిళకు తొమ్మిది వందల రూపాయలను ఇస్తున్నాం. ఇంట్లో పనులన్నీ చూసుకుని వచ్చి రోజులో రెండు గంటలపాటు పనిచేస్తారు వాళ్లు. ఆ సమయంలో వారి పిల్లలనూ చూసుకునే దాన్ని’ అని చెబుతోందీ అమ్మాయి.
పిన్‌థ్రెడ్ పనులన్నీ సమీరా ఉంటున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయి. ‘నలుగురు మహిళలతో మొదలుపెట్టా. ఇప్పుడు ఎనిమిది మంది పని చేస్తున్నారు. కొవిడ్ వల్ల ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేకపోతున్నా. ‘పిన్‌థ్రెడ్’ ఉత్పాదనలను ‘ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో చూసి కొనుగోలు చేయొచ్చు. ఈ అంకురాన్ని విస్తరించి వీలైనంత ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలనుకుంటున్నా. దానివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. కావాల్సినవారు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుని వెళ్లేలా కూడా ఏర్పాట్లు చేస్తా. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అవసరమైన, పేద మహిళలకు అందిస్తా’ అంటోందీ సమీరా.
ఇదీ చూడండి: మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తోందట!