ఆధునికత విషయంలో ఇతర దేశాల కంటే ఎంతో ముందుండే జపాన్ దేశంలోని యువతులు, మహిళలు సాధారణంగా తక్కువ జుట్టుతోనే కనిపిస్తారు. వారి శరీరాకృతికి నప్పే విధంగా బాబ్డ్ హెయిర్ స్టైల్‌కే అధిక ప్రాధాన్యమిస్తారు. పొడవాటి జుట్టు పెంచుకున్న మహిళలు అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తారు. అలాంటి అరుదైన కోవకే చెందుతుంది జపాన్ రాజధాని టోక్యో నగరానికి చెందిన 35 ఏళ్ల రిన్ కాంబే. వృత్తిరీత్యా మోడల్ అయిన ఆమె.. గత 15 ఏళ్లుగా తన కురులను కత్తిరించుకోకుండా ప్రాణప్రదంగా పెంచుకుంటోంది. చివరిగా 20 ఏళ్ల వయసున్నప్పుడు ఒకసారి తన జుట్టును ట్రిమ్ చేసుకున్న రిన్ ఆ తర్వాత కత్తెరకు అసలు పని చెప్పలేదు. ఈ క్రమంలో మొత్తం ఆరడుగుల మూడు అంగుళాల పొడవాటి జుట్టుతో సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయిందీ జపాన్ సొగసరి.
జపనీస్ రాపంజెల్‌గా!
అందంతో పాటు అత్యంత పొడవైన కేశ సంపద ఉన్న అమ్మాయిలను సాధారణంగా జర్మన్ కార్టూన్ క్యారక్టర్ ‘రాపంజెల్’ తో పోలుస్తారు. అలా ప్రస్తుతం జపనీస్ రాపంజెల్‌గా సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకుంది రిన్‌కాంబే. సోషల్ మీడియాలో కూడా రోజురోజుకీ ఆమె ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 32.70 లక్షల మంది తనను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో తన పొడవాటి జుట్టు కారణంగా తనకు పెరుగుతోన్న పాపులారిటీని చూసి తెగ సంబరపడిపో తోంది రిన్. ఇదే సమయంలో తన పొడవాటి కురులను కాపాడుకునేందుకు తానెలాంటి చిట్కాలు పాటిస్తుందో అందరితో షేర్ చేసుకుంది.
అవే నా పొడవాటి కురుల ఆరోగ్య రహస్యం!
‘20 ఏళ్ల వయసున్నప్పుడు నేను బుద్ధిజంలోకి మారాను. అప్పటి నుంచి నా కురులను కత్తిరించుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆరడుగుల మూడు అంగుళాల వరకు నా వెంట్రుకలు పెరిగాయి. అయితే జుట్టు పెంచడమంటే సాధారణ విషయమేమీ కాదు. నేను 15 ఏళ్లుగా నా శిరోజాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఇందులో భాగంగా కుంకుమపువ్వుతో తయారుచేసిన క్రీమ్‌ను తరచుగా వెంట్రుకలకు పూస్తుంటాను. దీంతో పాటు ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకుంటున్నాను’ అంటూ తన హెయిర్ కేర్ టిప్స్ గురించి చెప్పుకొచ్చిందీ జపనీస్ రాపంజెల్.
అలా కూడా అంటారు!
రిన్ నిలబడితే తన ఆరడుగుల కురులు నేలను తాకుతుంటాయి. ఈ క్రమంలో తన జుట్టు కారణంగానే తనకు ప్రత్యేకమైన పాపులారిటీ వచ్చిందంటోందీ బ్యూటీ. ‘సహజంగా, పొడవుగా పెరిగిన జుట్టే నాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. చాలామంది నా శిరోజాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటారు. అదే సమయంలో కొందరు ‘మాన్‌స్టర్ హెయిర్ (దయ్యం జుట్టు) అని నెగెటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు’ అని అంటోందీ జపనీస్ ముద్దుగుమ్మ. తన ఆరడుగుల జుట్టుతో సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయిన ఈ జపనీస్ రాపంజెల్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
- ఇదీ చూడండి : నల్లగా.. ఒత్తుగా.. కురులు నిగనిగలాడగా!