Jagtial Sweet Shop Fight : మనం సాధారణంగా ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, స్నేహితులతో అలా సరదాగా ఏదైనా తినడానికి రెస్టారెంట్‌కో, ఇంకా కుదిరితే స్వీట్ షాప్‌కో వెళ్తుంటాం. తిను బండారాలు ఎక్కడైతే ఫ్రెష్‌గా ఉంటాయో తెలుసుకుని మరి వెళ్లి రుచి చూస్తాం. నచ్చితే కావాల్సిన స్వీట్స్‌ను తీసుకుని వాటి ధర ఎంతో తెలుసుకుని చెల్లిస్తాం. కానీ ఇక్కడ మాత్రం తీసుకున్న స్వీట్స్‌కు డబ్బులు అడిగితే పెద్ద వివాదం చెలరేగింది.
స్వీట్ హౌజ్ యజమానిపై గుర్తు తెలియని ఓ యువతి, యువకుడు ఉన్నట్టుండి పిడిగుద్దులతో దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ అక్కడున్న సీసీకెమెరాలో రికార్డయ్యింది. జగిత్యాల టౌన్‌లోని మోచి బజార్ వద్ద బాలాజీ స్వీట్ హౌజ్ ఉంది. దీనిని కొన్నేళ్ల కిందట రాజస్థాన్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆ ప్రాంతం వారు నిర్వహిస్తున్నారు. అయితే ఓ యువతి, యువకుడు పలుమార్లు రుచి చూడడానికి వచ్చి ఉచితంగా స్వీట్స్ తిన్నారు.
ఫోన్‌పే తో ముదిరిన గొడవ : ఆర్డర్ పెద్ద మొత్తంలో చేస్తామని వెళ్లిపోయారు. రెండు, మూడు సార్లు యజమానితో ఆర్డర్ ఇస్తామని చెప్పి స్వీట్ తినేసి వెళుతుండడంతో ఆ స్వీట్ హౌజ్ యజమాని ఇలా చేస్తే వ్యాపారం నడవదని మీరు తినేసిన స్వీట్‌కు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దాంతో ఆ యువతి యువకుడు ఆన్లైన్లో ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించామని చెప్పారు. యజమాని తన ఫోన్లో చూసేసరికి డబ్బలు జమ కాలేదు. డబ్బులు తన ఖాతాలో జమకాలేదని ఆ ఓనర్ వారితో అన్నాడు.
దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆ ఇద్దరు యజమాని కౌంటర్ వద్దకు వెళ్లి అతనిపై పిడిగుద్దులతో మెరుపు దాడి చేశారు. అక్కడున్న వారంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వివాదం ఎక్కువవుతుండటంతో స్థానికులు కలుగజేసుకుని ఆ యువకుడు, యువతిని అదుపు చేశారు. స్వీట్ హౌజ్‌లో ఉన్న సీసీటీవీలో దుకాణ యజమానిని చితకబాదుతున్న యువతి, యువకుడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. అనంతరం స్థానిక పోలీసులకు దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినట్లు ఆ దుకాణ యజమాని తెలిపారు. వారు వెళుతూ చంపేస్తామని బెదిరింపులు చేసినట్లు వాపోయారు.
Mother in law beat Pregnant Woman : అబార్షన్ చేసుకుంటోందంటూ.. యువతిని చిదకబాదిన అత్తమామలు