పచ్చని వాతావరణంలో వీణానంద(Veena Nanda) బాల్యం గడిచింది. తాతగారు పెంచే కాఫీ తోట, ఇంటి పెరట్లో అమ్మ పండించే కూరగాయలు ఆమెకు తోటపెంపకంపై ఆసక్తిని పెంచాయి. బెంగళూరులోని ఎమ్‌ఈసీ కాలేజీలో బీఏ చదివిన తర్వాత వివాహం కావడంతో భర్తతో కలిసి ముంబయికి వెళ్లారీమె. అక్కడ ప్రముఖ బోన్సాయ్ కళాకారులు జ్యోతి, నికుంజ్ పరిచయమయ్యారు. వారి స్ఫూర్తితో ఇందులో బేసిక్, అడ్వాన్స్‌డ్ కోర్సులు చేశారు. ఆ తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చేశారు.
మూడు నుంచి వెయ్యి వరకు...
బెంగళూరుకు మూడు బోన్సాయ్ మొక్కలతో వచ్చారు వీణ(Veena Nanda). తర్వాత అదే పూర్తికాల వ్యాపకం అయింది. క్రమంగా మెలకువలను తెలుసుకున్నారు. అలా 1999 నుంచి లాల్‌బాగ్ బోన్సాయ్ పోటీల్లో అయిదేళ్లు వరుసగా విజేతగా అవార్డులూ అందుకున్నారు. తన దగ్గరున్న బోన్సాయ్ మొక్కల సంఖ్య ఇప్పుడు 1000 దాటి పోయింది. ‘ఏ పోటీలో పాల్గొన్నా.. ప్రైజ్ నాకే వచ్చేది. కొన్నాళ్లకు ఈ కళను మరింత విస్తృతం చేయాలనిపించింది. ఆసక్తి ఉన్నవారికి శిక్షణనివ్వడం మొదలుపెట్టా. ప్రత్యేకంగా కోర్సుల రూపంలోనూ అందిస్తున్నా. ప్రతివారం వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా. నావద్ద నేర్చుకున్న వారిలో 80శాతం మంది మహిళలే. నా బాల్కనీలో మామిడి, సపోటా, జామ, నిమ్మ వంటిజాతులెన్నో ఉన్నాయి. చాలామందికి బోన్సాయ్ అంటే ఇంటికి మంచిది కాదనే అపనమ్మకం ఉంది.
ఏదైనా పచ్చని మొక్కే. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ వామన వృక్షాలతో ఇంటిని తీర్చిదిద్దుకున్న తీరు బంధువులు, స్నేహితులకు బాగా నచ్చింది. మాకూ అలా చేసిమ్మని అడగడం మొదలు పెట్టారు. అప్పుడిక ల్యాండ్ స్కేపర్‌గా కెరీర్‌ను ప్రారంభించా. ‘సన్‌షైన్ నెస్ట్ అండ్ గార్డెన్స్’ సంస్థను స్థాపించి, దానిద్వారా వచ్చే ఆర్డర్ల మేరకు బాల్కనీ, టెర్రస్‌పై గార్డెన్లను అందంగా తీర్చిదిద్దుతున్నా. వినియోగదారుల అభిరుచి మేరకు బోన్సాయ్ లేదా వాల్ గార్డెన్స్‌ను కూడా ఏర్పాటు చేసి ఇస్తున్నా. ఇప్పుడు చాలా మందికి తోట పెంపకం, బోన్సాయ్ కళపై ఆసక్తి పెరగడం సంతోషంగా అనిపిస్తుంది. ఇందులో రాణించాలంటే ఆసక్తితోపాటు ఏకాగ్రత, సహనం, సాధన ఉండాలి. వీటికి పెద్ద స్థలం కూడా అవసరం లేదు. ఉన్న కాస్తచోటులోనే మహావృక్షాలను పెంకోవచ్చు. బోన్సాయ్ మొక్కలు హాలు, పడకగది, రీడింగ్‌రూంకు అదనపు అందాన్ని తెస్తాయి’ అని అంటున్నారు వీణానంద. ఈ ఆసక్తి నన్ను వ్యాపారవేత్తనూ చేసింది అని మురిసిపోతున్నారు వీణ.
- ఇదీ చదవండి : ఇంటినే నర్సరీగా మార్చిన మంచిర్యాల వాసి