హైందవ సమాజంలో స్త్రీని దేవతామూర్తిగా భావిస్తుంటారు. దీని వల్ల సమాజంలోని మహిళలను గౌరవప్రదంగా చూడటం, అభిమానంతో వ్యవహరించటం అలవాటు అవుతుంటాయి. పాశ్చాత్య వ్యామోహంలో ఆడవారిని ఆట బొమ్మలుగా చూసే వైఖరికి ఇది పూర్తిగా భిన్నమైన రీతి. భారతదేశంలో అమ్మవారి ఆరాధనను క్రమం తప్పకుండా చేసేందుకు ఏర్పాటు అయినవే నవరాత్రులు. ప్రతీ ఏటా అయిదు సార్లు ఇటువంటి నవరాత్రులు వస్తుంటాయి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో శాకాంబరీ నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, పుష్య మాసంలో శారదా నవరాత్రులు వస్తాయి.
ఉగాది రోజున మొదలై తొమ్మిది రోజుల వసంత నవరాత్రులు జరుగుతాయి. ఉగాది రోజు ఉదయం వినాయక పూజ చేసి, వసంత నవరాత్రులకు శ్రీకారం చుడతారు. అమ్మవారిని కలశ రూపంలో, జ్యోతి రూపంలో ఏర్పాటు చేసుకొనే ఆనవాయితీ కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. చాలా మంది మాత్రం పూజా మందిరంలోని అమ్మవారి ప్రతిమకే పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో కుంకుమార్చన మంచిదని చెబుతారు. ఈ తొమ్మిది రోజుల్లో రకరకాల పిండివంటలు తయారుచేసి అమ్మవారికి నివేదన చేస్తారు. తొమ్మిదో రోజున శ్రీరామ నవమి కాబట్టి సీతా రామచంద్రులను పూజించుకొంటారు. వసంత నవరాత్రులు వాతావరణంలో తీవ్రమైన మార్పులు జరిగే వస్తుంటాయి. అందుకే ఈ ఆరాధనలో కొన్ని ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉగాది రోజు ఉదయం పచ్చడి చేసుకొని అందరికీ పంచటం, శ్రీరామ నవమి రోజున పానకం ఆస్వాదించడం అందులో భాగాలే.
.. యలమంచిలి రమ విశ్వనాథన్