కెనడాలో ఒక పెద్ద పట్టణం మాంట్రియల్. అక్కడ యూనివర్శిటీ ఆఫ్ క్యుబెక్ అనే రద్దీ ప్రాంతముంది. రహదారికి ఇరువైపులా దుకాణాలు, షాపింగ్ మాల్స్, సైన్స్ సెంటర్, మ్యూజిక్ కాంప్లెక్స్ లాంటివి బోలెడుంటాయి. అక్కడ ఏర్పాటు చేశారీ సంగీత ఉయ్యాలలని.
ఎప్పుడు పెట్టారంటే..
2011లో! ఇవి మొత్తం 21 ఉంటాయి. ఈ చోటునో బస్టాపుల్లా మలచి, వచ్చే పోయే వారు కాసేపు ఊగి వెళ్లేలా ఏర్పాటు చేశారు.
ప్రత్యేకతలెన్నో!
ఈ ఊయల ఒక్కోటి ఒక్కో రకమైన సంగీతాన్ని వినిపిస్తుంది. అలా వచ్చేందుకు జైలోఫోన్, పియానో వంటి వాయిద్యాల శబ్దాన్ని రికార్డు చేసి అమర్చారు. వీటిపై ఎక్కి కూర్చోగానే కూర్చునే పలక, రంగు రంగుల లైట్లతో వెలుగుతుంది. ఊగటం మొదలుపెట్టగానే చక్కటి సంగీతం వినిపిస్తుంది. మీరు జోరు పెంచారనుకోండి.. సంగీత స్థాయి కూడా పెరుగుతుంది. ఒకవేళ అన్ని ఉయ్యాలలూ ఒకేసారి కనుక ఊగితే ఆ పరిసరాలన్నీ శ్రావ్యమైన సంగీతంతో ప్రతిధ్వనిస్తాయి. ఇవి కేవలం మనుషులు కూర్చుని ఊగేటప్పుడు మాత్రమే పనిచేసేలా అమర్చారు. కానీ ఒక్క క్షణం కూడా ఆగకుండా మోగుతూనే ఉంటాయి. అంటే జనాదరణ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆలోచన వీరిదే!
మౌనా ఆండ్రోస్, మెలిస్సా మొంగియాట్ అనే కళాకారుల ప్రతిభే ఇదంతా. ఈ సృజనకు ఇద్దరూ ఎన్నో అభినందనలు, మరెన్నో అవార్డులూ అందుకున్నారు. అక్కడుండే వాళ్లకు తోడు సందర్శకుల తాకిడి కూడా పెరుగుతోంది. ఈ ఊయ్యాల్లో ఊగే వారి సంఖ్య రోజుకు 8 వేలకు పైనేనట. కనుకనే మాంట్రియల్ మ్యూజికల్ స్వింగ్స్ పేరు ప్రపంచమంతా ఊగేస్తోంది!