రాజస్థాన్‌లోని తిలోనియా గ్రామవాసులకు నలభై ఏళ్ల కిందట కరెంటు లేక కిరోసిన్ దీపాలనే వాడేవారు. గ్యాస్ అంటే ఏంటో వాళ్లకు తెలియదు. వంటలకు కిరోసిన్, కట్టెల పొయ్యినే ఆశ్రయించేవారు. అక్కడి తాగునీటి కొరత, విద్య వంటి సమస్యలను పరిష్కరించడానికి ‘బేర్ ఫుట్’ ఎన్జీవో కృషి చేసేది. 1990లో స్థానికంగా మహిళా సాధికారతను కల్పించడానికి ‘సోలార్ ప్రోగ్రామ్ (Solar Program)’ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘బేర్ ఫుట్ కాలేజీ’ని ప్రారంభించింది. చదువు అర్హతతో కాకుండా ఆసక్తి ఉన్న మహిళలను చేర్చుకుని ఆరు నెలలపాటు సోలార్ ఇంజినీరింగ్‌లో శిక్షణనందించి, ‘సోలార్ మదర్స్ (Solar Mothers)’గా, ఇంజినీర్స్‌గా తీర్చిదిద్దింది. జీవితంలో సౌరశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ మహిళలు శిక్షణ పొందారు. వంట చేయడానికి సోలార్ కుకర్స్, వాటర్ హీటర్స్‌ను వినియోగించడం నేర్చుకున్నారు. సోలార్ ల్యాంప్ కిట్స్ తయారీలో నైపుణ్యాలను సాధించారు. శిక్షణ తర్వాత వీరంతా సౌరశక్తితో వెలిగే దీపాల తయారీలో భాగస్వామ్యులయ్యారు. దీంతో ప్రతి ఇంట్లో ఈ దీపాలు వెలిగాయి. చీకటి దూరమైంది. తర్వాత ఈ అభివృద్ధి రాజస్థాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా శిక్షణనందించడం ప్రారంభించిందా సంస్థ. దీంతో వేలమంది నిరక్షరాస్య మహిళలు సోలార్ ఇంజినీర్లుగా మారారు.
సమస్యల పరిష్కారంలో...
సౌర లాంతర్ల తయారీతో వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి. ఇంటి ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి. క్రమంగా వారు తమ తోటి మహిళలకు చేయూతగా ఉండటం మొదలుపెట్టారు. ఆపై గ్రామ సమస్యలను పరిష్కరించడంలోనూ ముందడగు వేశారు. రాజస్థాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 96 దేశాలకు చెందిన పదిహేను వేల మంది మహిళలు ఈ కాలేజీలో ఇప్పటివరకు శిక్షణ పొందారు. ప్రకృతి విపత్తులు, యుద్ధ ప్రభావం, శరణార్థుల శిబిరాల నుంచి ఆసక్తి ఉన్నవారిని ఈ సోలార్ ఇంజినీరింగ్ శిక్షణకు ఎంపిక చేస్తారు. దీనికయ్యే ఆర్థిక భరోసాను కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రపంచబ్యాంకు, పలు ఎన్జీవోలు అందిస్తున్నాయి. సోలార్ మదర్స్ ద్వారా ఇప్పటివరకు 1200 గ్రామాల్లో అయిదు లక్షలమంది లబ్ధి పొందారు.
భాష ఒక సమస్య కాదు...
ఆఫ్రికా, సౌత్ అమెరికా, పసిఫిక్ ఐలండ్స్ తదితర దేశాల నుంచి రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీకి సోలార్ ఇంజినీరింగ్ ట్రైనింగ్‌కు వచ్చే మహిళలు తమకు ఇక్కడి భాష ఒక సమస్య కాదు అంటారు. ‘జీవితంలో పురోభివృద్ధి, సాధికారత సాధించాలని ఇక్కడికొచ్చాం. ప్రాంతీయభాషను నేర్చుకోవడానికి మాకెంతో ఆసక్తి. ఎన్నో కష్టాలు, సమస్యల నుంచి బయటపడాలని అనుకున్న మాకు ఈ శిక్షణ ఒక మార్గదర్శకమైంది. మా దేశాలకు తిరిగివెళ్లేటప్పుడు ఆత్మవిశ్వాసంతో అక్కడ అడుగుపెడుతున్నాం’ అని చెబుతున్నారు.
ఇదీ చూడండి: ganja seized in Hyderabad : రూ.2.08 కోట్లు విలువ చేసే గంజాయి సీజ్
వ్యర్థాలతో 'సోలార్ సైకిల్' రూపొందించిన విద్యార్థి!
KTR: 'సోలార్ విద్యుదుత్పత్తిలో.. దేశంలోనే తెలంగాణ రెండోస్థానం'
ఏడేళ్లలో 17 రెట్లు పెరిగిన సౌర విద్యుత్ సామర్థ్యం
Carbon emissions : కర్బన ఉద్గారాల నుంచి దేశానికి విముక్తి ఎలా?