ప్రకృతికి దాచుకోవడం తెలీదు, ఉన్నవన్నీ పంచి పెట్టడం దాని తత్వం. పంచభూతాలు స్వార్థాన్ని విడిచిపెట్టి తమంతట తాముగా పరహితానికి అంకితమవుతున్నాయి. మానవీయతను ప్రదర్శించడంలో కార్తికమాసం చక్కటి భూమికను పోషిస్తుంది. దీపదానం మొదలుకొని ఫలదానం, లింగదానం, అన్నదానం, కన్యాదానం వరకు అనేక దానాలు శక్తి కొద్దీ ఇవ్వాలని స్కాందపురాణం తెలియజేస్తుంది. సమాజంలోని హెచ్చుతగ్గుల నివారణకు స్వచ్ఛందంగా ఇచ్చే దానాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు.
సర్వజ్ఞాన ప్రదం దీపం, సర్వసంపత్సు భావహం
దీపదానం ప్రదాస్యామి, సుఖశాంతిరస్తు సదామమ
‘సమస్త జ్ఞాన సంపదల్ని ప్రసాదించే దీపాన్ని సుఖశాంతుల్ని కోరుకుంటూ దానమిస్తున్నాను’ అని మనసులో స్మరిస్తూ దీపదానం చెయ్యాలి. దీపదాన ఫలితంగా త్రికరణాలైన మనసు, వాక్కు, శరీరాలతో చేసిన పాపాలు నశిస్తాయంటారు.
మూడు కాలాలు, ఆరు రుతువులతో సప్త వర్ణ శోభితమవుతుంది ప్రకృతి. వసంత రుతువులో మృదుమంజుల కోకిల స్వరాలు వినిపిస్తే, వర్ష రుతువులో కారుమబ్బులు గర్జిస్తూ హోరు పెడతాయి. దేని ప్రత్యేకత దానిదే. వాటికి అనుగుణంగా మనిషిని వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసుకున్నవే పండుగలు. శ్రావణ, భాద్రపదాల్లో తీవ్రంగా కురిసిన వర్షం ఆశ్వయుజంలో నెమ్మదిస్తుంది. కార్తికం నుంచి ప్రారంభమైన చలిగాలులతో ప్రకృతి నిత్యం అనేక మార్పుల్ని పొందుతుంది. భక్తి మిళితమైతే మంచినీరే తీర్థంగా, రోజూ తినే సాధారణ ఆహారమే పరమ ప్రసాదమై పవిత్రతను సంతరించుకుంటాయి. మన జీవన విధానానికి భక్తిని ఆపాదించి ప్రకృతితో మమేకమయ్యేలా చేయడం కార్తికమాస ప్రత్యేకత.
న కార్తిక సమో మాసః న శాస్త్రం నిగమాత్పరం
న ఆరోగ్యం సముత్సాహం తదేవ కేశవాత్పరం
కార్తికం(Karthika Masam speciality)తో సమానమైన మాసం లేదు, వేదాలను మించిన శాస్త్రం లేదు, ఉత్సాహాన్ని మించిన ఆరోగ్యం లేదు, కేశవునితో సమానమైన దైవం లేదు అంటారు. దీన్నిబట్టి రుతుచక్రంలో కార్తికమాస విశిష్టత అర్థమవుతుంది.
శీతల స్నానం, భూతల శయనంతో పాటు ఉపవాసాలు, దీపారాధనలు, సామూహిక వనసమారాధనలతో భక్తి ఉప్పొంగి మనుషుల్లోని కల్మషాల్ని, వాతావరణంలోని కాలుష్యాన్ని అంతరింపజేస్తుంది.
ఆరోగ్యదాయకం...
కార్తికంలో భక్తులు వేకువజామునే నిద్ర లేచి...
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
అనుకుంటూ చన్నీటిస్నానం చేయడం సంప్రదాయం. ‘అసలే చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంటే శీతలస్నానమా?!’ అని కార్తిక ప్రాశస్త్యం(Karthika Masam speciality) తెలియనివారికి విడ్డూరంగా అనిపించవచ్చు. చన్నీటి స్నానం రక్తప్రసరణలో వేగాన్ని పెంచి చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. శరీరాన్ని ఉత్తేజపరచి ముఖంలో తేజస్సు ప్రస్ఫుటమయ్యేలా చేస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఎక్కడో పర్వతాల్లో ఉద్భవించిన నదులు చెట్లు, గుట్టల మీదుగా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహంలో వ్యాధి నివారక ఔషధాలెన్నో కలిసి ఆ నీళ్లలో వ్యాధిహరణ శక్తి వృద్ధి చెందుతుంది. కృష్ణ, గోదావరి వంటి పుణ్యనదుల్లో స్నానం చేయడం ద్వారా దేహబాధలు తొలగి లక్ష్యసిద్ధి కోసం ప్రయత్నించాలనేది పెద్దల ఆశయం.
ఈ నెలలో ఎక్కువగా కందదుంపల్ని, నేతి బీరకాయల్ని ఆహారంలో తీసుకోవాలని పెద్దలు చెబుతారు. అందుకు వైద్యపరంగాను అనేక కారణాలున్నాయి. నేతి బీరకాయ దృష్టి దోషాన్ని సరిజేస్తుంది. తరచుగా వీటిని భుజించడం చేత చక్కని దృష్టి వశమవుతుంది. చెడుకొవ్వుని తొలగించి హృద్రోగాల్ని నయం చేయడంలో కందదుంప ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
కార్తిక మాసం(Karthika Masam speciality)లో చలి తీవ్రత వృద్ధి చెందుతుంది. తత్ఫలితంగా శ్వాసకోశాల సంకోచ వ్యాకోచాల్లో మార్పు వస్తుంది. దీపారాధనలో వెలువడే ధూమాన్ని పీల్చడం వల్ల ఈ ఇబ్బంది కొంతవరకూ తగ్గి స్వస్థత చేకూరుతుంది. చల్లదనం కారణంగా మన జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఆవు నేతిలో ఆ లోపాన్ని సరిదిద్దే గుణం ఉంది. అందువల్లే దీపారాధనలో ఆవు నెయ్యి ఉత్తమం అన్నారు. మన శారీరక మానసిక రుగ్మతల్ని ప్రకృతిసిద్ధ ఔషధాలతో నయం చేసుకోవడంలో పూర్వీకులకున్న జ్ఞానం అమోఘం.
ఒక్కో నూనె.. ఒక్కో ఫలితం..
కార్తికం(Karthika Masam speciality)లో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలంతా స్త్రీలు భక్తి పరిపూర్ణ చిత్తులై శివాలయాల్లో దీపారాధన చేస్తారు.
ఉత్తమం గోఘృతం ప్రోక్తం మధ్యమం తిలతైలకమ్
అధమం మధుతైలం స్యా వన్య సంభవ మధమాధమమ్
దీపారాధనలో ఆవునేతిని ఉపయోగించడం ఉత్తమం. నువ్వుల నూనె మధ్యమం. వేరుశనగ నూనె అధమం. ఇప్పపూల నుంచి లభించే నూనె అధమాధమం అని ధర్మజ్ఞులు చెబుతారు.
ఆయా నూనెల్ని ఉపయోగించడం వలన కలిగే సత్ఫలితాలివీ..
గోఘృతాన్ జ్ఞాన సిద్ధిశ్చ మోక్షప్రాప్తిః తతః పరమ్
సంపద్వృద్ధిర్యశో వృద్ధిః తిలతైలం దదాతి హి
ఆవు నేతితో వెలిగించిన దీపం వలన జ్ఞాన సిద్ధి, మోక్ష ప్రాప్తి కలుగుతాయి. నువ్వులనూనెతో చేసిన దీపారాధన సంపదల్ని, కీర్తిని వృద్ధి చేస్తుంది.
భోగస్త దైహికశ్చైవ మధుతైలం దదాతి చ
వన్యాదికంతు కామ్యార్థం తతస్సర్షప తైకలమ్
ఇప్పనూనె మూలంగా ఐహిక సుఖాలు మాత్రమే నెరవేరతాయి. ఆవనూనె కోరికల్ని తీరుస్తుంది.
అగస్త్వం భవం తైలం శత్రు నాశన కారణమ్
ఏరండ తైల దీపేన సంపదాయుశ్చ నశ్యతి
అవిసె నూనె శత్రు నాశనం చేస్తుంది.
దీపారాధనలో ఆముదపు నూనెను నిషేధించారు. లేదంటే సంపదలు, ఆయుష్షు నశిస్తాయని విజ్ఞుల నమ్మకం.
యఃకార్తికేసితే వనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామం సర్వపాపైః ప్రముచ్యతే
కార్తిక మాసంలో వన భోజనం ఏర్పాటు చేసినవారు, భుజించినవారు పాపరహితులై విష్ణుధామాన్ని పొందుతారని పురాణాంతర్గతంగా ఉంది.
అంతరార్థం
పార్వతి ప్రకృతి దాల్చిన ఆకృతి. శివుడు విశ్వస్వరూపుడు. మనిషి ప్రకృతిలో అంతర్భాగం. కార్తికంలో భక్తి చిత్తులై ఉండటం అంటే భౌతిక దృష్టి పరంగా ప్రకృతిమాత ఒడిలో సేదదీరడం. ఆధ్యాత్మికదృష్టిలో మాతాపితృ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు సన్నిహితంగా మెలగడం.
వనభోజనాలు
వన సమారాధనల పేరుతో ప్రజలు ఐకమత్యాన్ని ప్రదర్శించే అపురూపదృశ్యాలు కార్తిక మాసం(Karthika Masam speciality)లో కనిపిస్తాయి. పనిఒత్తిళ్లతో అలసిన మనకు వనభోజనాలు చక్కని ఆట విడుపు. అనుబంధాలు యాంత్రికమవకుండా సేదదీర్చే చల్లని తరుణం కార్తికం. వనభోజనాల పేరుతో బంధుమిత్రుల్ని ఒకచోట చేర్చి ఆనందాలు పంచుతుంది.
- ఇదీ చదవండి : మారేడు వృక్షం విశిష్టత ఏంటి? శివ పూజ ఎలా చేయాలి..?