ఆలోచనల్లో స్పష్టత ఉంటే చాలు. రంగమేదైనా అద్భుతాలు సృష్టించొచ్చనేది మొదటి నుంచీ నా నమ్మకం.అందుకే పరిశోధనా రంగాన్నే భవిష్యత్తులో కెరీర్‌గా ఎంచుకోవాలని కలలు కన్నాను. జీఆర్‌ఈ, టోఫెల్ రాసి అమెరికా వెళ్లాలనుకున్నా. క్యాన్సర్‌పై పరిశోధనలు చేయాలనుకున్నా. దురదృష్టవశాత్తు ఆ సమయంలో మా తమ్ముడు చనిపోయాడు. దాంతో అమ్మ షాక్‌లోకి వెళ్లిపోయింది. ఒకే ఒక్క ఆడపిల్లని కావడంతో అంతదూరం ఒంటరిగా పంపించడం మంచిది కాదనుకుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లాయ్యక పీజీకి ఎంట్రెన్స్ రాశా. 2006లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేసి ఓ సంస్థలో ఉద్యోగానికి చేరా. అక్కడ ఔషధ మొక్కలపై పరిశోధన చేసే ఓ ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించా. అదే అంశంపై జేఎన్‌టీయూలో పీహెచ్‌డీకి కూడా దరఖాస్తు చేసుకున్నా. అనుకోకుండా నేను పనిచేస్తున్న సంస్థ నష్టాల్లో పయనించడంతో మూసివేతకు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో నన్ను పిలిచి మీరు ఈ ప్రాజెక్ట్‌ని కొనసాగించాలంటే మీ ఇష్టం...మేమైతే నిధులు అందించలేం అని చెప్పారు.
సీసీఎంబీ సహకారంతో...
పరిశోధన అంటే మాటలు కాదు. బోలెడంత పెట్టుబడి, సాంకేతికత అవసరం. ఆ సమయంలో నాకు జేఎన్‌టీయూ, సీసీఎంబీలు ఎంతో సహకరించాయి. డాక్టర్ ఏవీరావ్, డాక్టర్ అగర్వాల్‌ల ఆధ్వర్యంలో సీసీఎంబీలో ఏడాదిన్నరపాటూ అక్కడే మరిన్ని ప్రయోగాలు చేసి సాంకేతికతపై పట్టు సాధించా. 2014లో నా పరిశోధన పూర్తయ్యింది. ప్రస్తుతం నేను అభివృద్ధి చేసిన టెక్నాలజీకి పేటెంట్ హక్కుకోసం దరఖాస్తు చేశా. అది గ్రాంటబుల్ దశలో ఉంది.
అదే మలుపు...
అప్పటికే ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి అవసరమైన శక్తినంతా ధారపోశా. మా గైడ్ డా.అర్చనాగిరి ఇచ్చిన ప్రోత్సాహంతో ముందడుగువేశా. ఆద్యా బయోటెక్ పేరుతో సంస్థను ప్రారంభించా. కష్టాలెన్నొచ్చినా ముందడుగు వేశా. 2014లో పరిశోధన పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నా. మరో పక్క నల్సార్ యూనివర్శిటీ నుంచి పేటెంట్‌లాలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. నేను పూర్తి చేసిన మెడిసినల్ టెక్నాలజీకి పేటెంట్‌కోసం దరఖాస్తు చేశా. గ్రాంటబుల్ దశలో ఉంది. కమర్షియల్ పద్ధతిలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నా.
ఏంటా పరిశోధన
భవిష్యత్తులో వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. ఆహారధాన్యాలు, ఇతరత్రా ఔషధ మొక్కలు వంటివి డిమాండ్‌కి తగ్గట్లు దొరకడం కష్టం. ముఖ్యంగా వివిధరకాల ఔషధాల్లో ప్లాంట్స్ సెకండరీ మెటబలైట్స్ (బయోకాంపౌండ్స్)కి కొరత ఏర్పడుతుంది. వీటిని ఔషధ మొక్కల్ని నుంచి మాత్రమే సేకరిస్తారు. ఇవి చేతికి రావడానికి ఏడాది నుంచి మూడేళ్లకాలం పడుతుంది. బయోటెక్నాలజీ సాయంతో దానికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేద్దామనుకున్నా. ఎక్కువ సమయం తీసుకోకుండా, పెద్ద ఎత్తున భూమి అవసరం లేకుండా పంట చేతికొచ్చే ఉపాయమే మేం చేసిన పరిశోధన. ఈ సాంకేతికత ద్వారా నెలకొకసారి వంద ఎకరాల్లో వచ్చే పంటను 10,000 చదరపు అడుగుల్లోనే సాగుచేసి పదింతలు పంట వచ్చేలా చేయడమే మా లక్ష్యం. ఈ పద్ధతిలో మొదట మొక్కల్ని ల్యాబ్‌లో పెంచుతాం. అవి కాస్త పెరిగాక వేర్లను వేరు చేసి ద్రావకంలో ముంచి నేరుగా సాగు చేయొచ్చు. మొదట ఔషధ మొక్కలపై ప్రయోగించాం. కర్కుమాలోంగా, వితానియా సొమానిరీ వంటి డిమాండ్ ఉన్న ఔషధ మొక్కలపై మేం పరిశోధన చేశాం. త్వరలోనే వాణిజ్య దశకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం.