చాలామంది మహిళలకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే ‘అమ్మో నేనీ బాధ్యత నెరవేర్చగలనా’ అని ఆలోచిస్తారట. ఆ భయంతోనే వెనకడగు వేస్తారు. అలాంటప్పుడు ఆ పనిని అలా కాకుండా మరోలా చేయగలమా అనిఆలోచించాలి. అంటే ప్లాన్ బి గురించిన ఆలోచన కూడా చేయాలట. అప్పుడు ఎలాంటి క్లిష్టతరమైన పనిని సులభం చేయడానికైనా తగిన మార్గాలు కనిపిస్తాయి.
మీకు మీరేం చెప్పుకొంటున్నారు:
మనలో చాలామంది మన మనసు మనకు చెప్పేదాని కన్నా ఇతరులు చెప్పేదానికే విలువనిస్తారు. చాలాసార్లు ఆ మాటలే మన ఆత్మవిశ్వాసాన్ని, ఆహార్యాన్ని, నిర్ణయాలనీ ప్రభావితం చేస్తాయి. అలా ఇతరులు చెప్పేది వింటూ పోవడం కాకుండా... మీదైన నిర్ణయాలు తీసుకుంటే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లగలుగుతారు.
మీ సమయం మీకుందా:
చాలామంది ఉద్యోగినులు... బృంద సభ్యులూ, పై అధికారులతో చర్చలూ, ఇంట్లోవాళ్ల అవసరాల కోసం టైం కేటాయిస్తారు కానీ... తమ కోసం కొంత సమయం కేటాయించుకోవడం మాత్రం చాలా తక్కువ. ఇతరులకి ఇచ్చే సమయంలో సగమైనా మీకోసం కేటాయించుకోవాలి. అది జరగాలంటే పనులకో ప్రణాళిక వేసుకోవాలి. అవి ప్రాధాన్యతా క్రమంలో జరగాలి. అప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది.
ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చు:
ప్రతిభ అనేది పుట్టుకతోనే రావాలి అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పు. టాలెంట్‌ని సాధన ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. ఫలానా పని ఫలానా వాళ్లే చేయగలరు అనే అభిప్రాయానికి స్వస్తి చెప్పి... సాధనతో మనమూ చేయగలం అని ఆలోచించి చూడండి. అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు.
- ఇదీ చూడండి : మహిళలకు రిటైర్మెంట్ పాలసీ ఎంత ముఖ్యమో తెలుసా?