మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో ఈనెల 20న జరిగిన యువకుడి హత్య కేసును రామాయంపేట పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన నాగరాజ్ గౌడ్ తన కూతుర్ని వేధిస్తున్నాడని ఏడాది క్రితం నిజాంపేట పోలీస్ స్టేషన్లో నర్సింహులు గౌడ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు నర్సింహులుపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
జైలు నుంచి వచ్చిన నర్సింహులు కక్ష కట్టి... తన కూతురుకు వచ్చే పెళ్లి సంబంధాలను చెడకొడుతున్నాడని నాగరాజు భావించాడు. అతనని హత్య చేయకుంటే తన కూతురు పెళ్లి కావడం కష్టమనుకుని... పథకం ప్రకారం ఈనెల 20న వ్యవసాయ పనులకు వెళ్లిన నర్సింహులు గౌడ్‌ను నాగరాజ్ గౌడ్ తన బంధువులతో కలిసి కర్రలు,రాళ్లతో కొట్టి చంపారు.
కేసు విచారణ చేపట్టిన రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్, నిజాంపేట ఎస్ఐ ప్రకాశ్ గౌడ్ రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. హత్య చేసిన నాగరాజుతోపాటు అతని బంధువులు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి... రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. మరో నిందితుడు మైనర్ కావడం వల్ల అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.