రెండు కుటుంబాల మధ్య బోరింగ్ సంబంధించిన వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గురజాల మండలం పాత అంబాపురంలో తెదేపా కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సీ కాలనీలో తెదేపా కార్యకర్త బత్తుల చంద్రశేఖర్, వైకాపాకు చెందిన పుల్లయ్య కుటుంబాల మధ్య బోరింగ్ విషయమై వివాదం నెలకొంది. ఇది కాస్తా గురజాల పోలీసు స్టేషన్‌కు చేరింది.
చంద్రశేఖర్‌కు మద్దతుగా దోమతోటి విక్రమ్(32), పోగా పాపులు, బత్తుల నాగరాజు, బత్తుల వాసు... పుల్లయ్యకు మద్దతుగా వైకాపా నాయకులు నిలబడ్డారు. 15రోజులుగా వీరు స్టేషన్లు చుట్టూ తిరుగుతున్నారు. శనివారం రాత్రి విక్రమ్, పాపులు, నాగరాజు, వాసు పోలీసు స్టేషన్ నుంచి ద్విచక్రవాహనాలపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన విక్రమ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన పాపులు, నాగరాజులను పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైకాపా వర్గీయులైన మంటి పుల్లయ్య, మంటి బ్రహ్మయ్య, అరికట్ల శ్రీనివాసరెడ్డి, బండి శ్రీనివాసరెడ్డి, గొట్టిముక్కల నాగులు, మామిడి పల్లి మల్లయ్యతో పాటు మరో 16 మంది కలిసి హత్య చేసినట్లు మృతుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు రాజకీయ నేపథ్యాలు లేవని పాత కక్షలతోనే హత్య జరిగినట్లు డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. విక్రమ్‌పై పలు కేసులున్నాయని, హైదరాబాద్‌లో నివసిస్తున్న అతను మళ్లీ అంబాపురానికి రావటంతో గొడవలు మొదలయ్యాయని పేర్కొన్నారు. గురజాల సీఐ రెండు వర్గాలను బైండోవర్ చేయించారని చెప్పారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో 14,419కు చేరిన కరోనా కేసులు