జైన్ ఇరిగేషన్ సిస్టం పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘట్కేసర్ కు చెందిన నారాయణ అనే అరవై ఏళ్ల కార్మికుడు కొన్నేళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూలాగే పరిశ్రమకి వెళ్లిన నారాయణ పనిచేస్తూ ఉదయం 10 గంటలకు ఉన్నట్లుండి కిందపడగా.. అతనిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు కంపెనీ సిబ్బంది తెలిపారు. అయితే నారాయణ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతదేహంతో ధర్నా..
నారాయణ మృతి పట్ల అనుమానం ఉందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని జైన్ ఇరిగేషన్ సిస్టం పరిశ్రమ ప్రధాన ద్వారం ముందు మృతదేహంతో బంధువులు ధర్నాకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న భువనగిరి రూరల్ సీఐ జానయ్య, బీబీనగర్ ఎస్ఐ రాఘవేందర్ వారికి నచ్చజెప్పారు.
ఇదీ చూడండి: రేపు రజినీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం: అపోలో వైద్యులు