ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన దుగ్గిపోగు ప్రణయ్‌కుమార్(26), మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్ జన్నారానికి చెందిన జూనుగురి రాజశేఖర్(18) జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రణయ్‌కుమార్ చెంగిచర్లలోని రెడ్డి కాలనీలో, రాజశేఖర్ సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో నివాసం ఉంటున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని అక్షర డయాగ్నొస్టిక్‌లో శిక్షణ పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్‌కు బయలుదేరారు.
వరంగల్ జాతీయ రహదారి అన్నోజిగూడ నారాయణ జూనియర్ కళాశాల వద్దకు రాగానే వెనక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ట్యాంకర్ చక్రాల కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ... అక్కడిక్కడే మృతి చెందారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీ అయినట్లు ఘట్‌కేసర్ సీఐ ఎన్.చంద్రబాబు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు సంఘటన స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.