మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో పోలం దున్నుతుండగా.. ట్రాక్టర్ తిరగబడి.. ఓ కౌలు రైతు మృతి చెందాడు. చెర్లపల్లి స్వామి అనే వ్యక్తి తాను కౌలుకు తీసుకున్న పోలాన్ని దున్నుతుండగా.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడింది. ట్రాక్టర్ కింద పడిన స్వామి మృతి చెందాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే స్వామి.. కరోనా వల్ల ఆటోకి గిరాకీ లేకపోవడంతో పోలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి.. కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాడు. కానీ పోలం దున్నుతుండగానే ఇలా జరిగిపోయింది. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఇప్పుడు వీరికి అండగా నిలచే వారు.. భవిష్యత్తుకు భరోసా ఇచ్చే వాళ్లు లేరు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కేంద్రానికి చెందిన జాలిగాం రాజు ధర్మసాగర్ పల్లిలో తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. ఈ ఘటనలో రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ముగ్గురు పిల్లలకు ఆదరణ లేకుండా పోయింది.
తొగుట మండలంలోని రాంపూర్‌కు చెందిన పిట్ల యాదగిరికి చెందిన రెండెకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో జీవనాధారం కోసం.. డోజర్ కోనుగోలు చేశాడు. అదే అతని పాలిట మృత్యు శకటమైంది. పొలం చదును చేస్తుండగా అదుపుతప్పిన డోజర్ బండి ముదుకు దూసుకెళ్లి.. వ్యవసాయ బావిలో పడిపోయింది. దాని కింద ఇరుక్కుపోయిన యాదగిరి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి రెండు క్రేన్ల సాయంతో డోజర్ బండిని పక్కకు జరిపి యాదగిరిని వెలికితీయగా.. అప్పటికే చనిపోయాడు.
సరైన శిక్షణ.. కొద్దిపాటి అప్రమత్తతో ఈ ప్రమాదాలను అరికట్టవచ్చు.. ప్రాణాలను కాపాడుకోవచ్చు.