అమెరికా టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు.
అసలేం జరిగిందంటే..?
మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన జి.నరసింహారెడ్డి, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. నరసింహరెడ్డి హైదరాబాద్-1 డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.
పిల్లలు ఇద్దరు అమెరికా టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. 6 నెలల క్రితం కుమారుడు, కుమార్తె వద్దకు నరసింహరెడ్డి దంపతులు వెళ్లారు. కుమార్తె వివాహం కుదుర్చుకునేందుకు టెక్సాస్‌కు కారులో వెళ్లగా.. అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో దంపతులు నరసింహారెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్‌రెడ్డి మృతి చెందారు. కుమార్తె మౌనికకు ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు బంధువులు అక్కడే ఉన్న తానా/ఆట సంఘం సభ్యులను సంప్రదిస్తున్నారు. నరసింహారెడ్డి హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ప్రమాదంతో నారాయణపేట జిల్లా పెద్ద చింతకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
భారత్‌లో లాక్డౌన్ విధించక ముందు మార్చి నెలలో కూతురు, కుమారుడిని చూసేందుకు తల్లిదండ్రులు అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్లారు. లాక్డౌన్ విధించడం వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వారు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. - బంధువులు