తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పదివేల రూపాయల నగదు, రెండు చరవాణీలు, ద్విచక్ర వాహనం, మొత్తం 90 వేల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
షాహీన్‌నగర్‌కు మహ్మద్ గౌస్ గతంలో నేరాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు సలామ్ బవాజెర్, ముజాహిద్ ఖాన్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటు పడిన వీరు తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఎర్రకుంట కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరు అనుమానాస్పదంగా కనిపించారు. దానితో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: రియల్ ఎస్టేట్ వెంచర్‌పై దాడి.. గంజాయి, మత్తు పదార్థాలు స్వాధీనం