తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మల్కాజ్గిరి ఏసీపీ శ్యాంప్రసాద్ రావు మీడియాకు వివరించారు.
వలస వచ్చి.. జల్సాలకు అలవాటు పడి
కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన బలిజ విక్కి జీవనోపాధి కోసం మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్‌లోని కమలానగర్‌కు వలస వచ్చాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. గతంలో జూబ్లీహిల్స్, కుషాయిగూడ, కీసర, ఓయూ, నల్లకుంట, మలక్‌పేట్, కూకట్‌పల్లి పీఎస్ పరిధిల్లో చోరీలు చేశాడు. ఈ క్రమంలో 19 దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లాడు.
పీడీ చట్టం కింద కేసు నమోదయినా అతను దొంగతనాలు చేయడం మానుకోలేదు. తర్వాత మేడిపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ పీఎస్ పరిధిల్లో 6 చోరీలు చేశాడు. చెంగిచర్ల కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విక్కీని నేర విభాగం బృందం అదుపులోకి తీసుకుందని ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి 11తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత