కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పదో తరగతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని సర్దార్ బస్తీకి చెందిన జశ్వంత్‌ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు.
జశ్వంత్ తల్లిదండ్రులు సిర్పూర్(టి)లో ఉంటున్నారు. జశ్వంత్ సర్దార్ బస్తీలోని నానమ్మ సుమిత్ర వద్ద ఉంటూ.. స్థానిక వింగ్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవలే పది పరీక్షలకు హాజరయ్యాడు.
శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన జశ్వంత్.. మళ్లీ తిరిగి రాలేదని నానమ్మ తెలిపారు. మనవడి కోసం బయటకు వెళ్లి చూడగా.. రోడ్డుపై రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నాడని సుమిత్ర పేర్కొన్నారు. స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించేలోపే జశ్వంత్ మృతి చెందాడని ఆమె కన్నీటి పర్యంత మయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: ప్రపంచంపై 'కరోనా' కరాళ నృత్యం.. 2 లక్షలు దాటిన మృతులు