వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అవి హత్యలా? ఆత్మహత్యలా? తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగపూర్‌కు చెందిన హజీరాబీ స్వగృహంలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఆమె కుమార్తె అస్మాబేగం, అల్లుడు ఖాజాపాషా, మనుమరాలు అర్షిన్... నాగర్ కర్నూల్‌లో నివాసం ఉండేవారు. రెండు రోజుల క్రితం కుమార్తె, అల్లుడు, మనుమరాలు హజీరాబీ ఇంటికి వచ్చారు. ఉదయం ఏడున్నర దాటినా ఇంట్లోంచి బయటకు రాకపోయేసరికి చుట్టుపక్కల వాళ్లు లోపలికి వెళ్లి గమనించారు. ముందు గదిలో పదేళ్ల అర్షిన్, డైనింగ్ హాల్‌లో అస్మాబేగం, వంటగదిలో హజీరాబీ, ఇంటి వెనకాల ఖాజా పాషా విగతజీవులై కనిపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వారావు ఆ ఇంటిని పరిశీలించారు.
అనుమానాలకు తావిస్తోంది
మృతదేహాల వద్ద నిమ్మకాయలు, కొబ్బరికాయ, అగర్ బత్తీలు, గులాబీ రేకులు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఖాజాపాషా మృతదేహం పక్కన ఓ గొయ్యి తీసి ఉంది. అందరి మృతదేహాల్లోనూ ముక్కు, నోటి నుంచి నురగ బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలిస్తే క్షుద్ర పూజలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొయ్యి తీసి ఉండటాన్ని బట్టి గుప్త నిధుల కోసం తవ్వి ఉంటారని అనుకుంటున్నారు. ఈ నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా... లేక క్షుద్రపూజలు చేసి ఎవరైనా మట్టుబెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలోనూ ఇదే తరహాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని.. అప్పట్లో వివాదాస్పదమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మరణాలకు సైతం క్షుద్రపూజలు, గుప్త నిధుల తవ్వకాలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో నాగపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి : బెయిల్‌పై విడుదలైన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు