సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఘట్‌కేసర్- బీబీనగర్ రైల్వే పట్టాలపై గత నెల 19న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడింది. ప్రేమ పేరుతో అజయ్... వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థరించారు. ఈ మేరకు అజయ్‌ను అరెస్టు చేశారు.
మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్వేత కనిపించకుండా పోవడంతో.. కుటుంబ సభ్యులు గత నెల సెప్టెంబర్ 18 పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరుసటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ ఠాణా సమీపంలో ఎన్ఎఫ్సీ వద్ద రైలు పట్టాలపై యువతి మృతదేహాన్ని గుర్తించారు.
గుర్తు తెలియని యువతిగా నమోదు చేసిన రైల్వే పోలీసులు.. దర్యాప్తులో మేడిపల్లి కాకతీయ నగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్వేతగా గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తులో అజయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో చేసిన వేధింపులే కారణమని తెలింది. గతంలో శ్వేతకు అజయ్‌తో పరిచయం.. వారిద్దరు చనువుగా ఉన్న సమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అజయ్ బెదిరింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.