మూడేళ్ల నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఒక ఏడాదే మిగిలి ఉంది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నంలోని వేపగుంటలో జరిగింది.
జీవీఎంసీ 92వ వార్డు వేపగుంట దరి బంటాకాలనీకి చెందిన మనీషా స్వరూప(21) నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. మూడేళ్లు కోర్సు పూర్తి చేసింది. కరోనా కారణంగా నాల్గో సంవత్సరం తరగతులు ప్రారంభం కాలేదు. ఇంటి వద్దే ఉంటోంది. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఫెయిలవుతానని భయపడిపోయింది.
ఉదయం తల్లి మల్లేశ్వరి ఆరు బయట సామాన్లు కడుగుతుండగా స్వరూప ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తలుపులు పగలుకొట్టి చూస్తే అప్పటికే మృతి చెందింది.
సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడింది. ఆ లేఖలో ఏముందంటే... ‘నన్ను క్షమించండి.. పరీక్షలకు సరిగా సన్నద్ధం కాలేదు, ఫెయిల్ అవుతానని భయపడుతున్నా..’ అని స్వరూప రాసింది.
మృతదేహాన్ని పెందుర్తి పోలీసులు కేజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి బలరాం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
ఇదీ చదవండి: నీటిసంపులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి