ముత్తూట్ ఫైనాన్స్ నిర్వాహకుల ముందు జాగ్రత్త బంగారు దొంగల ఆట కట్టించింది. తరచూ చోరీలు జరుగుతుండటంతో ఏడాది కిందటే యాజమాన్యం అప్రమత్తమైంది. వినియోగదారులు తనఖా పెట్టిన బంగారం లాకర్లలో భద్రపరిచే ముందు ఆ నగలు ఓ కవర్లలో పెట్టి దాంట్లో జీపీఎస్ ట్రాకర్‌ను సెట్ చేశారు.
ఈ నెల 22న తమిళనాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో 25 కిలోల బంగారం చోరీకి గురికాగా ఈ జీపీఎస్ ట్రాకర్లే పోలీసులకు దారి చూపేందుకు ఉపయోగపడ్డాయి. చోరీ సొత్తులో ట్రాకర్‌లు పనిచేస్తున్నాయని యాజమాన్యం గుర్తించి విషయాన్ని కృష్ణగిరి ఎస్పీ గంగాధర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వాహనం వెళ్తున్న మార్గంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో దొంగలను పట్టుకోగలిగారు. ముందుగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో సిగ్నల్స్‌ను గుర్తించారు.
తర్వాత హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు సిగ్నల్స్ చూపించడంతో నగరంలోని మూడు కమిషనర్లకు ఫోన్‌లో విషయం చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు 2 గంటల్లోనే ఆపరేషన్ ముగించారు. రాత్రి 10 గంటలకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు సమాచారం అందింది. 10.30కి 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. షాద్‌నగర్ టోల్‌ప్లాజా దగ్గర మఫ్టీలో ఉన్న కానిస్టేబుళ్లకు రాత్రి 11 గంటలకు అనుమానాస్పదంగా ఓ సుమో కనిపించింది. రాత్రి 11.30 గంటలకు తొండుపల్లి టోల్‌ప్లాజా దాటే సమయంలో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. మరోవైపు కంటైనర్ నాగ్‌పుర్‌కు వెళ్తున్నట్లు తెలుసుకొని కండ్లకోయ ఓఆర్‌ఆర్ జంక్షన్ దగ్గర అర్ధరాత్రి ఒంటిగంటకు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది పంజాబ్ లూథియానాలోని ముత్తూట్ ఫైనాన్స్ చోరీ ఘటనలో అనుభవంతో నిందితులు హోసూర్‌లో దోపిడీకి పథక రచన చేశారు. సీసీ కెమెరాలు, మొబైల్ సిగ్నల్స్, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా చోరీకి వెళ్లేటప్పుడు తమ వెంట జామర్‌ను తీసుకెళ్లారు. ఈచోరీ కోసం నిందితులు రూ.10 లక్షలకు పైగా ఖర్చు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.