అన్నదమ్ముల మధ్య గొడవ తమ్ముడి ప్రాణాలు తీసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం నడిమి తండాకు చెందిన సురేష్, పీరియా అన్నదమ్ములు. శనివారం రాత్రి సురేష్ తన భార్యతో గొడవకు దిగాడు. వద్దంటూ అన్న పీరియా తమ్ముడిని వారించాడు. అంతే అక్కడితో అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. కోపం ఆపుకోలేక ఇద్దరూ ఘర్షణ పడ్డారు.
చుట్టుపక్కల వారు ఇద్దరినీ ఆపారు. కానీ అప్పటికే సురేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సురేష్ మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.