హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో నిన్న రాత్రి తప్ప తాగి వీరంగం సృష్టించిన రౌడీ షీటర్ గణేష్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. గతంలో ఒకసారి జైలుకి వెళ్లినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
స్థానికులపై అసభ్య పదజాలం ప్రయోగించి వారిపై దాడికి గణేష్ ప్రయత్నించడంతో జనాలు అతనిపై తిరగబడ్డారు. దీంతో గాయాలపాలైన గణేష్... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో ఘర్షణకి దిగి వారిని అడ్డుకున్నాడు. బంధువులూ అతనికి మద్దతు పలికారు. గాయాలపాలైన గణేష్ని పోలీసులు ఆస్పత్రికి తరలించే యత్నంలో మార్గమధ్యలో వైన్ షాప్ వద్ద ఆగి మద్యం కొనాలని వాదించడంతో... చేసేదేమీ లేక కానిస్టేబుల్ మద్యం కొని అతన్ని ఆస్పత్రికి తరలించాడు.
కానిస్టేబుల్ వైఖరికి అసంతృప్తితో ఉన్న అధికారులు అతనిపైన కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. రౌడి షీటర్, అతనికి అండగా ఉన్న బంధువులు, అతనిపై దాడి చేసిన వ్యక్తుల పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
కొత్తగా వచ్చిన ఎస్సైతో గత కొద్ది రోజులుగా గణేష్ సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: రూ. 31.26 లక్షల హవాలా డబ్బును పట్టుకున్న పోలీసులు